Sunday, May 5, 2024

Big story : 6నుంచి అసెంబ్లీ, షెడ్యూల్‌ విడుదల.. రేపు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రివర్గ భేటీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: అసెంబ్లి సమావేశాలు ఈ నెల 6వ తేదీ (మంగళవారం) నుంచి జరగనున్నాయి. 6న ఉదయం 11.30గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లి కార్యదర్శి వేదాంతం నర్సింహ్మాచార్యులు షెడ్యూల్‌ విడుదల చేశారు. శనివారంనాడు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రిమండలి భేటీ కానుంది. కేబినెట్‌ భేటీ ముగిసన అనంతరం తెలంగాణ భవన్‌లో సాయంత్రం 5గంటలకు టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీలు కూడా పాల్గొనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న పలు అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలు, నూతన పెన్షన్లు, గిరిజనుల పోడు భూముల సమస్య వంటి అంశాలపై చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షాపూరిత విధానాలు, అప్పులపై ఆంక్షలు, విద్యుత్‌ పెండింగ్‌ నిధుల బకాయిలపై ఏకపక్ష ధోరణి, తాజాగా ఈడీ, సీబీఐ వంటి కేంద్ర సంస్థల దుర్వినియోగం వంటి కీలక అంశాలపై కూలంకుషంగా చర్చించే అవకాశం ఉంది.

అసెంబ్లి సమావేశాల తేదీని శుక్రవారంనాడు ఖరారు చేయడంతో తొలిరోజునే బీఏసీ సమావేశమై సభను ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై నిర్ణయం తీసుకోనుంది. సాంకేతికపరంగా చూస్తే మార్చి 15న బడ్జెట్‌ సమావేశాలు ముగియగా ఈనెల 15లోగా మళ్లి సమావేశపర్చాల్సిన అవసరం నెలకొంది. మార్చి 7న ప్రారంభమైన బడ్జెట్‌ సమావేశాలు 15న ముగిశాయి. స్పీకర్‌ సమావేశాలను నిరవధిక వాయిదా వేశారు. గత సెషన్‌ను గవర్నర్‌ ప్రోరోగ్‌ చేయని కారణంగా కొనసాగింపుగానే ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. భారత స్వతంత్ర వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకల్లో భాగంగా 21న అసెంబ్లి ప్రత్యేక సమావేశం నిర్వహించాలని భావించినప్పటికీ అనివార్య కారణాలతో వాయిదా వేశారు.

ఈ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పలు ప్రకటనలను సీఎం కేసీఆర్‌ సభా వేదికగా చేయనున్నారని, పలు తీర్మానాలు ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ తెలంగాణ వ్యతిరేక వైఖరి, ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్దంగా ఏకపక్షంగా వ్యవహరిస్తూ తెలంగాణకు నష్టం కల్గిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సీఎం కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఒక తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. విద్యుత్‌ సంస్కరణలు, రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం, తెలంగాణకు సాయం అందజేతలో నిర్లక్ష్యం, వరద సాయంపై జాప్యం, సెస్సుల పేరుతో రాష్ట్రాల ఆదాయాలకు గండికొట్టడం, పన్ను ఎగవేతలకు పాల్పడటం వంటి అనేక అంశాలపై అసెంబ్లిలో చర్చించనున్నారని తెలిసింది. అలాగే అనేక రాజకీయ అంశాలకు కూడా ఈ సమావేశాలు వేదికగా మారనున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశాలు ఉత్కంఠగా మారాయి. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, శాంతిభద్రతలు, వరదలు, నష్టం అంచనాలు, కేంద్ర సాయం వంటి అంశాలను చర్చించనున్నారు. పలు బిల్లులతోపాటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ వ్యాఖ్యానించిన తెలంగాణ అప్పులపై ఈ సమావేశం సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. అదే సమయంలో ధాన్యం కొనుగోళ్లు, వరద సాయం, పెండింగ్‌ బకాయిలు, తాజాగా కేంద్రం పలు ఆహారపదార్ధాలపై జీఎస్టీ పెంపు వాటితోపాటు రాష్ట్రంలో నెలకొన్న ఇతర అంశాలను చర్చించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement