Sunday, May 5, 2024

ముంద్రా డ్రగ్స్ వ్యవహారంపై మరో చార్జిషీట్.. నిందితుల జాబితాలో మాచవరం సుధాకర్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ముంద్రా పోర్ట్ మాదకద్రవ్యాల వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) మరో చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు ప్రధాన చార్జిషీటుకు తోడు మొదటి సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలైంది. సోమవారం రెండవ సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో ఎన్ఐఏ మొత్తం 22 మందిని నిందితులుగా పేర్కొంది. నిందితుల్లో తెలుగు వ్యక్తి మాచవరం సుధాకర్ కూడా ఉన్నారు. నిజానికి ముంద్రా పోర్టులో భారీ ఎత్తున హెరాయిన్ దొరికినప్పుడే మాచవరం సుధాకర్ పేరు బయటికొచ్చింది. ఆయన పేరు మీదున్న సంస్థ అఫ్ఘనిస్తాన్ నుంచి టాల్కమ్ పౌడర్ పేరుతో మాదక ద్రవ్యాలను దిగుమతి చేసుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ మొదటి చార్జిషీట్లో 16 మంది, మొదటి సప్లిమెంటరీ చార్జిషీట్లో 9 మందిని నిందితులుగా పేర్కొంది.

నకిలీ కంపెనీలు, షెల్ కంపెనీల పేరుతో అఫ్ఘనిస్తాన్ నుంచి దిగుమతి చేసుకుని దేశీయంగా పంపిణీ చేస్తున్నట్టు ఎన్ఐఏ దర్యాప్తులో తేల్చింది. ముంద్రా పోర్టుతో పాటు కోల్‌కత్తా పోర్టు ద్వారా ఈ దిగుమతులు జరుగుతున్నట్టు తేలింది. దిగుమతి చేసుకున్న తర్వాత ఢిల్లీలోని వేర్వేరు గోదాముల్లో ఆ సరుకును భద్రపరుస్తున్నట్టు గుర్తించింది. ఈ మొత్తం వ్యవహారంలో హర్‌ప్రీత్ సింగ్ తల్వార్ కీలక సూత్రధారి అని తేల్చింది. ఢిల్లీలో పలు నైట్ క్లబ్బులు, హోటళ్లు, రిసార్టులు, రిటైల్ షోరూంలను నిర్వహిస్తున్న హర్‌ప్రీత్ సింగ్ తల్వార్, వాటి ద్వారా మాదకద్రవ్యాలను మార్కెట్లో పంపిణీ చేస్తున్నట్టు తేల్చింది.

- Advertisement -

టాల్కమ్ పౌడర్, సెమీ ప్రాసెస్డ్ టాల్కమ్ స్టోన్ పేరుతో దిగుమతి చేసుకున్న ముడి సరుకును ఢిల్లీలో నివాసం ఏర్పర్చుకున్న అఫ్ఘన్ జాతీయులు ప్రాసెస్ చేసి హెరాయిన్ లేదా ఇతర మాదక ద్రవ్యాలుగా మార్చుతున్నట్టు తేల్చింది. ముంద్రా పోర్టు నుంచి సుమారు 3 వేల కేజీల హెరాయిన్ ను దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్నాయి. మాదక ద్రవ్యాల అమ్మకాల ద్వారా వచ్చిన నిధులను లష్కర్-ఏ-తోయిబా వంటి ఉగ్రవాద సంస్థకు చేరవేస్తున్నట్టు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement