Saturday, April 27, 2024

కేసులు పెరగటానికి అసలు కారణం కేసీఆరే – భట్టి

కరోనా నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫ‌ల‌మైందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కరోనా నియంత్రణ కోసం సీనియర్ ఐఏఎస్ లతో మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే వెంట‌నే కోవిడ్ ను ఆరోగ్యశ్రీలో చేరాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడానికి కేసీఆరే కారణమని ఆరోపించారు భట్టి. రాష్ట్రమంతటా అతలాకుతలం అవుతుంటే ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రజలను గాలికొదిలేసరన్నారు. రాబోయే విపత్కర పరిస్థితులను అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా కేసీఆర్ ప‌ట్టించుకోలేదని విమర్శించారు భట్టి.

మున్సిపల్ ఎన్నికలు వద్దంటే పెట్టారు. వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఎన్నికల తర్వాత భారీగా కేసులు, మరణాలు పెరిగాయి. గత బడ్జెట్ సమావేశాల్లోనే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సూచించాం. సీఎం స్పందించి తప్పనిసరిగా పరీశీలన చేస్తానని చెప్పారు. ఏడాది గడిచినా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వ్యాక్సినేషన్, కరోనా టెస్టులు, ట్రీట్ మెంట్, బెడ్స్, ఆక్సిజన్ వంటివి మానిటరింగ్ కమిటీనే చేసేలా ఏర్పాట్లు చేయాలి. కోవిడ్ పరిస్థితులను ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఢిల్లీ తరహాలో ఒక యాప్ ను కూడా అందుబాటులోకి తీసుకురావాలన్నారు.

ప్రతీ నియోజకవర్గంలో ఐసొలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. అన్ని మండల కేంద్రాల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్లను కనీసం ఆక్సిజన్ తో కూడిన 30 పడకల ఆస్ప‌త్రిగా మార్చాలి. గ్రామాల్లో కరోనా వచ్చినవారు ఒక్కసారిగా జిల్లా ఆస్ప‌త్రులకు వస్తే.. బెడ్స్ దొరకడం లేదు. రాజధానిలోనూ అదే పరిస్థితి ఉందన్నారు. గత ప్రభుత్వాలు మసూచీ, కలరా, పోలియో వంటివి రాకుండా ఉండేందుకు ఉచితంగా వ్యాక్సిన్లను వేయించాయి. కరోనా వ్యాక్సినేషన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. 4 కోట్ల మందికి ఎన్ని డోసులు కావాలి? ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి? అనే వాటిపై క‌చ్చితమైన యాక్షన్ ప్లాన్ లేదన్నారు. వ్యాక్సిన్ ల ధర విషయంలోనూ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించడం లేదన్నారు భట్టి.

Advertisement

తాజా వార్తలు

Advertisement