Thursday, May 2, 2024

Delhi | కేంద్రానికి గుణపాఠం ఖాయం.. తిరంగా మార్చ్‌లో బీఆర్ఎస్ నేతల నిరసన గళం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేతలు నినదించారు. గురువారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరి రోజు ప్రతిపక్షాలు నిర్వహించిన తిరంగా మార్చ్‌లో పాల్గొన్న బీఆర్ఎస్ ఎంపీలు, కేంద్ర ప్రభుత్వం అదానీ ప్రయోజనాల కోసమే పనిచేస్తోందని ధ్వజమెత్తారు. అదానీ – హిండెన్‌బర్గ్ వ్యవహారం, ప్రధానితో సంబంధాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటు చేయాలంటూ ప్రతిపక్షాలు పట్టుబడుతూ ప్రతి రోజూ ఆందోళన చేపట్టినప్పటికీ వినకుండా సభను ప్రతిరోజూ వాయిదా వేయడాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు ‘తిరంగా మార్చ్’ చేపట్టాయి. పార్లమెంట్ ఉభయ సభలు నిరవధిక వాయిదాపడ్డ వెంటనే కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ఈ నిరసన ర్యాలీ జరిగింది. ఎంపీలు జాతీయ జెండా చేతబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మార్చ్‌ చేపట్టారు.

వారిని విజయ్ చౌక్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వం తీరును తీవ్రంగా తప్పుబట్టాయి. అదానీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న బీజేపీ సర్కారు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు అన్నారు.  ఇన్ని రోజులుగా వాయిదాలతోనే సమావేశాలను సరిపెట్టారని, బడ్జెట్ గురించి, ప్రజా సమస్యల గురించి చర్చించకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కేశారని అన్నారు. అదానీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ తప్పు ఉంది కాబట్టే జేపీసీ వేయకుండా పారిపోయిందని ఆరోపించారు. జరుగుతున్న పరిణామాలన్నింటినీ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, తగిన సమయంలో ఈ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెబుతారని నామా నాగేశ్వర రావు హెచ్చరించారు.

- Advertisement -

అధికార పార్టీ సభ్యులే గందరగోళం చేస్తున్నారు: కేకే

తన 60 ఏళ్ల రాజకీయ జీవితంలో అధికార పార్టీ సభ్యులే సభలో గందరగోళం సృష్టించి సభ వాయిదా పడేలా చేయడాన్ని తొలిసారిగా చూశానని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవ రావు అన్నారు. తిరంగా మార్చ్ తర్వాత కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, పార్లమెంట్ సమయాన్ని పూర్తిగా వృధా చేశారని, బడ్జెట్‌పై చర్చ లేకుండా నిమిషాల్లోనే ఆమోదించుకున్నారని అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడవడమేనని, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు తామంతా ఐక్యం కావాలనుకుంటున్నామని చెప్పారు. తెలంగాణ నుంచి తాము “అబ్ కీ బార్ – కిసాన్ సర్కార్” నినాదంతో దేశవ్యాప్తంగా తమ పోరాటాన్ని విస్తరిస్తామని చెప్పారు. ఇకపోతే రాహుల్ గాంధీకి పరువు నష్టం అనే ఓ చిన్న కేసులో ఇత గరిష్ట శిక్ష విధించడం ఒక్క గుజరాత్‌లోనే జరిగిందని అన్నారు. జైలు శిక్ష పడ్డ అమ్రేలీ ఎంపీపై అనర్హత వేటు వేయకుండా కేవలం రాహుల్ గాంధీపై మాత్రమే వేటు వేశారని ఆరోపించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement