Monday, April 29, 2024

Follow up | ఐదో రోజూ నష్టాలే.. వెంటాడిన ఫెడ్‌ భయాలు, సెన్సెక్స్‌ 139, నిఫ్టీ 43 పాయింట్లు పతనం

దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా ఐదోరోజూ నష్టాల్లో ముగిశాయి. గురువారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేశాయి. కనిష్ట స్థాయిల్లో కొనుగోళ్ల మద్దతుతో కోలుకున్నప్పటికీ, చివరి వరకు స్థిరంగా నిలబడలేక పోయాయి. ఆఖరి అర్ధ గంటలో అమ్మకాలు వెల్లువెత్తడంతో ట్రేడింగ్‌ నష్టాల్లో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లోని మిశ్రమ సంకేతాలు కూడా మన మార్కెట్లపై ప్రభావం చూపాయి. అమెరికా ఫెడ్‌ రిజర్వు వడ్డీరేట్లను పెంచనున్నదన్న భయాలు.. ఆసియా మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ ఫోలియో ఇన్వెస్టర్లు తమ నిధులు ఉపసంహరించుకోవడం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు వంటి పరిణామాలు సూచీలను కలవరపెట్టాయి. మరోవైపు నెలవారీ డెరివేటివ్స్‌ ఎక్స్‌పైరీ నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగింది.

- Advertisement -

ఫలితంగా బీఎస్‌ఈ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 139.18 పాయింట్లు (0.23 శాతం) నష్టంతో 59,605.80 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 59,960 పాయింట్ల గరిష్టాన్ని తాకి, 59,406.31 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. ఎన్‌ఎస్‌ఈ సూచీ నిప్టీ సైతం 43.05 పాయింట్ల పతనంతో 17,511.25 వద్ద నిలిచింది. సెన్సెక్స్‌-30 సూచీలో ఏషియన్‌ పెయింట్స్‌, లార్సెన్‌ అండ్‌ టర్బో, టైటాన్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, పవర్‌గ్రిడ్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇన్ఫోసిస్‌, హెచ్డిఎఫ్సీ బ్యాంక్‌, హెచ్డిఎఫ్సీ భారీగా నష్టపోయాయి. మరోవైపు యాక్సిస్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, ఐటీసీ, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, టాటా స్టీల్‌, సన్‌ ఫార్మా తదితర స్క్రిప్ట్‌లు ల్రాభ పడ్డాయి. ఫారెక్స్‌ మార్కెట్‌లో అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ రూ.82.73 వద్ద స్థిర పడింది.

జీ ఎంటర్‌టైన్‌ మెంట్‌ షేరు ఇంట్రాడేలో రూ.176.55 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ దాఖలు చేసిన పిటిషన్‌ మేరకు దివాలా పరిష్కార ప్రణాళిక ప్రక్రియను ప్రారంభించడానికి ఎన్‌సీఎల్‌టీ ముంబై ధర్మాసనం ఆదేశించింది. దీంతో సోనీ, జీ విలీన ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడ్డాయి. దీనిపై ఎన్‌సీఎల్‌టీకి వెళ్తామని జీ సీఈవో పునీత్‌ గోయెంకా తెలిపారు. ఈ ప్రకటన తర్వాత షేరు కనిష్టాల నుంచి కోలుకుంది. చివరకు 3.46శాతం నష్టపోయి రూ.199.20 వద్ద ముగిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement