Friday, May 3, 2024

Delhi | బీసీల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్ కావాలి.. నిర్మలాకు బీసీ సంఘాల విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : వెనుకబడిన వర్గాల విద్య, ఉద్యోగ, సామాజికాభివృద్ధికి రెండు లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బీసీ సంఘం నేతలు గుజ్జ కృష్ణ తదితరులతో కలిసి ఆయన బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ను ఆమె కార్యాలయంలో కలిశారు. బీసీల సమస్యలపై చర్చించారు. సమావేశం అనంతరం ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్రం బడ్జెట్‌లో బీసీల అభివృద్ధికి బడ్జెట్ కేటాయించకుండా అన్యాయం చేస్తోందని నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు.

45 లక్షల 90వేల కోట్ల బడ్జెట్‌లో బీసీలకు 2 వేల కోట్లు కేటాయిస్తే ఏ మూలకు సరిపోతుందని ప్రశ్నించారు. మండల కమిషన్ సిఫార్సుల ప్రకారం కేంద్ర ఉద్యోగాలలో విద్యాసంస్థలలో రిజర్వేషన్లు అమలు చేయడం ప్రారంభించి దశాబ్దాలు గడుస్తున్నా స్కాలర్‌షిప్‌లు, ఫీజ్ రిఎంబర్స్‌మెంట్ స్కీములు ప్రారంభించడం లేదన్నారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న స్కీములకు 60 శాతం మ్యాచింగ్ గ్రాంటు కూడా ఇవ్వడం లేదని కృష్ణయ్య ఆరోపించారు. రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే స్కాలర్‌షిప్ – హాస్టల్ పథకాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి గ్రాంటు ఇవ్వాలని నిర్దేశిస్తోందని మంత్రికి గుర్తు చేశామన్నారు. అలాగే కేంద్ర ఆధ్వర్యంలోని విశ్వవిద్యాలయాలు, ఐఐటీ, ఐఐఎంలలో చదివే విద్యార్థులకు కూడా ఫీజులు – స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం లేదన్నారు.

తెలుగు రాష్ట్రాలలో మాదిరిగా ప్రతి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల పాఠశాలలు ఏర్పాటు చేయాలని కృష్ణయ్య సూచించారు. అలాగే జాతీయ బీసీ కార్పొరేషన్ నియమ నిబంధనలు సడలించి కులవృత్తులు – చేతివృత్తుల వారికి స్వయం ఉపాధి పథకాలు, చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకోవడానికి ప్రతి కుటుంబానికి 10 లక్షలు మంజూరు చేయాలని నిర్మలా సీతారామన్‌ను కోరామని ఆయన వెల్లడించారు. పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే వారికి దేశంలో ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని అభ్యర్థించామని కృష్ణయ్య చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement