Sunday, March 19, 2023

జూనియర్‌ కాలేజీల్లో బయోమెట్రిక్‌! అన్నీ కాలేజీల్లో అమలు చేయాల్సిందే

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఆధార్‌ బేస్డ్‌ బయోమెట్రిక్‌ విధానం కచ్చితంగా అమలు చేయాలని ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ నిర్ణయించింది. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో కొంత మంది అధ్యాపకులు, సిబ్బంది ఇష్టానుసారంగా కళాశాలలకు రావడం..పోవడం ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ దృష్టికి వచ్చింది. అది ఆర్థిక ఖజానాపై, విద్యార్థుల ఉత్తీర్ణతా శాతంపై ప్రభావం చూపుతున్నట్లు గుర్తించారు. ప్రభుత్వపరంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా సమయపాలన పాటించకపోవడాన్ని ఇంటర్‌బోర్డు సీరియస్‌గా తీసుకుంది. సమయపాలన అమలు కోసం బయోమెట్రిక్‌ హాజరును వెంటనే ప్రవేశపెట్టాలని ఇంటర్‌ విద్యాశాఖ ఆదేశించింది. కాలేజీలకు రాకున్నా కొంత మంది వస్తున్నట్లు చూపి వేతనాలు తీసుకుంటున్నారనే విషయం విద్యాశాఖ దృష్టికి వెళ్లడంతో ఇక మీదట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అధ్యాపకులకు, నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి కచ్చితంగా బయోమెట్రిక్‌ విధానంను అమలు చేయాల్సిందేనని ఇంటర్‌ విద్యాశాఖ కమిషనర్‌గా నవీన్‌ మిట్టల్‌ ఈనెల 1వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -
   

దీనికి సంబంధించిన చర్యలు వెంటనే తీసుకోవాలని ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఆయన ఆదేశించారు. అధ్యాపకులు, సిబ్బందికి ఇచ్చే జీతాలు, గౌరవ వేతనాలను సక్రమంగా ఇవ్వడంలో భాగంగానే ఈమేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఉత్తర్వులో పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో నాలుగేళ్ల క్రితమే బయోమెట్రిక్‌ విధానం అమలుకు కార్యాచరణ చేపట్టారు. కళాశాలలకు బయోమెట్రిక్‌ పరికరాలను కూడా అప్పట్లో సరఫరా చేశారు. కానీ నిర్వహణాలోపం, సిగ్నల్‌ సమస్య, తదితర సాంకేతిక కారణాలతో అమలుకు నోచుకోలేదు. ఇంతలోనే కోవిడ్‌ వ్యాప్తి జరగడంతో బయోమెట్రిక్‌ అమలును నిలిపేశారు. అనంతరం కళాశాలలు తెరుచుకోవడం, ఆన్‌లైన్‌లోనే బోధన జరగడంతో బయోమెట్రిక్‌ పరికరాలన్నీ మూలనపడ్డాయి. అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థుల హాజరు విషయంలో పారదర్శకత పాటించాలనే ఉద్ధేశంతో ఇంటర్‌ విద్యాకమిషనర్‌ కార్యాలయంతోపాటు ప్రతీ కాలేజీల్లో బయోమెట్రిక్‌ విధానం అమలు చేయాలని ఇంటర్‌ విద్యాశాఖ ఇటీవల నిర్ణయించింది.

ఈక్రమంలోనే గతేడాది నవంబర్‌ నెల నుంచి కమిషనర్‌ కార్యాలయంలో, డిసెంబర్‌ నుంచి 33 జిల్లాల్లోని డీఐఈఓ కార్యాలయాల్లో, ఈ ఏడాది జనవరి 1 నుంచి జూనియర్‌ కాలేజీల్లో బయోమెట్రిక్‌ విధానం అమలు చేయాలని నిర్ణయించారు. ఈనేపథ్యంలోనే కమీషనర్‌, డీఐఈఓ కార్యాలయాలతోపాటు కొన్ని జూనియర్‌ కాలేజీల్లోనూ ప్రస్తుతం బయోమెట్రిక్‌ విధానం అమలవుతోంది. అయితే అమలుకానీ చాలా కాలేజీల్లో దీన్ని ఈనెల 1 నుంచి వెంటనే కచ్చితంగా అమలు చేయాలని నవీన్‌ మిట్టల్‌ తన ఉత్తర్వుల్లో ఆదేశాలు జారీ చేశారు.

3 గంటలకు తక్కువ ఉంటే గైర్మాజరే…

రాష్ట్రంలో 406 ప్రభుత్వ, 39 ఎయిడెడ్‌ కాలేజీలున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో రెగ్యులర్‌ ఉద్యోగులు దాదాపు 820 మందికి పైగా ఉన్నారు. 3600 మంది కాంట్రాక్టు, ఔట్‌సోరింగ్‌ ఉద్యోగులు, గెస్ట్‌ ఫ్యాకల్టిdలు 1652 మంది, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది మొత్తం 800, ప్రిన్సిపాల్స్‌ 406 మంది, డీఐఈఓలు 33 మంది వరకు ఉంటారు. అయితే వీరందరికి బయోమెట్రిక్‌ అమల్లోకి తేవాలని నిర్ణయించారు. డ్యూటీ టైమింగ్స్‌ కూడా ఖరారు చేశారు. ఇన్‌ అండ్‌ అవుట్‌ పంచ్‌కు మధ్య గ్యాప్‌ 6 గంటల సమయం ఉండాలని నిర్ణయించారు. ఒక ఉద్యోగి కాలేజీలో 6 గంటల వరకు డ్యూటీ చేస్తేనే ఫుల్‌ డే హాజరుగా పరిగణించనున్నారు. 3 గంటల వరకు ఉంటే హాఫ్‌ డే హాజరు వేయనున్నారు. ఒకవేళ 3 గంటల కంటే తక్కువగా ఉంటే అలాంటి వారికి గైర్హాజరు లేదా సెలవుగా పరిగణించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈనేపథ్యంలో అన్ని కాలేజీల్లో బయోమెట్రిక్‌ విధానం తప్పనిసరిగా పాటించాలని సూచించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులకు కూడా అన్ని కాలేజీల్లో బయోమెట్రిక్‌ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement