Saturday, April 27, 2024

నైజీరియన్ల అరెస్ట్‌, ఢిల్లిలో ఉద్రిక్తత.. పోలీసులను ప్రతిఘటించిన ఆఫ్రికన్లు

అక్రమంగా నివసిస్తున్న నైజీరియన్లను ఢిల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా వందలాది ఆఫ్రికన్లు పోలీసులను చుట్టుముట్టారు. విధుల్లోని పోలీసులను ప్రతిఘటించారు. వారితో వాగ్వాదానికి దిగారు. అరెస్ట్‌ చేసిన నైజీరియన్లను పోలీసుల చెర నుంచి తప్పించేందుకు ప్రయత్నించారు. దీంతో దక్షిణ ఢిల్లిలోని నెబ్‌ సరాయ్‌ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు మాదకద్రవ్యాల వ్యతిరేక దళం విభాగం పోలీసులు నెబ్‌ సరాయ్‌ ప్రాంతంలోని రాజు పార్క్‌ వద్దకు వెళ్లారు. వీసా గడువు ముగిసినప్పటికీ అక్రమంగా ఢిల్లిలో ఉంటున్న ముగ్గురు నైజీరియన్లను అరెస్ట్‌ చేశారు.

ఈ నేపథ్యంలో వంద మందికిపైగా ఆఫ్రికా జాతీయులు పోలీసులను చుట్టుముట్టారు. సైజీరియన్ల అరెస్ట్‌ను అడ్డుకునేందుకు పోలీసులపై తిరుగబడ్డారు. దీంతో అరెస్టైన వారిలో ఇద్దరు నైజీరియన్లు తప్పించుకున్నారు. కాగా, శనివారం సాయంత్రం 6.30 గంటలకు నార్కోటిక్స్‌ బృందాలతోపాటు నెబ్‌ సరాయ్‌ పోలీసులు సంయుక్తంగా మళ్లిd ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఒక మహిళతోపాటు నలుగురు నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సుమారు 200 మంది ఆఫ్రికన్లు పోలీసు బృందాలను చుట్టుముట్టారు. అదుపులోకి తీసుకున్న వారిని తప్పించేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు పరిస్థితిని అదుపుచేశారు. అరెస్ట్‌ చేసిన నైజీరియన్లను స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. వీసా గడువు ముగిసిన వారిని దేశం నుంచి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement