Saturday, May 4, 2024

Big story : వ్యవసాయంలో ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​.. ‘సాగుబాగు’తో సత్ఫలితాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలో వ్యవసాయం, ప్రభుత్వ సేవలు తదితర రంగాల్లో కృత్రిమ మేధ(ఏఐ)ను విరివిగా వినియోగిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఏఐ సాంకేతికత పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చాలని అన్నారు. అందుకు తగ్గట్లుగా సాంకేతికత వాడకానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో 50 శాతం మంది వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నారని, వ్యవసాయంలో సాగుబాగు పేరుతో ఏఐ వాడి ఉత్పత్తి పెంచామన్నారు. లక్షకుపైగా మంది పెన్షనర్ల పెన్షన్ల రెన్యువల్‌ కోసం రియల్‌ టైమ్‌ డిజిటల్‌ అథెంటికేషన్‌ ఆఫ్‌ ఐడెంటిటీ (ఆర్టీడీఏఐ)ను వినియోగిస్తున్నామన్నారు. మంగళవారం హైదరాబాద్‌ ట్రిపుల్‌ ఐటీలోని అప్లైడ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రీసెర్చ్‌ సెంటర్‌(ఐఎన్‌ఏఐ)లో జరిగిన ఏఐ పాపులేషన్‌ స్కేల్‌ కార్యక్రమంలో ఐ రాస్తే, బోధ్‌యాన్‌, మైక్రోలాబ్స్‌ వంటి ఏఐ సాంకేతికత ఆధారిత కార్యక్రమాలను కేటీఆర్‌ ప్రారంభించారు. ఆదివారం కూడా ఇంట్లో కూర్చొని డ్రైవింగ్‌ లైసెన్స్‌ రెన్యువల్‌ చేసుకునే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్‌ చెప్పారు. కొత్త సాంకేతికతలపై పరిశోధనలకు తెలంగాణ కేంద్రంగా మారిందని అన్నారు. సామాన్యునికి సాంకేతికత ఉపయోగపడాలని సీఎం కేసీఆర్‌ ఎప్పుడూ చెబుతుంటారన్నారు. ట్రిపుల్‌ ఐటీకి ప్రభుత్వం ఏం కావాలన్న ఇస్తుందని చెప్పారు. ట్రిపుల్‌ ఐటీలో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటుకు సహకరిస్తామన్నారు. జీవితాలను కాపాడడానికి, జీవనప్రమాణాలను పెంచడానికి సాంకేతికత ఏ విధంగా ఉపయోగపడుతుందనేదే ముఖ్యమైన అంశమని తెలిపారు. ప్రస్తుతం వ్యాపారాల్లో ఏఐ అత్యంత ప్రాధాన్యంగా మారిందని చెప్పారు. 2020ని తెలంగాణ ప్రభుత్వం ఏఐ సంవత్సరంగా ప్రకటించిందని గుర్తు చేశారు. ఏఐ భారత జీవీఏ వృద్ధిలో 2035కల్లా మరో ట్రిలియన్‌ డాలర్‌ విలువను జోడిస్తుందన్నారు. తెలంగాణ ఇప్పటికే ఏఐ ఫ్రేమ్‌ వర్క్‌ను లాంచ్‌ చేసిందని, ఏఐ మిషన్‌ కూడా ప్రారంభించామన్నారు. ఏఐ, ఎమ్‌ఎల్‌ సాంకేతికతల్లో స్కిల్లింగ్‌ కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

ఇప్పటికే టాస్క్‌ ద్వారా 2500 మందికి ఏఐలో శిక్షనిచ్చామన్నారు. ఏఐ ఫర్‌ యూత్‌ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు శిక్షణనిచ్చామన్నారు. ఇటీవలే అగ్రికల్చర్‌ డేటా మేనేజ్‌మెంట్‌ పాలసీని ప్రారంభించామని తెలిపారు. అగ్రికల్చర్‌ డేటా ఎక్స్చేంజ్‌ కూడా ఏర్పాటు చేశామన్నారు. సిరిసిల్లలో రైతులకు ఉపయోగపడేలా ఇప్పటికే ఏఐ ఆధారిత వెబ్‌సైట్‌ ఏర్పాటు చేశామన్నారు. మన దేశంలో పెద్దగా చదువు లేని వారు కూడా సాంకేతికత ఏది నేర్చించినా త్వరగా నేర్చుకుంటారని తెలిపారు. రోడ్డు భద్రతకు ఐ రాస్తే లాంటి పరిష్కారాలు రావాలన్నారు. వ్యవసాయంలో సాగుబాగు పేరుతో ఏఐ సాంకేతికతను వాడుతున్నామన్నారు. ఇందులో భాగంగా 50 వేల మంది రైతులకు ఇప్పటికే ప్రయోజనం కలిగించామన్నారు. ఏఐ ఆధారిత పెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ విధానం మంచి ఫలితాలిచ్చిందన్నారు. రియల్‌ టైమ్‌ డిజిటల్‌ అథెంటికేషన్‌(ఆర్టీడీఏ) ద్వారా పౌరులకు ఎన్నో సేవలందిస్తున్నామన్నారు. ఇంటెలిజెంట్‌ సొల్యూషన్‌ ఫర్‌ రోడ్‌ సేఫ్టీ త్రూ టెక్నాలజీ అండ్‌ ఇంజనీరింగ్‌ ( ఐ రాస్తే) ప్రోగ్రామ్‌ ద్వారా టీఎస్‌ఆర్టీసీతో కలిసి తెలంగాణలో రోడ్డు భద్రతను పెంచనున్నారు. కార్లలో రియల్‌ టైమ్‌ డేటా కోసం బోధ్‌యాన్‌ ప్రాజెక్టు ఉపయోగపడనుంది. ఈ కార్యక్రమంలో ట్రిపుల్‌ ఐటీ ప్రతినిధులు, ఉబర్‌ యాజమాన్య ప్రతినిధులు, తెలంగాణ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ వింగ్‌ డైరెక్టర్‌ రమాదేవి లంక తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement