Tuesday, April 30, 2024

బోణీ కొట్టేదెవరు..నేటి నుంచి లార్డ్స్ లో రెండో టెస్ట్

ఇండియా, ఇంగ్లాండ్ ల మధ్య కాసేపట్లో రెండో టెస్ట్ ప్రారంభంకానుంది. లార్డ్స్‌ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ లో బోణీ కొట్టాలని ఇరు జట్లు తహతహలాడుతున్నాయి. ఇక తొలి టెస్టు గెలిచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ముందంజ వేద్దామనుకున్న భారత ఆశలపై వరుణుడు నీళ్లు గుమ్మరించాడు. దీంతో రెండ్ టెస్ట్ లో భారత్ మరింత కసితో బరిలోకి దిగనుంది. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియాదే పైచేయిగా కనిపించినా.. టాపార్డర్‌ వైఫల్యం కలవరపాటుకు గురి చేస్తోంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతోపాటు చటేశ్వర్‌ పుజార, అజింక్యా రహానె పేలవ ప్రదర్శన కనబర్చగా.. కేఎల్‌ రాహుల్‌, జడేజా అర్ధ శతకాలతో ఆదుకున్నారు. కాగా, గాయం కారణంగా పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ రెండో మ్యాచ్‌కు దూరం కావడంతో.. కోహ్లీ 4-1 పద్ధతిని మార్చుకోవాల్సి రావచ్చు. నెట్‌ సెషన్‌లో శార్దూల్‌కు కండర గాయం కావడంతో.. అతడి స్థానంలో అశ్విన్‌కు తుది జట్టులో చోటుదక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ నలుగురు పేసర్లుతో దిగాలనుకుంటే ఇషాంత్‌ లేదా ఉమే్‌షకు చాన్స్‌ దక్కొచ్చు. పేస్‌ గన్‌ బుమ్రా గాడిలో పడడం జట్టుకు లాభదాయకం. అతడికి షమి, సిరాజ్‌ నుంచి మంచి సహకారం అందుతోంది.

ఇక ఇంగ్లాండ్ జట్టు అనుభవలేమితో కొట్టుమిట్టాడుతున్నది. ఇక స్టార్ పేసర్ స్టువర్ట్‌ బ్రాడ్‌ గాయంతో మొత్తం సిరీస్‌కు దూరమయ్యాడు. ఇది ఇంగ్లాండుకు పెద్ద దెబ్బే. బ్రాడ్‌ గైర్హాజరీలో అండర్సన్‌, మార్క్‌ వుడ్‌, రాబిన్సన్‌ బౌలింగ్‌ దళాన్ని ముందుండి నడిపించనున్నారు. ఇదిలా ఉంటే బ్రాడ్‌ గాయాన్ని దృష్టిలో పెట్టుకుని లాంకషైర్‌ సీమ్‌ బౌలర్‌ సకీబ్‌ మహమూద్‌ను రిజర్వ్‌ ప్లేయర్‌గా తీసుకుంది. సకీబ్‌ చేరికతో స్పిన్నర్‌ డామ్‌ బెస్‌ను జట్టు నుంచి తప్పిస్తూ యార్క్‌షైర్‌కు ఈసీబీ పంపింది. ఒక వేళ పిచ్‌ స్పిన్‌కు అనుకూలంగా ఉంటే స్పిన్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ తుది జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తున్నది. మొత్తంగా కెప్టెన్‌ రూట్‌ బ్యాటింగ్‌ భారాన్ని మోస్తుంటే.. బౌలింగ్‌లో అండర్సన్‌ పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్నాడు.

భారత జట్టు అంచనా:

రోహిత్‌, రాహుల్‌, పుజార, కోహ్లీ, రహానె, రిషభ్‌ పంత్‌, జడేజా, అశ్విన్‌/ఇషాంత్‌/ఉమే్‌ష, షమి, బుమ్రా, సిరాజ్‌

ఇంగ్లాండ్ జట్టు అంచనా:

- Advertisement -

బర్న్స్‌, సిబ్లే, క్రాలే/హసీబ్‌ హమీద్‌, రూట్‌, బెయిర్‌స్టో, బట్లర్‌, మొయిన్‌ అలీ, శామ్‌ కర్రాన్‌, ఓలీ రాబిన్సన్‌, మార్క్‌ ఉడ్‌, క్రెయిగ్‌ ఓవర్టన్‌/సకీబ్‌ మహమూద్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement