Saturday, May 4, 2024

విజయవాడ-కాజీపేట రైల్వే ప్రాజెక్టుకు రూ.592.5 కోట్లు.. లోక్‌సభలో వెల్లడించిన కేంద్రమంత్రులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : భారత్-ఆస్ట్రేలియా దేశాల మధ్య 2022 ఏప్రిల్‌లో కుదుర్చుకున్న ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందం కారణంగా వ్యాపారాలు నష్టపోతుందనే భయంతో ఉన్న దేశీయ ఉత్పత్తిదారుల ప్రయోజనాలను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుందని వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్‌ స్పష్టం చేశారు. బుధవారం నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆమె లిఖితపూర్వక బదులిచ్చారు. వివిధ వాటాదారుల, ఆసక్తి ఉన్న గ్రూపుల వారిని సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ ఒప్పందంపై సంతకం చేసినట్లు తెలిపారు. ఇది కాకుండా, ప్రభుత్వం సున్నితమైన అంశాలను షెడ్యూల్‌ నుంచి మినహాయించిందని, కఠినమైన మూలాధార నిబంధనలను విధించిందని, 14 సంవత్సరాల పాటు ద్వైపాక్షిక భద్రతా చర్యలను అమలు చేసిందని కేంద్రమంత్రి జవాబిచ్చారు.

విజయవాడ-కాజీపేట మూడో రైల్వే లైన్‌ ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు 2022–23 బడ్జెట్‌లో రూ.592.5కోట్లు కేటాయించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రాజెక్టు వ్యయం రూ.1953కోట్లు కాగా, మార్చి 2022 వరకు రూ.831 కోట్లు ఖర్చు చేశారని శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నలకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. భారతీ రైల్వే సామర్థ్యాన్ని పెంపొందించే ముఖ్యమైన ప్రాజెక్టు విజయవాడ– కాజీపేట 3వ రైల్వే లైన్‌ పురోగతి ప్రాజెక్టు పనులు నెమ్మదించడంపై ఎంపీ ఆరా తీశారు. ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు 2022–23 కేంద్ర బడ్జెట్‌లో రూ.592.5కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుండి భూసేకరణ, అటవీ క్లియరెన్స్‌లు, వివిధ అధికారుల నుండి చట్టబద్ధమైన అనుమతులు వంటి అనేక అంశాలు రైల్వే ప్రాజెక్టులు సకాలంలో పూర్తిచేయడంపై ప్రభావం చూపుతున్నాయని మంత్రి తెలిపారు. 2014నుంచి మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్‌ కేటాయింపులు గణనీయంగా పెరిగాయని అశ్వినీ వైష్ణవ్ వివరించారు. ఏపీ ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు బడ్జెట్‌ కేటాయింపులు 2009–14 మధ్యలో రూ.886కోట్లు కాగా, 2014–19 మధ్య రూ.2830 కోట్లకు పెరిగాయని వెల్లడించారు. 2014–22లో, 989కి.మీ (350కి.మీ కొత్తలైన్‌ మరియు 639కి.మీ డబ్లింగ్‌) లైన్‌ ఆంధ్రప్రదేశ్‌లో సగటున 123.63కి.మీతో ప్రారంభించామని ఆయన చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement