Sunday, April 28, 2024

Delhi | ఏపీ ఎన్నికల ప్రధానాధికారికి పిలుపు.. ఓటర్ల జాబితా ఫిర్యాదులపై వివరణ కోరిన ఈసీ!

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనాను ఢిల్లీకి పిలిపించి వస్తున్న ఫిర్యాదులు, ఆరోపణలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వివరణ కోరినట్టు తెలిసింది. హుటాహుటిన ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎంకే మీనాను ఢిల్లీకి పిలిపించారు. ఓటర్ల జాబితాలో చాలా మంది పేర్లు గల్లంతవడం ఒకెత్తయితే నకిలీ ఓట్ల చేరికల గురించి ప్రతిపక్ష పార్టీలు గత కొన్నాళ్లుగా ఫిర్యాదులు చేస్తున్నాయి.

అయితే ఓట్ల తొలగింపు ఆరోపణలను సీఈవో ముఖేశ్ కుమార్ మీనా కొట్టిపడేశారు. చాలా పారదర్శకంగా జాబితా రూపకల్పన చేస్తున్నామని, ఏపీలో యువ ఓటర్ల సంఖ్య తక్కువగా ఉన్నారని అప్పట్లో వివరణ ఇచ్చారు. అక్టోబర్ 17 నాటికి ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటిస్తామని వెల్లడించారు. రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకుని ఇంటింటికీ వెళ్లి ఓటర్ల జాబితాపై తనిఖీ చేసుకోవచ్చని కూడా అన్నారు. పెద్ద ఎత్తున ఓట్లను తీసేసినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు.

- Advertisement -

అయితే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని తెలుగుదేశం పార్టీ నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై వివరణ కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీకి పిలిపించినట్టు తెలిసింది. ప్రస్తుత ఓటర్ల జాబితాతో పాటు ముఖ్యమైన ఫైళ్లను తీసుకురావాలని ఆదేశించింది. సీఈసీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మంగళవారం మధ్యాహ్నం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సహా కేంద్ర ఎన్నికల సంఘంలోని ఇతర ముఖ్య అధికారులను ఎంకే మీనా కలిశారు. ఓటర్ల జాబితా అంశంపై వచ్చిన ఫిర్యాదులకు వివరణ ఇచ్చినట్టు తెలిసింది. అలాగే ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఇతర అంశాల గురించి కూడా చర్చించినట్టు సమాచారం. 

Advertisement

తాజా వార్తలు

Advertisement