Thursday, May 9, 2024

మంజీరా పై మరో ఎత్తిపోతల ప్రాజెక్టు.. 30,646 ఎకరాలకు సాగునీరు

హైదరాబాద్‌, ఆధ్రప్రభ : రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఫలితాలు వస్తున్నా నిరంతర శ్రమతో ప్రతిఎకరానికి సాగునీరు అందించే ప్రయత్నాన్ని వేగవంతం చేసింది. జల వనరులను సద్వినియోగం చేసి కాకతీయుల కాలం నాటి స్వర్ణయుగానికి మించిన అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా ప్రాజెక్టుల నిర్మాణాలను ప్రభుత్వం శరవేగంగా పూర్తి చేస్తోంది. కృష్ణా, గోదావరితో పాటుగా వాటి ఉపనదులపై రిజర్వాయర్‌ నిర్మిస్తోంది. ప్రతినియోజకవర్గానికి లక్ష ఎకరాల సాగునీరు లక్ష్యంతో బడ్జెట్‌లో నిధులు ప్రకటించి పనుల్లో వేగం పెంచింది. ఈ నేపథ్యంలో దక్షిణ తెలంగాణలోని గోదావరి ఉపనది మంజీరా పై మరో ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

ప్రాజెక్టు నిర్మాణంకోసం రాష్ట్ర ప్రభుత్వం అంచనావ్యయాన్ని ఆమోదించి డీపీఆర్‌ను సిద్ధంచేసి భూసేకరణ చేస్తోంది. మంజీర నది ఆనకట్టను బలోపేతం చేసి నాగమడుగు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించేందుకు నిజాంసాగర్‌ డ్యాం దిగువన మల్లూరు దగ్గర రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న భూసేకరణ దాదాపుగా పూర్తి కావడంతో ప్రాజెక్టు నిర్మాణం పై ప్రభుత్వం దృష్టి సారించింది. మంజీరానది మహారాష్ట్ర బాలాఘాట్‌ పర్వత శ్రేణిలో పుట్టి 30వేల 844 చదరపు కిలోమీటర్ల పరివాహక ప్రాంతంలో వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేస్తూ గౌడ్‌ గవ్‌ దగ్గర తెలంగాణలో ప్రవేశించి కందకుర్తి దగ్గర గోదావరిలో మంజీర కలుస్తుంది.

దారిపొడుగునా అనేక రిజర్వాయర్లను నింపుతూ తెలంగాణలో వేలాది ఎకరాల సాగుభూమికి, హైదరాబాద్‌కు తాగునీటిని అందిస్తున్న మంజీర పై మరో ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నది సంగారెడ్డిలో దిశను మార్చే దగ్గర ఉన్న ప్రాజెక్టుల్లో నీటిని నింపి ముందుకు ప్రవహిస్తుంది. మంజిరా నదిపై ఆనకట్టను బలోపేతం చేసి నాగమడుగు ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు ప్రభుత్వంవేగంగా పనులు ప్రారంభించింది. ఈ ఎత్తిపోతల పథకంద్వారా 30వేల 646 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించేందుకు కామారెడ్డి జిల్లాలో పిట్ల, బిచ్కింద, నిజాంసాగర్‌ మండలాల్లో కరువు పడిత ప్రాంతాల చిన్న నీటి వరులను ఈ పథకానికి అవసరమైతే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 2.50 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తోంది.

- Advertisement -

ఈ పథకానికి కామారెడ్డి జిల్లా, నిజాంసాగర్‌ మండలం మల్లూర్‌ గ్రామం నిజాంసాగర్‌ డ్యామ్‌ దిగువ మంజీర నది నుంచి నీటిని ఎత్తి పోయడంకోసం బ్యారేజీ, సాగునీటి పథకానికి ప్రభుత్వం జీవో నం.106 ద్వారా రూ.476 కోట్ల 25 లక్షల పరిపాలనా పరమైన అనుమతులు లభించాయి. భూసేకరణ,తదితర ఇంజనీరింగ్‌ పనుల కోసం ఇప్పటివరకు రూ.14 కోట్లు ఖర్చు అయింది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతిపాదిత సామర్థ్యం 40వేల 768 ఎకరాల భూమి సాగులోకి రానుంది. దీంతో పాటుగా నిజామాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లోని గోదావరి ఉపనదులపై రిజర్వాయర్లు, ఎత్తిపోతల ప్రాజెక్టులు నిర్మించి సాగునీటికి నోచుకోని ఎగువప్రాంతాల భూములకు నీరందించేందుకు ప్రభుత్వం అనేక పథకాలను రూపొందిస్తోంది.

అయితే నదులు దిగువకు ప్రవహించడంతో ఎగువప్రాంతాలు ఇప్పటివరకు బోర్లు, బావులు, వర్షంపై ఆధార పడిన వ్యవసాయ యోగ్యం గల భూములకు ఎత్తిపోతల పథకాల ద్వారా నీరందించే కార్యక్రమంలో భాగంగా నాగమడుగు ఎత్తిపోతల పథకాననికి ప్రణాళిక సిద్ధం చేసిన ప్రభుత్వం ఆమేరకు పనుల్లో వేగం పెంచి సంవత్సరంలోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement