Friday, April 26, 2024

ఫసల్ బీమా యోజన లేక‌ రైతులకు కష్టాలు.. వరదలపై రాజకీయం తగదు: కె. లక్ష్మణ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న దుర్మార్గపు విధానాల కారణంగా తెలంగాణ రైతులు నష్టపోతున్నారని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డా. లక్ష్మణ్ ఆరోపించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకుండా కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. తాజాగా తలెత్తిన గోదావరి వరదల్లో వేలాది ఎకరాల పంటభూములు నీట మునిగాయని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు వరదల్లో కొట్టుకుపోయిందని లక్ష్మణ్ అన్నారు. ఏదేమైనా ఎనిమిదేళ్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు తొలిసారిగా బయటికొచ్చి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినందుకు అభినందిస్తున్నామని డా. లక్ష్మణ్ అన్నారు. గత ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో వరదలొచ్చి హైదరాబాద్, వరంగల్ నగరాలు సహా వందలాది గ్రామాలు ముంపుకు గురయ్యాయని, వేలాది మంది నిరాశ్రయులయ్యారని, కానీ సీఎం కేసీఆర్ ఒక్కసారి కూడా బయటకు రాలేదని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ వరద ప్రాంతాల్లో పర్యటించేందుకు సిద్ధమవడంతో కేసీఆర్ హడావుడిగా బయల్దేరాల్సి వచ్చిందని అన్నారు. ఉత్తిత్తి పర్యటన చేసి, గాలి మాటలు చేపితే మాత్రం ప్రజలు క్షమించరని డా. లక్ష్మణ్ అన్నారు. వరద ప్రాంతాల్లో సమీక్ష జరిపాక రాష్ట్ర ప్రభుత్వం ఏమిస్తుందో ప్రకటించాలని డిమాండ్ చేశారు. వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ బురద రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదని అన్నారు. గతంలో భారీవర్షాలకు ముంపుకు గురైన వరంగల్, హైదరాబాద్ నగరాల్లో పర్యటించిన కేటీ రామారావు ఎన్నో హామీలు ఇచ్చారని, ఆ హామీలన్నీ నీటిమీది రాతలుగానే మిగిలాయని విమర్శించారు. వరంగల్, మహబూబ్‌నగర్‌లో ఇళ్ల నిర్మాణంపై స్వయంగా సీఎం ఇచ్చిన హామీలు కూడా ఇప్పటికీ నెరవేరలేదని విమర్శించారు.

ఈ వర్షాల్లో పంటలు మునిగి మొలకలు మురిగిపోయాయని, ఈ నేపథ్యంలో మళ్లీ విత్తనాలు వేయాల్సిందేనని లక్ష్మణ్ అన్నారు. రైతులకు విత్తనాలు ఉచితంగా అందజేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఇదే అదనుగా నకిలీ విత్తనాలు మార్కెట్లోకి వచ్చే ప్రమాదముందని, పరిస్థితిని ముందే గుర్తించి, అమ్మకం దారులు, నకిలీల తయారీదారులపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. పంట నష్టంపై పూర్తిస్థాయిలో వెంటనే సర్వే నిర్వహించి ప్రతి రైతును ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement