Thursday, May 2, 2024

ఈడీబీ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ‘ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్’  ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. 2020 సంవత్సరానికి గాను ‘బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్’ అమలులో టాప్ అచీవర్స్ 7 రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాలు చోటు దక్కించుకున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ 97.89 శాతం స్కోర్ తో మొదటి స్థానంలో నిలవగా, 97.77 శాతంతో రెండో స్థానంలో గుజరాత్ నిలిచింది. 96.97 శాతంతో తమిళనాడు, 94.86 శాతం స్కోరుతో తెలంగాణ రాష్ట్రాలు వరుసగా 3, 4 స్థానాల్లో నిలిచాయి. ఇదే జాబితాలో హర్యానా , కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాలు కూడా చోటు దక్కించుకున్నాయి.

గతంలో ఎన్నడూలేని కొత్త విధానాలతో ఈసారి ర్యాంకింగ్ ప్రక్రియను చేపట్టగా, ఆంధ్రప్రదేశ్ అన్నింటిలోనూ ముందువరుసలో నిలిచింది. 10,200 మంది పెట్టుబడిదారులు, భాగస్వాముల నుంచి అభిప్రాయాలను సేకరించారు. అన్ని రంగాల్లోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాలపై సానుకూలత వ్యక్తమైంది. 15 బిజినెస్ రెగ్యులేటరీ ప్రాంతాల్లో సింగిల్ విండో సిస్టమ్, సమాచార లభ్యత, కార్మికులు, పర్యావరణ, భూ పరిపాలన, భూ బదిలీ, ఇతర అనుమతులు వంటి మొత్తం 301 అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. అలాగే ట్రేడ్ లైసెన్స్, హెల్త్‌కేర్, లీగల్ మెట్రాలజీ, సినిమా హాల్స్, హాస్పిటాలిటీ, ఫైర్ విభాగం నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, టెలీకాం, సినీమాల చిత్రీకరణ, పర్యాటకం వంటి రంగాలను ఈ సంస్కరణల జాబితాలో తొలిసారిగా చేర్చారు. మొత్తంగా పెట్టుబడిదారుల నమ్మకాన్ని పెంపొందించడం, వ్యాపార అనుకూల పరిస్థితులు కల్పించడం, ఆరోగ్యకర పోటీ ఉండేలా చేయడం ఈ ర్యాంకుల ప్రధానోద్దేశమని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో ఈ ర్యాంకులను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నిర్మల సీతారామన్ 1991 తర్వాత దేశంలో మొదలైన సంస్కరణలతో పోల్చితే ఇప్పుడు జరుగుతున్న సంస్కరణలు స్పందనతో కూడుకున్నవని తెలిపారు. ప్రభుత్వంలోని ప్రతి విభాగాన్ని సంస్కరణలకు అనుగుణంగా తీర్చిదిద్దినట్టు తెలిపారు. అలాగే పారిశ్రామిక రంగం పాత్ర కూడా ఇందులో చాలా కీలకమైనదని అన్నారు.

కేంద్ర మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ దేశంలో వివిధ భాషల్లో ఫీడ్ బ్యాక్ తీసుకోవడంతో పాటు ఆధారసహిత విధానాలతో ర్యాంకులు ఇచ్చామని చెప్పారు. ఈ ర్యాంకుల ఉద్దేశం ఒకరి నుంచి మరొకరు ఉత్తమ విధానాలను తెలుసుకోవడమేనని, తద్వారా అన్ని రాష్ట్రాల్లో మెరుగైన విధానాలు అమల్లోకి వస్తే భారతదేశం ప్రపంచంలోనే పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానంగా మారుతుందని అన్నారు. 2014లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన తర్వాత భారతదేశంలో పెట్టుబడులు, పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకు అన్ని రాష్ట్రాలను భాగస్వాములను చేస్తూ పోటీతత్వంతో కూడిన విధానాల రూపకల్పనకు సూచనలు చేశారని, ఆ ప్రకారం ఆనాడు ప్రారంభించినదానికి నేడు ఫలాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement