Monday, April 29, 2024

కొడాలి నాని Vs టీడీపీ నేతలు.. మాటల యుద్ధం

ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి తన నోటికి పనిచెప్పారు. శుక్రవారం నాడు అమరావతి భూముల వ్యవహారంలో హైకోర్టు స్టే ఇవ్వడంతో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఆయన తీవ్రవిమర్శలు చేశారు. స్టేల బాబుగా చంద్రబాబు పేరు తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. పోలీసుల విచారణను ఎదుర్కోలేని పిరికిపంద అని ఆరోపించారు. ఆరోపణలపై సమాధానం కూడా చెప్పుకోలేని చవట దద్దమ్మ అని, ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా చంద్రబాబులో మార్పు రాలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాళ్లు పట్టుకోవడం, చీకటి ఒప్పందాలు చేసుకోవడమే చంద్రబాబు చరిత్ర అని విమర్శించారు. ఆయనకు, టీడీపీ నేతలకు దమ్ము, ధైర్యం ఉంటే రాష్ట్ర ప్రయోజనాలపై ఢిల్లీలో నిరసనలు తెలపాలని సవాల్ విసిరారు.

చంద్రబాబు పుత్రరత్నం ట్విట్టర్‌లో అదేపనిగా వాగుతున్నాడని, వైఎస్సార్ దెబ్బ ఎలాంటిదో లోకేశ్ తన తండ్రి చంద్రబాబును అడగాలన్నారు. తలకాయలో విషయం లేని వ్యక్తి అని, వర్ధంతికి, జయంతికి తేడా తెలియని వ్యక్తిని అని లోకేష్‌పై కొడాలి నాని వ్యాఖ్యలు చేశారు. నాడు రామలింగరాజు డబ్బుతో లోకేష్ స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో చదివాడని ఆరోపించారు. లోకేశ్ స్టాన్ ఫర్డ్ వర్సిటీలో చదివినప్పుడు ఎవరి ఖాతా నుంచి డబ్బులు బదిలీ అయ్యాయో ఆ ఖాతా వివరాలు బయటపెట్టగలరా? అని కొడాలి నాని సవాల్ విసిరారు. అసలు స్టాన్ ఫర్డ్‌లో చదివానని చెప్పుకునే బుర్రలేని లోకేష్‌కు సర్టిఫికెట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఈ విషయమై స్టాన్ ఫోర్డ్ వర్సిటీ వర్గాలకు లేఖ రాస్తానని అన్నారు.

అయితే మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు టీడీపీ నేతలు గట్టిగానే స్పందించారు. కొడాలి నాని ఓ దద్దమ్మ అని, ఆయన మైకు ముందుకు వచ్చి చంద్రబాబుపై అవాకులు చెవాకులు పేలడం మానుకోవాలని మాజీ మంత్రి జవహర్ హితవు పలికారు. కొడాలి నానికి దమ్ముంటే బెయిల్ రెడ్డి గురించి మాట్లాడాలని సవాల్ విసిరారు. నాని తన పదవి కాపాడుకోవడానికే ఇన్ని మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అటు మంత్రి కొడాలి నాని సభ్యత, సంస్కారాలతో పెరిగిన వాడు కాదని మరో టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య విరుచుకుపడ్డారు. నాని ఓ బూతుల మంత్రి అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు స్టేపై చదువురాని నాని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రాజ్యాంగం తెలియని వ్యక్తి మంత్రి పదవిలో ఉండటానికి అర్హుడు కాదని, ఇది ప్రజలకు సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement