Monday, April 29, 2024

భళా భవాని, ఆసియా ఫెన్సింగ్‌లో కాంస్యం.. భారత్​కు ఇదే తొలి పతకం

ఆసియా ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి కాంస్యం సాధించడం ద్వారా ఒలింపియన్‌ సీఏ భవానీ దేవి చరిత్ర సృష్టించింది. సోమవారం చైనాలోని వుక్సీలో జరిగిన మహిళల సెబర్‌ సెమీఫైనల్‌లో ఓటమిపాలై రజతపతకంతో సరిపెట్టుకుంది. ఉజ్బెకిస్తాన్‌కు చెందిన జైనబ్‌ దయిబెకోవా చేతిలో 14-15తో భవానీ ఓడింది. అయితే, ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో భారత్‌కు తొలి పతకాన్ని సాధించిపెట్టింది. అంతకు ముందు క్వార్టర్‌ ఫైనల్‌లో ప్రస్తుత చాంపియన్‌ జపాన్‌కు చెందిన మిసాకి ఎమురాపై 15-10తో నెగ్గింది. కైరోలో జరిగిన 2022 ప్రపంచ ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో మిసాకి మహిళల సెబర్‌ బంగారు పతకాన్ని గెలుచుకుంది.

గతంలో జపాన్‌తో ఆడిన అన్ని మ్యాచ్‌లలో ఓడిన భవానీకి మిసాకిపై ఇది తొలి విజయం. 29 ఏళ్ల భవాని కజకిస్థాన్‌కు చెందిన దోస్పే కరీనాను ఓడించడానికి ముందు 64 రౌండ్‌లో బై పొందింది. ఆ తర్వాత భవాని ప్రీక్వార్టర్స్‌లో మూడో సీడ్‌ ఒజాకి సెరీని 15-11తో చిత్తు చేసింది. చారిత్రక విజయాన్ని సాధించిన భవానీని ఫెన్సింగ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సెక్రటరీ జనరల్‌ రాజీవ్‌ మెహతా అభినందించారు. భారత ఫెన్సింగ్‌కు ఇది చాలా గర్వకారణమైన రోజు. ఇంతకు ముందు ఎవరికీ సాధ్యం కానిది భవానీ సాధించింది. ప్రతిష్టాత్మకమైన ఆసియా చాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన తొలి భారత ఫెన్సర్‌గా నిలిచింది అని మెహతా మీడియాతో చెప్పారు. ఆమె సెమీఫైనల్‌లో కేవలం ఒకే పాయింట్‌ తేడాతో ఓడింది. కాబట్టి ఒక రకంగా ఆమెకిది గొప్పవిజయమే అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement