Saturday, April 27, 2024

మంచం పట్టిన ఢిల్లీ.. వణికిస్తున్న కరోనా, ఫ్లూ జ్వరాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ రాజధాని ఢిల్లీ మంచం పట్టింది. కరోనా, ఫ్లూ, వైరల్ ఫీవర్లతో వణికిపోతోంది. ఢిల్లీ-ఎన్సీఆర్(నేషనల్ క్యాపిటల్ రీజియన్) పరిధిలో ప్రతి పది కుటుంబాల్లో 8 కుటుంబాలు జ్వరాలతో ఇబ్బంది పడుతున్నాయి. జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి, ఒళ్లు నొప్పులతో చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో నిర్వహించిన ఆన్‌లైన్ సర్వేలో 80 శాతం ఇళ్లలో ఒకరు లేదా ఇద్దరు కరోనా లేదా ఫ్లూ బారిన పడ్డారని వెల్లడైంది. ఢిల్లీలో గడిచిన మూడు వారాల్లోనే కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత 30 రోజుల్లో 10 ఇళ్లలో 8 ఇళ్లలోని వారు కోవిడ్, వైరల్ జ్వరాలతో అల్లాడుతున్నారని సర్వేలో తేలింది. చాలామంది ఇళ్లలోనే కోవిడ్ హోమ్ టెస్ట్ కిట్స్‌తో పరీక్షలు చేసుకుంటున్నారు. ఆన్‌లైన్ సర్వేకు ఢిల్లీ, గురుగ్రామ్, ఘజియాబాద్, నోయిడా, ఫరీదాబాద్ ప్రాంత వాసులు 11 వేల మంది కంటే ఎక్కువగా స్పందించారు. అందులో 63 శాతం మంది పురుషులు కాగా 37 శాతం మంది మహిళలు ఉన్నారు. 54 శాతం మంది తమ కుటుంబాలలో కనీసం ఇద్దరికి జ్వరం, ముక్కు కారటం, దగ్గు, తలనొప్పి, ఒళ్లునొప్పు వంటి వైరల్ ఫీవర్ల లక్షణాలు కలిగి ఉన్నారని తెలిపారు.

23 శాతం మంది తమ కుటుంబంలో నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది లక్షణాలను కలిగి ఉన్నారని చెప్పారు. ఈ గణాంకాలను బట్టి చూస్తే కేవలం 42 శాతం కుటుంబాలు గతేడాది ఇదే సమయంలో వైరల్ ఫీవర్ లక్షణాలు ఉన్నట్టు వెల్లడింది
కుటుంబంలో ఒకరికి జ్వరం వస్తే మిగతా వారికి కూడా ప్రబలుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వర్షాకాలంలో ఫ్లూ వంటి వైరల్ జ్వరాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అప్రమత్తంగా ఉంటూ ముందుజాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

కరోనా విజృంభణ..

ఈ ఏడాది కరోనా వైరస్ విజృంభించే ప్రమాదమున్నట్టు తెలుస్తోంది. గత రెండు మూడు వారాలుగా ఢిల్లీలో కోవిడ్-19 కేసుల పెరుగుదల ఆందోళన రేకెత్తిస్తోంది. శుక్రవారం ఢిల్లీలో 1,964 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య నిన్నటి కంటే 15% ఎక్కువ. ముగ్గురు కరోనాతో మరణించారు. కోవిడ్ నిబంధనలు పాటించకపోవడం, ప్రభుత్వ ఆదేశానుసారం మాస్క్‌లు పెట్టుకోకపోవడం, రద్దీ ప్రాంతాల్లో గుంపులుగా తిరగడం వంటివి మళ్లీ కరోనా విజృంభణకు కారణమవుతోంది. కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో కరోనా మార్గదర్శకాలను పాటించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement