Sunday, May 5, 2024

నేటి బిఆర్ఎస్ స‌మావేశంలో కెసిఆర్ ‘మ‌హా’ వ్యూహం…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : రాజకీయ వ్యూహాలు అమలు చేయడంలో గులాబీ పార్టీ దళపతి, తెలంగాణ సీఎం కేసీఆర్‌ దిట్ట అన్నది గడిచిన రెండు దశాబ్ధాల కాలంగా ప్రజల్లో నానుతున్న వాస్తవం. ఆయన పట్టుబడితే సాధించి తీరుతారని రాజకీయ వర్గాల్లో గట్టి నమ్మకం. అది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించడంలో నిరూపితమైంది కూడా. తాను విజయం వైపు దూసుకెళ్తానన్న అచంచల విశ్వాసం ఇప్పుడున్న రాజకీయాల్లో కేసీఆర్‌కే సొంతం. ఆ నమ్మకమే ఆయనకు రెండు సార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కేలా చేసిందని రాజకీయ విశ్లేషకులు బల్లగుద్ది చెబుతారు. ప్రస్తుతం మూడోసారి ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్‌ విజయం సాధించడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ అధినేత ముందుకు సాగుతున్నారు. ఒకవైపు జాతీయ పార్టీగా దేశ రాజకీయాల్లో కీలకమయ్యే ప్రయత్నాలు చేస్తూనే, తెలంగాణలో రాజకీయంగా తనకెవ్వరూ సాటి లేరన్న సంకేతాలు ఇస్తున్నారు. ఆ ‘మహా’ వ్యూహం వెనక మర్మమేంటో తెలియక రాజకీయ ప్రత్యర్థులు జుట్లు పీక్కుంటున్నారు. కేసీఆర్‌ అమ్ముల పొదిలో అస్త్రాలు అనేకమన్న రాజకీయ విశ్లేషకుల వాదనే పార్టీ శ్రేణులను ధైర్యంతో ముందుకు నడిపిస్తోంది. అందుకే ఏ నియోజకవర్గంలో చూసినా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఈసారీ.. గెలుపు తమదేనన్న బలమైన ధీమాతో ఉన్నారు. ప్రధాన ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీల ముఖ్య నేతలకు అంతుచిక్కని రీతిలో గులాబీ దళపతి రాజకీయ నిర్ణయాలు సర్వత్రా ఉత్కంఠను రేపుతున్నాయి.

ఇక తెలంగాణలో ప్రధానంగా బీఆర్‌ఎస్‌కు పోటీ-గా అటు- బీజేపీ, ఇటు- కాంగ్రెస్‌ ఉన్నాయి. అయితే ఈ రేసులో కాంగ్రెస్‌ ఎక్కడో వెనకపడ్డట్టు- అనిపించింది. కానీ కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలుపుతో ఒక్కసారిగా పరిస్థితులు హస్తం పార్టీకి సానూకూలంగా మారిపోయాయన్న ప్రచారం జరుగుతోంది. దీంతో తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌ అలెర్ట్‌ అయినట్లు- కనిపిస్తుంది. రాజకీయ ప్రత్యర్థులను దెబ్బకొట్టే ఎలాంటి వ్యూహాలు నేటి బిఆర్ఎస్ ఎంపి,ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భేటీలో ఉంటాయోనని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఓ వైపు బీజేపీ ..మరో వైపు కర్నాటకలో గెలుపుతో ఊపు మీదున్న కాంగ్రెస్‌ నాయకులు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. లోలోన ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలపై చర్చించేందుకు మాత్రమే కేసీఆర్‌ ఈ సమావేశం నిర్వహిస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి.
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో వరుస సమీక్షలు, సమాలోచనలు, కీలక నిర్ణయాలు, మార్గనిర్ధేశాలతో రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తేలా చేయాలన్నది బీఆర్‌ఎస్‌ అధినేత లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రత్యేకించి క్షేత్రస్థాయిలో అవినీతి రహిత పాలన, దౌర్జన్యాలు, అతివిశ్వాసాలకు దూరంగా పార్టీ నాయకులను పురమాయించడం లాంటి చర్యలకు కేసీఆర్‌ దృష్టి కేంద్రీకరించారు. కీలక భేటీల ద్వారా దిశా నిర్ధేశం చేసే లక్ష్యంతోనే ఈ నెల నేటి కీలక సమావేశం సారాంశమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.


జూన్‌ తొలి వారంలో ఉండే అవకాశం
ఈ నాలుగో సభను ఈ నెలాఖరున కానీ, జూన్‌ తొలి వారంలో కానీ మహారాష్ట్రలోని చంద్రపుర్‌ లో నిర్వహించనున్నట్లు- సమాచారం. మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌ నేతలు ఈ సారి షోలాపూర్‌ లో కానీ, నాగపూర్‌ లో కానీ కేసీఆర్‌ సభ పెట్టాలని కోరుకున్నారని, అయితే, ముందుగా చంద్రపుర్‌ భారీ సభను నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందని బీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. చంద్రపుర్‌ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు ఉన్నారు. ఈ సభలో స్థానిక కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేన నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement