Thursday, April 25, 2024

అవిర్భావ సభ వేదికగా పవన్‌ కళ్యాణ్‌ కీలక ప్రకటనలు.. 12, 13 తేదీ ల్లో వరుస సమావేశాలు

అమరావతి,ఆంధ్రప్రభ: ఎన్నికల యుద్దానికి జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ సిద్దమౌతున్నాడు. ఈనెల 14వ తేదీన జురగబోయే పార్టీ ఆవిర్భావ సభను అందుకు వేదికగా మలచుకోబోతున్నాడు. ప్రతి ఏడాది పార్టీ ఆవిర్భావసభను మంగళగిరిలో జరుపుకునే జనసేన పార్టీ ఈసారి మాత్రం భారీ ఎత్తున మచిలీపట్నంలో నిర్వహించబోతోంది. ఈ సభకు పార్టీ కేడర్‌ భారీ సంఖ్యలో తరలిరానున్నారు. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఇప్పటికే నెలకొన్న తరుణంలో పవన్‌ కళ్యాన్‌ ఈ సభా వేదిక పై నుండి కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశముంది. ముఖ్యంగా కాపు రిజర్వేషన్లపై పార్టీ వైఖరి ఏంటనేది జనసేనను అందరూ ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా ఎన్నికల పొత్తులపై త్వరగా తేల్చాలనే డిమాండ్‌ మిత్రపక్షాలతోపాటు స్వపక్షంలోనూ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈనెల 14వ తేదీన జరిగే అవిర్భావ సభలో ఈ అంశాలపై పవన్‌ కళ్యాన్‌ కీలక ప్రకటనలు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

12,13 తేదీల్లో వరుస సమావేశాలు..

ఆవిర్భావ సభలో పాల్గొనేందుకు పవన్‌ కళ్యాన్‌ ఈనెల 11వ తేదీ సాయంత్రానికి గానీ, 12వ తేదీ ఉదయానికి కానీ మంగళగిరి చేరుకుంటారు. 12వ తేదీన కాపు సంక్షేమ సేన నేతలతో సమావేశమౌతారు. మాజీ ఎంపి చేగొండి హరిరామజోగయ్య నేతృత్వంలోని కాపు సంక్షేమ సేన కాపులకు రిజర్వేషన్లు కల్పించాలనే అంశంపై పోరాడుతోంది. ఇందుకోసం హరిరామజోగయ్య నిరహార దీక్ష కూడా చేశారు. ఆసమయంలో పవన్‌ కళ్యాణ్‌ ఆయన పోరాటానికి మద్దతు కూడా తెలిపారు. ఈనేపథ్యంలో కాపు సంక్షేమ సేన నేతలతో సమావేశం సందర్భంగా కాపు రిజర్వేషన్లపై చర్చించే అవకాశముంది. ఈ అంశంపై పార్టీ ఏ వైఖరి తీసుకోవాలనేది నిర్ణయించుకునే అవకాశముంది. కాపు సంక్షేమ సేన నాయకులతోనే కాకుండా జనసేన పార్టీ కాపు నేతలతో పవన్‌ కళ్యాణ్‌ సమావేశమౌతారు. ఈ సమావేశాల తర్వాత ఈనెల 13వ తేదీన పార్టీ ముఖ్యనేతలతో పవన్‌ కళ్యాణ్‌ సమావేశమౌతారు.

పొత్తులపై చర్చ..

ఈనెల 13వ తేదీన పార్టీ ముఖ్యనేతలతో జరిగే సమావేశంలో ప్రస్తుతం ఉన్న రాష్ట్ర రాజకీయ వాతావరణంలో ఎటువంటి వ్యూహాన్ని అమలు చేయాలనేది నిర్ణయించే అవకాశముంది. మరోవైపు టిడిపితో పొత్తు ఉంటుందని ఇప్పటికే పరోక్షంగా ప్రకటించిన పవన్‌ కళ్యాణ్‌ ఈ సమావేశంలో టిడిపి, బిజెపిలతో దోస్తీ ఎలా ఉం డాలనేది చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లూ ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఎన్ని సీట్లకు పోటీ చేయాలనే వ్యూహాన్ని తనకు వదిలేయండని పవన్‌ కళ్యాణ్‌ చెబ్తు వస్తున్నారు. ఈ మీటింగ్‌లోనూ ఇదే మరోసారి చెప్పనున్నారు. జనసేన పార్టీ నాయకత్వమంతా కూడా పొత్తుల నిర్ణయాన్ని పవన్‌ కళ్యాణ్‌కు అప్పజెప్తూ తీర్మానం చేసే అవకాశం ఉందని కూడా చెబ్తున్నారు. ఈ విషయాలతోపాటు నియోజకవర్గ సమీక్షలు ఎప్పటి నుండి ప్రారంభిచాలి, వారాహీ యాత్ర ఎప్పటి నుండి, ఎక్కెడెక్కడ చేయాలనే విషయాలను కూడా 13 తేదీ సమావేశంలో చర్చించే అవకాశముంది. ఆ తర్వాత 14వ తేదీన జరిగిన పార్టీ ఆవిర్భావసభలో ఈ రెండు రోజుల సమావేశాల చర్చల ఫలితంగా ఆధారంగా తీసుకున్న నిర్ణయాలను పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించే అవకాశముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement