Wednesday, May 15, 2024

అత్యధిక సెంచరీలు చేసిన బాబర్‌

పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ మరో రికార్డు సాధించాడు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌ లో అత్యధిక శతకాలు చేసిన బ్యాటర్‌గా అతను రికార్డుల్లోకి ఎక్కాడు. రావల్డిండిలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్‌లో సెంచరీ చేసిన బాబర్‌ ఈ రికార్డును అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో ఈ ఏడాది మూడు ఫార్మట్లలో బాబర్‌ ఖాతాలో 7 సెంచరీలు ఉన్నాయి. ఇంతకుముందు అతను ఆరు శతకాలతో ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌ జానీ బెయిర్‌ స్టోతో సరి సమానంగా ఉన్నాడు. టీ 20 వరల్డ్‌ కప్‌లో నిరాశ పరిచిన బాబర్‌ టెస్టుల్లో తిరిగి ఫామ్‌ అంది పుచ్చుకున్నాడు. 168 బంతుల్లో 19 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 136 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇది బాబర్‌కు టెస్ట్‌ల్లో 8వ సెంచరీ.

మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ జట్టులో నలుగురు ఆటగాళ్లు సెంచరీ చేశారు. ఓపెనర్లు జాక్‌ క్రాలే, బెన్‌ డకెట్‌ , ఓలిపోప్‌, హ్యారీబ్రూక్‌ శతకాలతో చెల రేగడంతో ఆ జట్టు 657 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. రెండో రోజు ఇన్నింగ్స్‌ ఆరంభించిన పాకిస్థాన్‌కు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. అబ్దుల్లా షఫిక్‌(114), ఇమామ్‌ ఉల్‌ హక్‌ (121) సెంచరీలు చేశారు. బాబర్‌ ఆజం శతకం సాధించడంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాక్‌ ఏడు వికెట్ల నష్టానికి 499 పరుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement