Sunday, May 5, 2024

Delhi | ఢిల్లీ తెలంగాణ భవన్‌లో శేజల్ నిరాహార దీక్ష.. దుర్గం చిన్నయ్యపై కేసు నమోదు చేయాలని డిమాండ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య (బీఆర్ఎస్)పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న ఆరిజిన్ డైరీ వ్యవస్థాపకురాలు బోడపాటి శేజల్ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం గం. 1.00 సమయంలో దీక్ష ప్రారంభించిన శేజల్.. మంగళవారం నుంచి ప్రతి రోజూ ఉదయం గం. 11.00 నుంచి సాయంత్రం గం. 5.00 వరకు దీక్ష చేపట్టనున్నట్టు ప్రకటించారు. కామ పిశాచిలా వ్యవహరిస్తూ తనను లైంగికంగా వేధించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై కేసు నమోదు చేయాలని ఆమె పట్టుబట్టారు.

- Advertisement -

ఆరిజిన్ డైరీ ప్లాంటు నిర్మాణం కోసం ప్రభుత్వ భూమిని తన భూమిగా చూపించి తమ వద్ద రూ. 30 లక్షలు తీసుకున్నారని, కుట్రపూరితంగా మోసగించిన దుర్గం చిన్నయ్యను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. 2023 జనవరి 11 నుంచి 13 వరకు అక్రమంగా నిర్బంధించి ఎమ్మెల్యే దగ్గరకు రాత్రి సమయంలో వెళ్లాలంటూ బలవంతం చేసిన సీఐ బాబూరావు, ఎస్సై ఆంజనేయులు, మరో ఎస్సై రాజశేఖర్‌లను తక్షణమే సస్పెండ్ చేయాలని కూడా శేజల్ కోరారు. హైదర్‌గూడ ఎమ్మేల్యే క్వార్టర్స్‌లో 404 వ నెంబర్ క్వార్టర్లో తనపై జరిగిన లైంగిక దాడితో పాటు ఎంతో మంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్న ఎమ్మేల్యేపై ప్రభుత్వం తక్షణమే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సీసీటీవీ ఫుటేజి బయటకు తీసి తెలంగాణ ప్రజలకు ఎమ్మేల్యే చిన్నయ్య నిజ స్వరూపం తెలియజేయాలని అన్నారు.

ఎమ్మేల్యే అండతో ఆయన అనుచరులు బెల్లంపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ లోపలే తమ కారు టైర్లలో గాలి తీసి తమను చంపేందుకు ప్రయత్నించారని, సోషల్ మీడియా ద్వారా తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ చేశారని శేజల్ ఆరోపించారు. యాసిడ్ పోసి చంపేస్తానంటూ బెదిరించిన ఎమ్మెల్యే అనుచరులు శ్రీపతి రమణ, చిల్లరపు సంతోష్, కుమ్మరి పోచన్న, కోనంకి కార్తీక్, భీమా గౌడ్, గోలి శివ, సున్న రాజులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని శేజల్ అన్నారు. తమ సంస్థ మీద తప్పుడు కేసులు నమోదు చేయడం కారణంగా నష్టపోయిన బాధితుల్ని తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement