Saturday, May 4, 2024

ఆడిటర్ బుచ్చిబాబుకు బెయిల్.. పూచీకత్తుతో పాటు పాస్‌పోర్ట్ సరెండర్ చేయాలని కండిషన్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయి తిహార్‌ జైల్లో ఉన్న ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుకు ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పిటిషన్‌పై గతంలోనే విచారణ ముగించిన స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ తీర్పును రిజర్వ్ చేసి సోమవారం మధ్యాహ్నం వెల్లడించారు. ఈ సందర్భంగా రూ. 2 లక్షల పూచీకత్తుతో పాటు బుచ్చిబాబు దేశం విడిచి వెళ్లకుండా పాస్‌పోర్ట్ సరెండర్ చేయాలని షరతులు విధించారు. అప్పటికే సిద్ధం చేసుకున్న పూచీకత్తును, పాస్‌పోర్టును బుచ్చిబాబు సోదరి కోర్టులో సమర్పించారు.

ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పన నుంచి అమలు వరకు చోటుచేసుకున్న అక్రమాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఆరోపిస్తూ సీబీఐ నమోదు చేసిన కేసులో బుచ్చిబాబును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఎఫ్.ఐ.ఆర్‌లో 14వ నిందితుడిగా ఉన్న మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్రన్ పిళ్లైకి బుచ్చిబాబు చార్టెడ్ అకౌంటెంట్‌గా వ్యవహరించారు. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కూడా ఆడిటర్‌గా పనిచేశారు. అయితే మద్యం కుంభకోణం లావాదేవీల్లో బుచ్చిబాబు పాత్ర, ప్రమేయం ఉందని ఆరోపిస్తూ సీబీఐ ఆయన్ను గత నెల (ఫిబ్రవరి) 8న అరెస్టు చేసింది. ఆ తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ సైతం బుచ్చిబాబును తిహార్ జైల్లో ఉండగా ప్రశ్నించింది. బుచ్చిబాబు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన స్పెషల్ కోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement