Friday, May 10, 2024

రాష్ట్రంలో మరో కొత్త పథకం..గర్భిణులకు కేసీఆర్‌ న్యూట్రీషియన్‌ కిట్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో మరో కొత్త పథకం అమలులోకి రానుంది. ఆహారంతోనే ఆరోగ్యం అనే నినాదం ప్రాతిపదికన గర్భిణుల్లో రక్తహీనతకు చెక్‌పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్‌ న్యూట్రీషియన్‌ కిట్లను పంపిణీ చేయాలని నిశ్చయించింది. ఈ కొత్త పథకాన్ని అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లాల వైద్యాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఆయా ఆసుపత్రుల్లో కేసీఆర్‌ న్యూట్రీషియన్‌ కిట్లను నిల్వ చేసేందుకు అన్ని జిల్లాల్లోని ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా గదులను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ గదుల కేటాయింపు, నిర్వహణ బాధ్యతను ఆయా జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. కలెక్టర్లు ఆసుపత్రులను సందర్శించి కిట్ల నిల్వకు అనువైన గదులను ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. కోల్డ్‌ స్టోరేజీ గదిలో కేసీఆర్‌ న్యూట్రీషియన్‌ గదిలో నిల్వ ఉంచి పీహెచ్‌సీల వారీగా గర్భిణులకు పంపిణీ చేయనున్నారు. కిట్ల పంపిణీ వివరాలను వెబ్‌సైట్లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. పీహెచ్‌సీల వారీగా ఎంత మంది గర్భిణులు ఉన్నారు. ఏ రోజు ఎంత మందికి కిట్లను అందజేశారు తదితర వివరాలను వెబ్‌సైట్‌లో ఆశలు, ఏఎన్‌ఎలు ఉన్నతాధికారులకు సమర్పించాల్సి ఉంటుంది.

రక్తహీనత బారిన పడకుండా కేసీఆర్‌ న్యూట్రీషియన్‌ కిట్లను ఎలా వినియోగించాలో ఆశలు, ఏఏన్‌ఎంలు ఇంటింటికి వెళ్లి గర్భిణులకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. గర్భిణులతోపాటు పుట్టిన శిశువులు ఆరోగ్యంగా ఉండేందుకు కేసీఆర్‌ న్యూట్రీషియన్‌ కిట్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కిట్ల ద్వారా విటమిన్లు, పోషకాలతో కూడిన ఆహారాన్ని గర్భిణీలకు అందిస్తామని, తద్వారా తల్లిబిడ్డలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవంటున్నారు. ఇప్పటికే నసర్కారు దవాఖానాల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడంతోపాటు గర్భిణుల్లో రక్తహీనతను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో వైద్య,ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది. మాతా శిశు మరణాలను తగ్గించటంతోపాటు సీజేరియన్‌ ప్రసవాలను తగ్గించేందుకు ఇప్పటికే కేసీఆర్‌ కిట్‌తోపాటు నగదు ప్రోత్సాహకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది.

- Advertisement -

కేసీఆర్‌ న్యూట్రీషియన్‌ కిట్‌లో అన్ని రకాల విటమిన్లు, పోషకాలతో కూడిన ఆహారం ఉండేలా వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గర్భిణుల్లో దాదాపు 60శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. గర్భిణుల్లో రక్తహీనత కారణంగా పుట్టబోయే శిశువుపై ప్రభావం చూపడంతోపాటు బరువు తక్కువగా ఉండడం, ఇతరత్రా ఆరోగ్య సమస్యలతో జన్మిస్తున్నారు. కేసీఆర్‌ న్యూట్రీషియన్‌ కిట్‌ ద్వారా ఈ సమస్యను అధిగమించొచ్చని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కేసీఆర్‌ న్యూట్రీషియన్‌ కిట్‌లో వివిధ ధాన్యాలతో కూడిన పొడి, ఐరన్‌ సిరప్‌, ఖర్జూరం, నెయ్యి తదితర పోషక పదార్థాలు ఉండనున్నాయి.

కిట్లను గర్భిణులకు 5వ, 9 నెలల్లో పంపిణీ చేయనున్నారు. అయిదు నెశలలకు ఇచ్చే కిట్‌ విలువ రూ.1962 కాగా, రెండో కిట్‌ విలువ రూ.1818గా ఉండనుంది. శరీరానికి సరిపడా ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు అందించేందుకు వీలుగా ఈ కిట్లను రూపొందించారు. మొదటి విడతలో కేసీఆర్‌ న్యూట్రీషిన్‌ కిట్లను 9 జిల్లాల్లో పంపిణీ చేయనున్నారు. ఆదివాసీ, ఏజెన్సీ ప్రాంతాల్లోని మహిళల్లో ఎక్కువగా రక్తహీనత ఉన్నందున కేసీఆర్‌ న్యూట్రీషియన్‌ కిట్ల పంపిణీ పథకంలో ఆదిలాబాద్‌, ఖమ్మం, మహబబూబ్‌నగర్‌, వరంగల్‌ తదితర జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement