Wednesday, April 17, 2024

కనిపించని మున్సిపాలిటీలు..! ఆన్‌లైన్‌లో పన్నులు చెల్లింపునేకు ఇబ్బందులు

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో : ప్రభుత్వ వెబ్‌సైట్‌లో చూద్దామన్నా కొన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు కనిపించడం లేదు. దీంతో ఆన్‌లైన్‌లో పన్నులు చెల్లించాలంటే ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తుంది. ఆయా పురపాలక, నగర పంచాయతీలకు సంబంధించిన సమాచారం కోసం వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసినా కనిపించడం లేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపాలిటీలతో పాటు ఉమ్మడి 13 జిల్లాల పరిధిలోని 31 నగర పంచాయతీల పరిధిలోని ప్రజలకు ఆన్‌లైన్‌ సేవలు అందని ద్రాక్షాలా మారుతున్నాయి. ఆయా నగర పంచాయతీల పరిధిలో ఆస్తిపన్నులు, ఇతర పన్నులకు సంబంధించి స్వయంగా కార్యాలయానికి వెళ్లి తెలుసుకోవాల్సి వస్తుంది. అదే ప్రభుత్వం అందుబాటులో ఉంచిన పురపాలక వెబ్‌సైట్‌లో ఆయా మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు అందుబాటులో ఉంటే ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలు అన్ని రకాల ప న్నులతో పాటు ఇతర సమాచారాన్ని కూడా సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అయితే సంబంధిత శాఖ అధికారులు మాత్రం పలు మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను అప్‌లోడ్‌ చేయలేదు. అందుకుగల కారణాలు తెలియడం లేదు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడం లేదు. అందుకు సబంధిత శాఖల అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని వీలైనంత వరకూ ప్రజలకు తక్కువ సమయంలో అతి ఎక్కువ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే మరోవైపు పల్లెల నుండి పట్టణాలుగా మారిన మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు చూద్దామన్నా ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. దీంతో ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురికావల్సి వస్తోంది.

పూర్తిస్థాయిలో అప్‌గ్రేడ్‌ కాని మున్సిపల్‌ వెబ్‌సైట్‌..

రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించారు. కొత్త జిల్లాలకు సంబంధించి వెబ్‌సైట్‌లో 25 జిల్లాలను మాత్రమే అప్‌లోడ్‌ చేశారు. అల్లూరు సీతారామ రాజు మన్యం జిల్లా పేరు కనిపించడం లేదు. అదే విధంగా కోనసమీ జిల్లా పేరును అంబేద్కర్‌ కోన సీమ జిల్లాగా మార్చలేదు. రెండు జిల్లాలకు సంబంధించి అప్‌గ్రేడ్‌ కాలేదు. ఇక ఆయా జిల్లాల పరిధిలోని కొన్ని మున్సిపాలిటీలదీ అదే పరిస్థితి. కొన్ని మున్సిపాలిటీలకు గ్రేడ్‌లు మార్చారు. ఆదిశగా మారిన గ్రేడ్‌లను వెబ్‌సైట్‌లో మార్పు చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా సెలక్షన్‌ గ్రేడ్‌లో 6, స్పెషల్‌ గ్రేడ్‌లో 8, గ్రేడ్‌-1లో 15, గ్రేడ్‌-2లో 29, గ్రేడ్‌-3లో 18 మున్సిపాలిటీలు ఉన్నాయి. అయితే, వీటికి సంబంధించి కొన్ని మున్సిపాలిటీల గ్రేడ్‌లు మారాయి. వాటిని పూర్తిస్థాయిలో అప్‌లోడ్‌ చేయలేదు. ఇక నగర పంచాయతీల విషయానికొస్తే 31 నగర పంచాయతీలు చూద్దామన్నా కనిపించడం లేదు. గత రెండేళ్లలో దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా 31 నగర పంచాయతీలను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ఏడాది వాటిలో కొన్ని నగర పంచాయతీలకు ఎన్నికలను కూడా నిర్వహించింది. కొత్తగా పాలక మండళ్లు కూడా ఏర్పాటయ్యాయి. అయినా, ఆన్‌లైన్‌లో చూద్దామన్నా అవి కనిపించడం లేదు. వీటితోపాటు గత ఏడాది మున్సిపాలిటీలుగా మారిన కొన్ని నగర పంచాయతీలు కూడా ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు.

ఆన్‌లైన్‌ చెల్లింపులకు ఇబ్బందులు..

ఇక మున్సిపల్‌ శాఖకు ఆన్‌ లైన్‌ ద్వారా వివిధ రకాల పన్నులను ప్రజలు చెల్లిస్తుంటారు. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉంటూ ఉదయాన్నే కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చే వారికి పన్నుల చెల్లింపులు ఇబ్బందికరంగా మారాయి. వారు కార్యాలయ పనివేళలు అయిన తరువాత ఈ కార్యాలయాల పని వేళలు కూడా అయిపోతున్నాయి. వారికి సెలవులు ఉన్నప్పుడు ఈ కార్యాలయాలకు కూడా సెలవలు ఉంటున్నాయి. దీంతో ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్నులు, వాటర్‌ ట్యాక్‌ ఇతరత్రా పన్నులను చెల్లించడంలో ఇబ్బందులెదురవుతున్నాయి. కొత్త ఇళ్ల నిర్మాణానికి ప్లాన్ల కోసం దరఖాస్తులతోపాటు వివిధ రకాల దరఖాస్తులు కూడా ఆన్‌లైన్‌లో పెట్టుకునే పరిస్థితి లేకుండా పోయిందని వాపోతున్నారు. ఒక వేళ కార్యాలయంలో పర్మిషన్‌ పెట్టుకుని వచ్చి మున్సిపల్‌ కార్యాలయంలో పన్నులు చెల్లిద్దామనుకుంటే ఆ సమయానికి క్యూ ఉండటం లేదా, సంబంధిత అధికారి లేకపోవడం ఇలా అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఈనేపథ్యంలో ఆన్‌లైన్‌ను పూర్తిస్థాయిలో అప్‌గ్రేడ్‌చేసి ఈ-సేవలను అందుబాటులోకి తెస్తే చాలా మందికి ప్రయోజనం ఉండటంతోపాటు ప్రభుత్వానికి కూడా పెండింగ్‌ పన్నులు వసూలయ్యే అవకాశం లేకపోలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement