Sunday, April 28, 2024

Janasena | ప్రజలు బలంగా కోరితే సీఎం అవుతా.. కౌలురైతు భరోసా సభలో జనసేనాని

గుంటూరు, ఆంధ్రప్రభ వెబ్ ప్రతినిధి : “నేను వచ్చే రెండు తరాల కోసం ఆలోచిస్తున్నా. ప్రజలు బలంగా కోరుకుంటే సిఎం అవుతా. అవినీతిరహిత పాలన అందిస్తా.” అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చే ప్రసక్తే లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామంలో ఆదివారం జరిగిన కౌలు రైతు భరోసా యాత్ర లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. కార్యక్రమానికి భారీగా జనం తరలివచ్చారు. ఆత్మహత్యలు చేసుకున్న 280 కౌలురైతు కుటుంబాలకు పవన్ కళ్యాణ్ తన స్వంత నిధుల నుంచి లక్ష రూపాయల వంతున చెక్కులు అందజేశారు.

ఈసందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రసంగిస్తూ ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు. అన్నంపెట్టే రైతు కన్నీరు పెట్టడం రాష్ట్రానికి మంచిది కాదన్నారు. పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై కాకుండా వైసీపీ ప్రభుత్వం చిల్లర విషయాలపై దృష్టి సారిస్తుంది అని విమర్శించారు. పోలీసు ఆంక్షలు వున్న కారణంగా తాను విమర్శలు చేయదల్చు కోలేదని ఆయనన్నారు. తనకు విధించిన ఆంక్షలను వైసీపీ నాయకులకూ వర్తింప చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి రానిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ఇప్పటివరకు అధికారానికి దూరంగా ఉన్న, అణగారిన వర్గాలకు సాధికారిత చేకూరాల్సిన అవసరముందని పవన్ అభిప్రాయపడ్డారు. అటువంటి వారికి అధికారం వచ్చేలా చేయతమే జనసేన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. వైసీపీ నిర్వహించిన బిసి సభలో రొయ్యల వేపుడు, చికెన్ ఫ్రై, బిర్యానీ పెట్టినట్టు ప్రచారం చేయటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. బిసిలు అంటే అంటే బిర్యానీ ల కోసం ఎగబడే వారు కాదన్నారు. బిసి విద్యార్థులకు పోషకాహారం అందిస్తున్నారా? స్కాలర్ షిప్ లు సమయానికి ఇస్తున్నారా? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

- Advertisement -

ప్రభుత్వాన్ని పడగొడతా
వచ్చే ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక శక్తులు అన్నింటినీ కలిపి వైసీపీ ప్రభుత్వాన్ని పడగొడతానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వను అని ఆయన స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వంలో అన్నింటిపైనా శ్వేతపత్రం విడుదల చేస్తానని చెప్పారు. రైతు పక్షాన నిలిచి, నూతన విధానాలతో వారికి గిట్టుబాటు ధరలు కల్పించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

నేనేంటో చూపిస్తా…
తాను పర్యటనల కోసం సిద్ధం చేసుకున్న వారాహి వాహనాన్ని ఆపితే తానేంటో చూపిస్తా అని పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు. బెదిరించే నాయకులకు ఎదిరించే యువత సమాధానం చెప్తుందని ఆయన హెచ్చరించారు. అంబటి కాపుల గుండెలపై కుంపటి అని ఆయన విమర్శించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement