Tuesday, May 30, 2023

Big story | వ్యవసాయం, రియల్‌ రంగాలదే అగ్రస్థానం.. ఈ రెండు రంగాల్లో దేశంలోనే తెలంగాణలో సరికొత్త ప్రయోగాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో వ్యవసాయ పరిరక్షణ దిశగా ఇప్పుడిస్తున్న ఆర్థిక సాయాలు, అందజేస్తున్న సంక్షేమ పథకాలకు తోడుగా సాగు భూముల పరిరక్షణ దిశగా ప్రభుత్వం ప్రణాళికలు వేసుకుంటోంది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని రీతిలో తెలంగాణ సర్కార్‌ గడచిన ఎనిమిదేళ్లలో వ్యవసాయ రంగానికి, రైతు సంక్షేమానికి రూ. లక్షల కోట్లు వెచ్చించింది. ప్రాజెక్టుల నిర్మాణంతో కొత్తగా కోటి ఎకరాల ఆయకట్టును స్థిరీకరించుకుంది. అదేవిధంగా రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయ యాంత్రీకరణ సబ్సిడీలు, ధరణి పోర్టల్‌తో వ్యవసాయ భూముల పరిరక్షణకు విప్లవాత్మక సంస్కరణలు అమలులోకి తెచ్చింది. దీంతో రాష్ట్రంలో వ్యవసాయం పండుగగా మారింది.

ఉమ్మడి రాష్ట్రంలో దండుగగా మారిన తెలంగాణ వ్యవసాయ రంగం 24గంటల నిరంతరాయ ఉచిత విద్యుత్‌ అందజేత, కొత్త ప్రాజెక్టులతో సాగునీటి కల్పనతో అద్భుతంగా వర్ధిళ్లింది. ఈ క్రమంలో తెలంగాణ ఆర్ధిక ఎదుగుదల, సంపదలో రియల్‌ఎస్టేట్‌, వ్యవసాయ రంగాలు ఊతంగా నిల్చాయి. భారత ఆర్థిక వ్యవస్థ గణాంక నివేదికలో తెలంగాణ తొలి స్థానంలో నిల్చింది.

- Advertisement -
   

రెండు రంగాల్లో తీవ్ర పోటీ…

రియల్‌, వ్యవసాయం ఈ రెండు రంగాలు ఇప్పుడు ఒకదానితో మరోటి పోటీ పడుతున్నాయి. వ్యవసాయ భూముల ధరలతో ఇండ్ల స్థలాలు పోటీ పడుతున్న నేపథ్యంలో పంట పొలాలు రియల్‌ వెంచర్లుగా మారుతున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేల రైతుబంధు ఆర్థిక సాయం రైతులకు వరంగా మారగా, కొత్తగా వ్యవసాయరంగంలోకి రైతులు వచ్చి చేరుతున్నారు. కొత్తగా కోటి ఎకరాల మాగాణం సాగులోకి రాగా, ఈ ఎనిమిదేళ్లలో వ్యవసాయరంగం నుంచి 15 లక్షల ఎకరాలు అనేక కారణాలతో రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి వెళ్లినట్లు అనధికారక లెక్కలున్నాయి.

ఇందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న విప్లకాత్మక చర్యలు, సంస్కరణలే కారణంగా మారాయి. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, కొత్త పంచాయతీలు, కొత్త కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, రహదారుల విస్తరణ, వికేంద్రీకరణ, ప్రభుత్వ సేవల కల్పన, వ్యవసాయ భూముల కన్వర్షన్‌లో సంస్కరణలు, తగ్గింపులు ఇలా అనేక రకాల చర్యల ఫలితంగా రియల్‌ రంగం అద్భుతంగా పురోగమిస్తున్నది.

నానాటికీ పెరుగుతున్న సాగు విస్తీర్ణం…

తెలంగాణ ప్రభుత్వ ఉద్దీపన చర్యలతో రాష్ట్రంలో రైతుల సంఖ్య 49లక్షల నుంచి 65లక్షలకు మించింది. సాగు భూమి, పంటల సాగు విస్తీర్ణం రికార్డు స్థాయిలో పెరిగింది. వానాకాలంలో ఏకంగా 135 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగై సరికొత్త రికార్డుకు చేరింది. 2015-16లో 85లక్షల ఎకరాల్లో, 2016-17లో 108 లక్షల ఎకరాల్లో, 2017-18లో 111 లక్షల ఎకరాల్లో, 2019-20లో 122 లక్షల ఎకరాల్లో, 2020-21లో 135లక్షల ఎకరాల్లో, 2021-22లో 129లక్షల ఎకరాల్లో, 2022-23లో 135 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగింది.

సాగు భూముల రక్షణలో అప్రతిహత చర్యలు…

ఈ నేపథ్యంలో ప్రభుత్వం వ్యవసాయరంగ పరిరక్షణ, సాగు భూముల రక్షణ దిశగా యోచిస్తోంది. దేశంలోనే అన్ని రాష్ట్ర్రాలకు దిక్సూచీగా తెలంగాణ భూ విధానం, నూతన నిర్ణయాలు అవలంభించేందుకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగా గాంధీజీ కలలుకన్న భూ కమతాల ఏకీకరణ వంటి కీలక నిర్ణయాలకు తెలంగాణ రాష్ట్రం వేదికగా నిలిచేందుకు కార్యాచరణ చేస్తోంది. స్వాతంత్య్రానంతరం ఏ రాష్ట్రం కలలో కూడా ఊహించని రీతిలో నూతనత్వ విధానాలను అందిపుచ్చుకుంటూ ప్రత్యేకతతో ముందడుగు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థకు మరిన్ని మెరుగులు దిద్దుతోంది.

చిన్నపాటి భూ కమతాలతో వ్యవసాయానికి ప్రయోజనం లేదన్నది వందల ఏండ్లుగా వ్యక్తమవుతున్న అభిప్రాయమే… అయితే ఏ ప్రభుత్వమూ…. పాలకులూ కూడా కమతాల ఏకీకరణకు సాహసించలేదు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల్లో భూ కమతాల ఏకీకరణ ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. కమతాల ఏకీకరణను ప్రకటించడమే కాదు అందుకు అనువుగా భూ కమతాల ఏకీకరణ చట్టం-1956ను సవరించింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు దీనిని కఠినతరం చేయాలని యోచిస్తోంది.

వ్యవసాయ సాగువిస్తీర్ణం తెలంగాణ రాష్ట్రంలో క్రమంగా తగ్గుముఖం పడుతూ ఆహారధాన్యాలకు కొరత ముప్పు నెలకొనే విపత్కర తీరు నేపథ్యంలో ప్రభుత్వం కీలక చర్యలకు ఉపక్రమించింది. ఒకవైపు కరవు, మరోవైపు రియల్‌ ఎస్టేట్‌ భారీగా విస్తరించడంతో వ్యవసాయ భూములు సాగుకు దూరమవుతున్నాయన్న వాదనలకు ధీటుగా చర్యలు తీసుకుంటోంది. గతంలో చిన్నచిన్న కమతాలున్న రైతులు తమ భూములను అమ్ముకుంటున్న పరిస్థితిని రూపుమాపేలా కార్యాచరణ చేస్తోంది. వ్యవసాయానికి అనువుగా లేకపోవడడం, చిన్నచిన్న విస్తీర్ణాలలో చేసే సాగుకు పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తమ భూములను దళారులకు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు లేదంటే పక్క రైతులకు అమ్ముకుంటున్నారు.

దీంతో వ్యవసాయ రంగం క్రమంగా తగ్గుతూ పరిస్థితి ప్రమాదకరంగా మారుతోందని గుర్తించింది. ఈ ప్రమాదాల నివారణకు కమతాల ఏకీకరణతో కొంత అడ్డుకట్ట వేయవచ్చని సర్కార్‌ యోచిస్తోంది. ఈ దిశలోనే భూ కమతాల ఏకీకరణకు వీలుగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. చిన్నచిన్న కమతాలను ఏకం చేయడంలో భాగంగా రైతులకు అనేక ప్రయోజనాలను కలిగించింది. తద్వారా భూ వివాదాల నివారణ, సాగు విస్తీర్ణం పెంచుకోవచ్చని యోచిస్తోంది. తద్వారా రెండు వేర్వేరు సర్వే నెంబర్లలోని ఒకే రైతుకు చెందిన భూములను ఒకే సర్వే నెంబర్‌ కిందకు చేఏలా అవకాశం కల్పించింది. ఇద్దరు రైతులు పరస్పరం చేసుకునే భూ మార్పిడికి రిజిస్ట్రేషన్‌ రుసుమును మినహాయించడం కూడా రైతులకు ప్రోత్సాహం కలిగిస్తోంది

Advertisement

తాజా వార్తలు

Advertisement