Monday, May 6, 2024

అంబులెన్స్‌ అందుబాటులో లేక.. 5 కి.మీ. భుజంపైనే మృతదేహం మోసుకెళ్లిన దీనగాథ

ఓ అభాగ్యుడి కన్నీటి గాథ… నాలుగేళ్ల చిన్నారి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. తీసుకెళ్దామంటే అంబులెన్స్‌ అందుబాటులో లేదు. బస్సులో వెళ్దామంటే ఎక్కించుకోలేదు… చేసేదేమీ లేక భుజంపై మృతదేహాన్ని మోసుకుంటూ ఐదు కిలోమీటర్ల దూరంలోని తన స్వగ్రామానికి తీసుకెళ్లాడు. ఈ హృదయవిదారకమైన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అధికారులు ఆరా తీయగా… ఛతర్‌పుర్‌ జిల్లాలోని పౌడీ గ్రామానికి చెందిన నాలుగేళ్ల బాలిక తీవ్ర అనారోగ్యానికి గురికాగా కుటుంబ సభ్యులు సమీపంలోని బుక్స్‌వాహా హెల్త్‌ సెంటర్‌కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించగా, వైద్యుల సూచన మేరకు దామో జిల్లా కేంద్రంలోని పెద్దాస్పత్రికి తరలించారు.

అక్కడి చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. బాలిక మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ కోసం ప్రయత్నించగా ఆస్పత్రి సిబ్బంది స్పందించలేదు. ఎంత బ్రతిమాలినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో చేసేదేమీ లేక మృతదేహాన్ని దుప్పటితో కప్పి మేనమామ భుజంపై వేసుకుని దామో నుంచి బుక్స్‌వాహాకు వచ్చాడు. అక్కడి నుంచి కాలినడకన ఐదు కిలోమీటర్ల దూరంలోని తమ స్వగ్రామం పౌడీకి తీసుకొచ్చాడు. ఈ ఘటనపై స్పందించిన డీఎంహెచ్‌వో విచారణకు ఆదేశించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement