Friday, April 26, 2024

ఆలయాల ఖజానాపై ఏపీ స‌ర్కారు కన్ను.. శ్రీవారి నిధులు కాజేసే యత్నం : బీజేపీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: అప్పులు తప్ప అభివృద్ధి లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖజానా నింపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం హిందూ దేవాలయాలపై కన్నేసిందని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ విభాగం అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి ధ్వజమెత్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవెంకటేశ్వర స్వామికి చెందిన రూ. 500 కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లను కాజేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. డిపాజిట్లను రాష్ట్ర ఖజానాకు మళ్లించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ముస్లిం, క్రిస్టియన్ బోర్డుల నిధులను తీసుకునే సాహసం రాష్ట్ర ప్రభుత్వం చేయగలదా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఆదాయం, పెట్టుబడులు లేక హిందూ దేవాలయాలపై కన్నేసిందని మండిపడ్డారు.

తక్షణమే దేవాలయాల నిధులను రాష్ట్ర ఖజానాకు మళ్లించే ప్రయత్నాలను విరమించుకోవాలని హెచ్చరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 200 హిందూ దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం జరగ్గా ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదని ఆరోపించారు. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం వల్లనే గోదావరి జిల్లాల్లో భారీ వరదలు తీవ్రనష్టాన్ని కలుగజేశాయని భానుప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. గోదావరి జిల్లాల్లో వందల గ్రామాలు నీట మునిగిపోయాయని, వరదల వల్ల నష్టపోయిన రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకుంటుందని అన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement