Wednesday, May 15, 2024

బీజేపీ సీఎం అభ్యర్థి మిథున్‌ చక్రవర్తి…?

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో బెంగాల్ ఎన్నికల ముఖచిత్రం మారిపోతోంది. సీఎం మమత బెనర్జీ అభ్యర్థులను ప్రకటించారు. బిజెపి కూడా మమతకు చెక్ పెట్టేందుకు అన్ని రకాల వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది. అందులో భాగంగానే మమతకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని పార్టీలో చేర్చుకుంటుంది బీజేపీ. ఇప్పటికే పలువురు తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఆ పార్టీని వీడి కాషాయ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు మిథున్‌ చక్రవర్తి కూడా బీజేపీలో జాయిన్‌ అయ్యారు. మిథున్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బీజేపీ నేతలు. అంతేకాదు బెంగాల్‌ బీజేపీ సీఎం అభ్యర్థి మిథున్‌ చక్రవర్తినే అంటూ ఉహాగానాలు మొదలయ్యాయి.


మిథున్ చక్రవర్తి గతంలో తృణమూల్ నుంచి రాజ్యసభలో ప్రాతినిథ్యం వహించారు. ఆ తర్వాత శారదా చిట్‌ఫండ్ కేసులో చిక్కుకోవడంతో రాజ్యసభ పదవి నుంచి తప్పుకున్నారు. ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన కారణంగా ఆయనన్ను ఈడీ ప్రశ్నించింది. ఈ ఘటన తర్వాతే ఆయన అనారోగ్య కారణాలను చూపుతూ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆయన తృణమూల్ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. మరోవైపు బీజేపీ మాత్రం మిథున్ చేరికపై పరోక్షంగా సంకేతాలినిచ్చింది. మమత బెనర్జీ పాలనకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రముఖ వ్యక్తుల్లో మిథున్ కూడా ఒకరు. మమత గద్దె దిగాలని బెంగాలీలతో పాటు చాలా మంది ఇతర ప్రాంతాల వారూ కోరుకుంటున్నారు. అని బీజేపీ ఉపాధ్యక్షుడు జయప్రకాశ్ మజుందార్ వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement