Thursday, May 2, 2024

Delhi | అరటి ఉత్పత్తిలో అగ్రగామి ఏపీ.. రాజ్యసభలో విజయసాయి ప్రశ్నలకు కేంద్రం జవాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : అరటి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని కేంద్రప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో శుక్రవారం విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రాతపూర్వకంగా జవాబిచ్చారు. 2021-22లో ఆహార, వ్యవసాయోత్పత్తుల సంస్థ (ఎప్ఏవో) సేకరించిన గణాంకాల ప్రకారం 56.84 లక్షల టన్నులు అరటి ఉత్పత్తితో  ఆంధ్రప్రదేశ్ అగ్ర స్థానంలో ఉన్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ఆ ఏడాది  నమోదైన అరటి ఉత్పత్తిలో ఏపీది 16.5 శాతం వాటా ఉన్నట్లు ఆయన తెలిపారు.

హార్టికల్చర్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా బనానా క్లస్టర్ కింద ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం పైలట్ దశ కింద ఎంపికైంది. అనంతపురంతో పాటు తమిళనాడులో థేని జిల్లాను కూడా బనానా క్లస్టర్ పైలెట్ ఫేజ్ కింద ఎంపిక చేసినట్లు మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా 55 క్లస్టర్లను హార్టికల్చర్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద గుర్తించగా అందులో 12 క్లస్టర్లు పైలట్ ఫేజ్ కింద ఎంపిక చేశామని, ప్రపంచం మొత్తం మీద పండించే అరటి పండ్లలో 26.5 శాతం వాటాతో భారత్‌ అగ్రస్థానంలో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు.

దేశంలో పెద్దఎత్తున అరటి ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలలో ఏపీ తరువాతి స్థానంలో మహారాష్ట్ర (4966.33 మెట్రిక్ టన్నులు), తమిళనాడు (4236.96 మెట్రిక్ టన్నులు) మూడో స్థానంలో ఉన్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 34907.54 మెట్రిక్ టన్నుల అరటి ఉత్పత్తి జరుగనున్నట్లు ఎఫ్‌ఏఓ సంస్థ అంచనా వేసిందని పేర్కొన్నారు. దేశంలో హార్టికల్చర్ రంగం అభివృద్దికి వ్యవసాయ మంత్రిత్వ శాఖ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (ఎంఐడీహెచ్) పథకం అమలు చేస్తోందని నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు. అలాగే హర్టికల్చర్ క్లస్టర్లలో భౌగోళికపరమైన ప్రత్యేక పంటలు ప్రోత్సహించేందుకు, ఉత్పత్తికి ముందు, ఉత్పత్తి సమయంలో, పంట  దిగుబడి తరువాత, లాజిస్టిక్స్, బ్రాండింగ్, మార్కెటింగ్ కొరకు క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అమలు చేస్తోందని అన్నారు.

- Advertisement -

మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ ఆఫ్ హార్టికల్చర్ కింద అరటి (సకర్) కొరకు డ్రిప్ ఇరిగేషన్‌తో పాటు ఇంటిగ్రేటెడ్ ప్యాకేజీ కింద మొక్కలు నాటేందుకు, డ్రిప్ సిస్టం, పందిరి ఏర్పాటు, (ఇంటిగ్రేటెడ్ న్యూట్రియెంట్స్ మేనేజ్మెంట్ (ఐఎన్ఐం), ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ (ఐపీఎం) కొరకు హెక్టార్‌కు చేసిన ఖర్చుపై 40 శాతం సాయం కింద అందింస్తుందని మంత్రి చెప్పారు. అలాగే ఇంటిగ్రేషన్ లేకుండా హెక్టార్ కు అయ్యే అత్యధిక ఖర్చు 1.25 లక్షల్లో 40% సహకారం అందిస్తుందని అన్నారు. అలాగే కోల్డ్ స్టోరేజ్‌లు, రైపెనింగ్ సెంటర్ల ఏర్పాటుకు, రవాణా వాహనాల కొరకు ఎంఐడీహెచ్ కింద క్రెడిట్ లింక్డ్ సహకారం అందిస్తుందని ఆయన అన్నారు.

సైబర్ దాడులు అరికట్టే బాధ్యత పోలీసులదే

సైబర్‌ దాడుల నివారణ, సైబర్‌ నేరాల విచారణ బాధ్యత ప్రాథమికంగా ఆయా రాష్ట్రాల పోలీసు శాఖదే అని ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ స్పష్టం చేశారు. సైబర్‌ నేరాల విచారణలో సాంకేతిక అవగాహన  పెంచుకోవడానికి పోలీసు సిబ్బందికి ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వవలసి ఉంటుందని ఆయన చెప్పారు. ఎంపీ విజయసాయి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. సైబర్‌ దాడులు, సైబర్‌ నేరాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రజల్లో అవగాహన కల్పించే చేపడుతున్న చర్యల గురించి ఆయన వివరించారు. సైబర్‌ నేరాల బారిన పడిన ప్రజలు తమ ఫిర్యాదును దాఖలు చేయడంలో సహకరించే విధంగా హోం మంత్రిత్వ శాఖ 1930 టోల్‌ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.

సైబర్‌ నేరాల బాధితులు ఈ టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేస్తే ఫిర్యాదు చేయడానికి వాళ్ళ సొంత భాషలోనే తగిన సాయం పొందవచ్చు. అలాగే సైబర్‌దోస్త్‌ అనే ట్విటర్‌ హాండిల్‌ ద్వారా సైబర్‌ నేరాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. సైబర్‌ నేరాల విచారణ, ఫోరెన్సిక్‌ పరీక్షలు, నేరస్తులకు శిక్షలు వంటి కీలకమైన అంశాలపై పోలీసులు, న్యాయాధికారులకు ఆన్‌లైన్‌ కోర్సుల ద్వారా శిక్షణ ఇచ్చేందుకు హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ సైట్రైన్‌ అనే పోర్టల్‌ను ప్రారంభించిందని మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు.

అలాగే సైబర్‌ నేరాల విచారణను సమర్ధవంతంగా నిర్వహించి నేరస్తులకు చట్టప్రకారం శిక్ష పడేలా చూసేందుకు వీలుగా పోలీసు సిబ్బంది, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, న్యాయాధికారులకు శిక్షణ ఇచ్చే కరికులమ్‌ను కూడా కేంద్రం రూపొందించింది. దీనికి సంబంధించి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాలను కోరినట్లు మంత్రి చెప్పారు. సైబర్‌ దాడుల ప్రమాదాలను ధీటుగా ఎదుర్కొనేందుకు తీసుకోవలసిన చర్యల గురించి ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సెర్ట్‌ ఇన్‌) ఎప్పటికప్పుడు అలర్ట్‌లు జారీ చేస్తుంటుందని తెలిపారు.

ఏపీలో వన్ డిస్ట్రిక్ట్-వన్ ప్రొడక్ట్ కింద 38 ఉత్పత్తులు

దేశంలోని అన్ని జిల్లాల్లో సమతుల్య  ప్రాంతీయ అభివృద్ధి లక్ష్యంగా ప్రవేశపెట్టిన వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ (ఓడిఓపి) విధానం కింద ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాల నుంచి మొత్తం 38 ఉత్పత్తులు గుర్తించినట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ వెల్లడించారు. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా బదులిచ్చారు. ఓడీఓపీ కింద అనంతపురం జిల్లాలో కాటన్/ జీన్స్ ప్యాంట్లు, చిత్తూరు జిల్లాలో వెంకటగిరి చీరలు, మామిడి గుజ్జు, తూర్పుగోదావరిలో పచ్చళ్ళు, మ్యాంగో జెల్లీ, పండ్ల గుజ్జు, నిమ్మ వంటి పండ్ల ఆధారిత ఉత్పత్తులు, గుంటూరులో కారం, క్రిష్ణా జిల్లాలో మచిలీపట్నం కలంకారీ, కర్నూలులో రాయి నుంచి తొలచిన ఉత్పత్తులు, ప్రకాశం నుంచి గ్రానైట్, నెల్లూరు నుంచి ఉదయగిరి కర్రతో తయారు చేసే కత్తులు, చాకులు, శ్రీకాకుళం నుంచి పొందూరు ఖద్దరు, బుడితి కంచు లోహ సామాన్లు, జీడి పిక్కలు, విశాఖపట్నం నుంచి సీఫుడ్ క్లస్టర్, విజయనగరం నుంచి మ్యాంగో జెల్లీ, పశ్చిమ గోదావరి నుంచి ప్రోసెస్ చేయబడిన రొయ్యలు, ష్రింఫ్, నర్సాపూర్ క్రోకెట్ లేసెస్, కడప నుంచి బారైట్స్, బేరియం కాంపౌండ్స్,  అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి అరకు కాఫీ, అనకాపల్లి నుంచి ఏటికొప్పాక చెక్క బొమ్మలు, అన్నమయ్య జిల్లా నుంచి కాటన్/ జీన్స్ ప్యాంట్లు, బాపట్ల నుంచి గ్రానైట్ కటింగ్/ పాలిషింగ్, ఏలూరు నుంచి బంగారు ఆభరణాలు, కాకినాడ నుంచి ఉప్పాడ జందాని చీరలు, జీడి పిక్కలు, కోనసీమ నుంచి కొబ్బరి, పీచు, ఆయల్ అండ్ నేచురల్ గ్యాస్, ష్రింప్, పార్వతీపురం మన్యం నుంచి బొబ్బిలి వీణ, ధాన్యం, ఎన్టీఆర్ జిల్లా నుంచి కొండపల్లి బొమ్మలు, నంద్యాల నుంచి బంగినపల్లి మామిడి, అళ్లగడ్డ స్టోన్ కార్వింగ్, పల్నాడు నుంచి దుర్గి స్టోన్ కార్వింగ్, మసాలా ఉత్పత్తులు, తిరుపతి నుంచి శ్రీకాళహస్తి కలంకారి హస్తకళలు, వెంటకగిరి చేనేత వస్త్రాలు, సత్యసాయి జిల్లా నుంచి ధర్మవరం పట్టు చీరలు, నిమ్మలకుంట తోలుబొమ్మలాటను గుర్తించినట్లు మంత్రి వివరించారు. అలాగే దేశ వ్యాప్తంగా ఓడీఓపీ ఇనిషియేటివ్ కింద 761 జిల్లాల నుంచి వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్ టైల్స్, హస్తకళలు, ఇతర రంగాల నుంచి 1093 ఉత్పత్తులు గుర్తించినట్లు మంత్రి సమాధానమిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement