Sunday, April 28, 2024

షావోమీ సంస్థపై పన్ను ఎగవేత ఆరోపణలు.. దర్యాప్తు జరుపుతున్న డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్..

దేశంలో ‘రెడ్‌మీ’, ‘ఎంఐ’ బ్రాండ్ ఫోన్లతో ప్రసిద్ధి చెందిన ‘షావోమీ’ సంస్థ రూ. 653 కోట్ల మేర పన్ను ఎగవేతకు పాల్పడినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్ బ్రాండ్లలో ఒకటైన ఈ సంస్థ భారతదేశంలో జరిపే కార్యాకలాపాల్లో అవకతవకలకు పాల్పడినట్టు కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) సంస్థ జరిపిన దర్యాప్తులో ఈ మేరకు కీలక ఆధారాలు లభించాయని తెలిపింది. వస్తువుల అసలు ధరను తగ్గించి చూపుతూ ఈ సంస్థ, సంస్థ దగ్గర కాంట్రాక్ట్ పొందిన సంస్థలు కలిసి కస్టమ్స్ సుంకం ఎగవేతకు పాల్పడుతున్నాయని డీఆర్ఐ గుర్తించింది. దర్యాప్తులో భాగంగా షావోమీ ఇండియా సంస్థ కార్యాలయాల్లో జరిపిన సోదాల్లో ఈ సంస్థ రాయల్టీ, లైసెన్స్ ఫీజు రూపంలో ‘క్వాల్‌కాం యూఎస్ఏ’ సంస్థతో పాటు ‘బీజింగ్ షావోమీ మొబైల్ సాఫ్ట్‌వేర్ కం.లిమిటెడ్’ (చైనా) సంస్థలకు చెల్లింపులు జరుపుతోందని తేలింది.

అలాగే షావోమీ ఇండియా సంస్థ ప్రతినిధులను డీఆర్ఐ అధికారులు ప్రశ్నించగా, ఈ చెల్లింపులను ఒక ప్రతినిధి అంగీకరించారని తెలిపింది. షావోమీ సంస్థ దిగుమతి చేసుకుంటున్న వస్తువులు, సరుకు (ఎలక్ట్రానిక్ విడిభాగాలు) లావాదేవీల్లో ఈ రెండు సంస్థలకు జరిపిన చెల్లింపులను చూపలేదని డీఆర్ఐ గుర్తించింది. చైనా నుంచి స్మార్ట్ ఫోన్లు, వాటి విడిభాగాలను దిగుమతి చేసుకుంటూ విక్రయాలు జరుపుతున్న షావోమీ సంస్థ కస్టమ్స్ డ్యూటీ నుంచి తప్పించుకోవడం కోసమే రాయల్టీ, లైసెన్స్ ఫీజు చెల్లింపుల లావాదేవీలను లెక్కల్లో చూపలేదని డీఆర్ఐ దర్యాప్తులో తేలింది.

తద్వారా కస్టమ్స్ చట్టం, 1962లోని సెక్షన్ 14తో పాటు కస్టమ్స్ వ్యాల్యూయేషన్ రూల్స్ 2007ను ఉల్లంఘించిందని పేర్కొంది. 2017 ఏప్రిల్ 1 నుంచి 2020 జూన్ 30 మధ్యకాలంలో ఈ సంస్థ మొత్తం రూ. 653 కోట్ల మేర ఎగవేతకు పాల్పడిందని, ఆ సొమ్ము రికవరీ కోసం డీఆర్ఐ 3 షోకాజ్ నోటీసులు పంపించిందని కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement