Friday, March 29, 2024

చంద్రుడిపై ల్యాండింగ్‌కు నాసా రూట్‌మ్యాప్‌!

చంద్రుడిపైకి మలిదశ మానవయాత్రకు నాసా ప్రయత్నాలు ప్రారంభించింది. రానున్న రెండేళ్లలో మానవులను చంద్రుడిపైకి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రక్రియలో భాగంగా తొలుత చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్‌కు అనువైన ప్రదేశాలను గుర్తించనుంది. ఇందుకోసం స్పేస్‌ లాంచ్‌ సిస్టమ్‌ను సిద్ధంచేసింది. ఈనెల 29వ తేదీన ఇది అంతరిక్షంలోకి బయల్దేరనుంది. 42 రోజుల సుదీర్ఘయాత్రలో వివిధ రీజియన్లలో ల్యాండింగ్‌కు అనువైన ప్రాంతాలను గుర్తిస్తుంది. తద్వారా భవిష్యత్‌ వ్యోమగాములు చంద్రుడిపైకి వెళ్లడానికి సహాయపడేలా రూట్‌మ్యాప్‌ను నాసా ఇవ్వనుంది. 2025లో వ్యోమగాములతో కూడిన ఆర్టెమిస్‌-3 మిషన్‌ ప్రాంరంభానికి నాసా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గతంలో చంద్రుడిపైకి వెళ్లిన అపోలో మిషన్‌ మూసివేసి దాదాపు ఐదు దశాబ్దాలైంది. అప్పటి నుంచి చందమామపై కాలిడాలన్న నిరీక్షణ అలాగే మిగిలిపోయింది. ఇప్పుడు నాసా చేస్తున్న ఆర్టెమిస్‌ ప్రయత్నంతో ఆ నిరీక్షణకు తెరపడనుంది.

ల్యాండింగ్‌ పాయింట్ల గుర్తింపు..

‘ప్రతి ప్రాంతంలో అనేక సంభావ్య ల్యాండింగ్‌ పాయింట్లు ఉన్నాయి. నిర్దిష్ట ల్యాండింగ్‌ సైట్‌లను ఎంచుకోగల ప్రాంతాలలో ప్రతి ఒక్కటి సైంటిఫిక్‌ ఆసక్తిని కలిగివున్నాయి. కమ్యూనికేషన్లు, లైటింగ్‌ పరిస్థితులు, అలాగే సైన్స్‌ లక్ష్యాలను చేరుకోగల సామర్థాలు కలిగిన ప్రదేశాలు ఉన్నాయి. అందుచేత ముందుకు ల్యాండింగ్‌కు అనుకూలించే ప్రాంతాలను గుర్తించడం ముఖ్యం. దానితర్వాత సైన్స్‌కమ్యూనిటీతో విస్తృత సంభాషణల ద్వారా వ్యోమగాముల మూన్‌ మిషన్లకోసం భవిష్యత్‌ లక్ష్యాలను మూల్యాంకనం చేయవచ్చు’ అని నాసా ఒక ప్రకటనలో తెలిపింది.

29న ముహూర్తం..

ఆర్టెమిస్‌-1 మిషన్‌ కోసం స్పేస్‌ లాంచ్‌ సిస్టమ్‌ రాకెట్‌, ఓరియస్‌ స్పేస్‌క్రాఫ్ట్‌లు గురువారం కెన్నడీ స్పేస్‌లోని 39బి లాంచ్‌ కాంప్లెక్స్‌కు చేరుకున్నాయి. 322 అడుగుల రాకెట్‌ మానవ రహితంగా బయల్దేరుతుంది. ఈనెల 29న తొలి ప్రయోగం కోసం సన్నాహాలు పూర్తయ్యాయి. అంతరిక్ష నౌక 42 రోజుల సుదీర్ఘ యాత్రకోసం బయల్దేరుతుంది. అది చంద్రుడిని దాటుకుని వెనుకవైపుకు చేరుతుంది. నాసా చేస్తున్న ఈ ప్రయత్నం అంగారక గ్రహానికి భవిష్యత్‌ మిషన్లు పంపడానికి, చంద్రుడి ఉపరితలంపైకి మానవయాత్రను తిరిగి ప్రారంభించడానికి అమెరికా చేస్త్తున్న అత్యంత ఖరీదైన ప్రయత్నమిది.

Advertisement

తాజా వార్తలు

Advertisement