Saturday, April 27, 2024

త్వరలో భారత్ టూరిజం ఇన్వెస్టర్స్ కాంక్లేవ్.. దేశ, విదేశీ పెట్టుబడిదారులకు ఆహ్వానం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పర్యాటక రంగంలో దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు త్వరలో మనదేశంలో “భారత్ టూరిజం ఇన్వెస్టర్స్ కాంక్లేవ్” నిర్వహించనున్నట్టు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్ లోని ధరంశాలలో మూడు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్ర పర్యాటక మంత్రుల జాతీయ సదస్సులో ఆయన ముగింపు ప్రసంగం చేశారు.

ఈ సదస్సులో సహాయ మంత్రి అజయ్ భట్, వివిధ రాష్ట్రాల మంత్రులు, నీతి ఆయోగ్ సభ్యులు సీఈవో అమితాబ్ కాంత్, టూరిజం డైరెక్టర్ జనరల్ కమలవర్ధన్ రావు, తెలంగాణ టూరిజం బోర్డ్ ఎండీ మనోహర్ రావు, కార్యదర్శులు, అధికారులు, పలు కంపెనీల వాటాదారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సదస్సులో పర్యాటక ప్రదేశాలను ప్రమోట్ చేయడంలో డిజిటల్ మార్కెటింగ్ పాత్ర, వైద్య, అటవీ, వైల్డ్ లైఫ్, అగ్రి, సుస్థిర, బాధ్యతాయుతమైన పర్యాటక రంగాభివృద్ధిపై మేథోమధనం జరిగింది. వివిధ రాష్ట్రాల్లో సాగుతున్న పర్యాటకాభివృద్ధిపై వీడియోలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ… ఇలాంటి సదస్సులు మీ రాష్ట్రాల్లో కూడా నిర్వహించాలంటూ మంత్రులకు సూచించారు.

స్వచ్ఛత-పరిశుభ్రతకు ప్రాధాన్యం
 పేపర్లు, టీవీల ద్వారా మీడియాను భాగస్వామ్యం చేస్తూ దేఖో అప్నా స్టేట్ అంటూ టూరిస్ట్ ప్రాంతాలను ప్రమోట్ చేయాలన్నారు. తాను వెళ్లిన చాలా పర్యాటక ప్రాంతాల్లో నిర్వహణ సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, స్వచ్ఛత-పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ఆయన కోరారు. రాబోయే రోజుల్లో 500 పర్యాటక ప్రాంతాల్లో త్రివర్ణ పతాకం ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, జాతీయ జెండాతో ఆ స్థలానికి గుర్తింపు మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. హోటల్స్ ఎంట్రన్స్ వద్ద త్రివర్ణ పతాకంతో పాటు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లోగోను ఏర్పాటు చేయాలన్నారు. 

ఉత్తమ వెబ్ సైట్ రూపకల్పన
భారత్ ప్రతిష్టను పెంచేలా అత్యుత్తమ వెబ్ సైట్ రూపొందించాలనేది ప్రధానమంత్రి ఆకాంక్ష అన్న కిషన్ రెడ్డి, రాష్ట్రాల నుంచి వివిధ పండుగలు, టూరిస్ట్ గమ్య స్థానాలకు సంబంధించిన ఫొటోలు, సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని రాష్ట్రాలు సహాయ సహకారాలు అందిస్తేనే వెబ్ సైట్ తయారవుతుందని చెప్పారు. జవాబుదారీతనం ఉన్న ప్రొఫెషనల్ సోషల్ మీడియా టీములను ఏర్పాటు చేసుకుని ప్రమోషన్ చేసుకోవాల్సిందిగా ఆయన సూచించారు. 

- Advertisement -

రాజధానుల్లో కేంద్ర అధికారులు
రాష్ట్రాల రాజధానుల్లో కేంద్ర టూరిజం అధికారులను నియమిస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. గైడ్స్, రవాణా, హోటల్స్, అధికారులతో సమన్వయం చేసుకుంటూ వారు పని చేస్తారని వెల్లడించారు. జాతీయ టూరిజం పాలసీకి అందరి మద్దతు కావాలని కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. అందరం కలిసి ఒకే గొడుగు కింద పని చేద్దామని పిలుపునిచ్చారు. వివిధ దేశాల రాయబార కార్యాలయాలలో పని చేస్తున్న, సదస్సుకు హాజరైన అధికారులను ఈ సందర్భంగా కిషన్ రెడ్డి అందరికీ పరిచయం చేశారు. వారి సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కోరితే టూరిస్ట్ ప్రాంతాల కోసం ప్రత్యేక రైళ్లను ఇస్తామని, నిర్వహణ బాధ్యతలు మాత్రం మీరే చూసుకోవాలని స్పష్టం చేశారు. 

యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోండి
పెట్టుబడులను ఆకర్షించడం, నిధులు, పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, ప్రయివేట్ సంస్థలను ఎలా భాగస్వాములను చేయాలి వంటి అంశాలపై రాష్ట్రాల వద్ద జిల్లాల వారీగా, సెక్టార్ల వారీగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధంగా ఉండాలని ఆయన నొక్కి చెప్పారు. ఇండియా టూరిజం ఇన్వెస్టర్స్ కాంక్లేవ్ కు సంబంధించి కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని చెప్పారు. పెద్ద సంస్థల నుంచి చిన్న స్టార్టప్ ల వరకు ప్రతి ఒక్కరినీ ఈ రంగంలోకి ఆహ్వానించాలని తెలిపారు. టూరిజం వాహనాల విషయంలోనూ శ్రద్ధ పెట్టాలని తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు నిబంధనలు ఉన్నాయని,  ముఖ్యమంత్రులు, రవాణా శాఖ మంత్రులతో చర్చించి ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు. అందరం కలిసి పని చేస్తూ టూరిజం రంగంలో భారత్ కీలక పాత్ర పోషించేలా చేయాలని అభ్యర్థించారు. ప్రసాద్, స్వదేశీ దర్శన్ పథకాల్లోనూ పరస్పర సహకారం ఉండాలని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 

యువ టూరిస్ట్ క్లబ్బులకు పెద్దపీట
హైస్కూల్ నుంచి యూనివర్సిటీల వరకు విద్యార్థులతో యువ టూరిస్ట్ క్లబ్బులు ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన మంత్రులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించారు. 2047 నాటికి లక్ష కోట్ల డాలర్ల లక్ష్యాన్ని సాధించేందుకు లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు కేంద్రం ప్రకటించింది. 2030 నాటికి 13.7 కోట్ల ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తోంది. 2024 నాటికి పర్యాటక రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement