Thursday, May 9, 2024

ఆసియా హ్యాండ్‌బాల్‌ విజేత అల్‌-కువైట్‌.. అల్‌-నజ్మాపై 28-23తో గెలుపు

హైదరాబాద్‌: ఆసియా హ్యాండ్‌బాల్‌ పురుషుల క్లబ్‌ లీగ్‌ 24వ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను అల్‌-కువైట్‌ క్లబ్‌ కైవసం చేసుకుంది. హైఓల్టేజ్‌ ఫైనల్‌లో అల్‌-కువైట్‌ 28-23తో అల్‌-నజ్మా(బహ్రెయిన్‌)ను ఓడించి ట్రోఫీని ముద్దాడింది. హైదరాబాద్‌ గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన ఈ ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో ఇరు జట్లు విజయం కోసం సర్వశక్తులు ఒడ్డాయి. మ్యాచ్‌ చివరి ఐదు నిముషాలు వరకు గట్టి పోటీ ఇచ్చిన అల్‌-నజ్మా ఆఖరిలో ఒత్తిడికి చిత్తయి ట్రోఫీ చేజార్చుకుంది. దీంతో కువైట్‌ 28-23 స్కోరుతో ప్రత్యర్థి అల్‌-నజ్మాపై గెలుపొంది చాంపియన్‌గా నిలిచింది. ఇంక అంతకు ముందు మూడో స్థానం కోసం ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో అల్‌-ఖద్సియా (కువైట్‌) 28-27తో అల్‌ అరబీ (ఖతార్‌)పై నెగ్గి రెండో రన్నరప్‌గా నిలిచింది.

రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌, యువజన సర్వీసులు, క్రీడల శాఖ సెక్రటరీ సందీప్‌ సుల్తానియా, అంతర్జాతీయ హ్యాండ్‌బాల్‌ సంఘం ఉపాధ్యక్షుడు బదర్‌ అల్‌ తీయాబ్‌, జాతీయ హ్యాండ్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్‌రావు, శాట్స్‌ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, భారత ఒలింపిక్‌ సంఘం కోశాధికారి ఆనందీశ్ర్‌ పాండే కలిసి విజేత జట్టుకు ట్రోఫీ బహూకరించారు. ముగింపు వేడుకల్లో తెలంగాణ ఒలింపిక్‌ సంఘం కార్యదర్శి జగదీష్‌ యాదవ్‌, రాష్ట్ర హ్యాండ్‌బాల్‌ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఆసియా హ్యాండ్‌బాల్‌ పోటీలు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు పూర్తి సహాయ సహకారాలు అందించారని అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని జగన్‌మోహన్‌ రావు చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement