Thursday, May 2, 2024

20, 21 తేదీల్లో పోలవరం ప్రాంతాల్లో సిపిఐ పర్యటన..

అమరావతి, ఆంధ్రప్రభ : గోదావరి నదికి వరదలు సంభవించి పోలవరం పరిసర ప్రాంతాలు ముంపుకు గురైన నేపథ్యంలో ఈ నెల 20, 21 తేదీల్లో సిపిఐ ప్రతినిధి బృందం పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటించనుంది. సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె నారాయణ, అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ అధ్యక్షులు రావుల వెంకయ్య, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఓబులేసు తదితరుల ప్రతినిధి బృందం పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటించనుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి తీవ్రమైన వరదలు సంభవించాయని, గత వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా పోలవరం ప్రాజెక్టుకు వరద పోటెత్తిందన్నారు. పోలవరం ఎగువ కాపర్‌ డ్యాం ఎత్తుకు మించి వరద నీరు వచ్చిందని, ఈ వరదల కారణంగా పోలవరం ముంపు గ్రామాలు, లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

పోలవరం నిర్వాసితులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ, పునరావాసం కల్పించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన నిర్లక్ష్యం ఫలితంగా వేలాది మంది నిర్వాసితులు నిరాశ్రయులై, పునరావాస కేంద్రాల్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారాన్ని ఏళ్ల తరబడి గాలికి వదిలి పాలకులు చోద్యం చూస్తున్నారని, ప్రభుత్వాల తీరు వల్ల తుఫాన్లు, వరదలు సంభవించిన పరిస్థితుల్లో నిర్వాసితులు భయం గుప్పెట్లో మగ్గుతున్నారని, విపరీతమైన వరదలవల్ల గ్రామాల ముంపునకు పాలకుల తప్పదమే ప్రధాన కారణమని ఆరోపించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement