Thursday, May 2, 2024

పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తుల వెల్లువ.. 17 వేల పోస్టులకు 9లక్షల దరఖాస్తులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పోలీసు ఉద్యోగాల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ద్వారా పోలీసు శాఖలోని ఎస్‌ఐ, కానిస్టేబుళ్ళ పోస్టులతో పాటు రవాణా, ఎక్సైజ్‌, ఫైర్‌, జైళ్ళ శాఖలలోని ఖాళీల భర్తీకి వరుస నోటిఫికేషన్లు వెలువడిన విషయం తెలిసిందే. మొత్తం 17 వేల పైచిలుకు పోస్టుల కోసం టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ దరఖాస్తులను ఆహ్వానించగా, మంగళవారం నాటికి దాదాపు ఏడున్నర లక్షల దరఖాస్తులు అప్‌లోడ్‌ అయినట్లు అధికారులు చెప్పారు. ఇందులో ఒక్క పోలీసు శాఖలోని ఉద్యోగాల కోసమే దాదాపు నాలుగున్నర లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.

2018 లో రాష్ట్ర పోలీసు శాఖ 16 వేల పై చిలుకు ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానించగా దాదాపు ఏడున్నర లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ సారి గతంలో వచ్చిన దరఖాస్తుల కంటే ఎక్కున దరఖాస్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వచ్చిన దరఖాస్తులను ఫరిశీలించగా 48 శాతం మంది అభ్యర్థులు ఒక్క పోస్టుకు దరఖాస్తు చేసుకోగా, 29 శాతం మంది రెండు పోస్టులకు, 17 శాతం మంది మూడు పోస్టులకు, నాలుగు శాతం మంది నాలుగు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు.

ఇందులో 68 శాతం మంది తెలుగు, 32 శాతం మంది ఇంగ్లీషును ఎంపిక చేసుకున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాల నుంచి 29 శాతం దరఖాస్తులు రాగా, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, ఆసిఫాబాద్‌, నారాయణపేట, సిరిసిల్ల జిల్లాలనుంచి కేవలం ఒక్క శాతం దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు చేసుకునేందుకు 20 వ తేదీ శుక్రవారం వరకు గడువు ఉంది కాబట్టి మరో లక్షన్నర దరఖాస్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా తొమ్మిదిన్నర లక్షల వరకు దరఖాస్తులు అందవచ్చని అంటున్నారు. పోలీసు రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన హెల్ప్‌లైన్‌కు 11,972 కాల్స్‌ రాగా, అందులో 11,449 పరిష్కరించినట్లు అధికారులు వెల్లడించారు.

ఆగస్టులో ప్రిలిమినరీ పరీక్షలు..

టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ద్వారా జరిగే నియామకాలకు సంబంధించి ఆగస్టు మాసంలో ప్రిలిమినరీ పరీక్షలు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటి నుంచే అధికారులు కసరత్తును ముమ్మరం చేశారు. పరీక్షా కేంద్రాలలో అభ్యర్థుల ఫేస్‌, అర చేయి బయో మెట్రిక్‌, డిజిటల్‌ సైన్‌ తీసుకునేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 20 తో ముగియనున్న నేపథ్యంలో 21వ తేదీ నుంచి డేటా సెంట్రలైజ్‌ చేసే ప్రక్రియను ప్రారంభిస్తామని బోర్డు అధికారులు తెలిపారు. దరఖాస్తుల ఆధారంగా పరీక్షా కేంద్రాలు, ఇన్విజిలేటర్లు, బయోమెట్రిక్‌ టీంలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రశ్నాపత్రాలు, ఓఎంఆర్‌ షీట్లతో ఫాటు హాల్‌ టికెట్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు కనీసం రెండు మాసాలు పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement