Sunday, May 5, 2024

చంద్రబాబును టార్గెట్ చేసిన సుబ్రమణ్యస్వామి

తిరుమల శ్రీవారి ఆలయంపై కొంతకాలంగా దుష్ప్రచారం ఎక్కువైందని బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీపై ప్రభుత్వ అజమాయిషీ లేకుండా చేస్తానని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడులో నటరాజస్వామి ఆలయంపై ప్రభుత్వ ఆధిపత్యం లేకుండా చేశానని, అదే తరహాలో తిరుమల ఆలయ నిర్వహణలో కూడా ప్రభుత్వానికి సంబంధం లేకుండా చేస్తానన్నారు. తిరుమలలో క్రైస్తవ మత ప్రచారం జరుగుతోందని ఆంధ్రజ్యోతి మీడియా సంస్థ ప్రచారం చేసిందని.. ఆ సంస్థపై రూ.100 కోట్ల పరువునష్టం దావా వేశానని తెలిపారు.

అటు సుబ్రమణ్యస్వామి టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేశారు. వెంకటేశ్వరస్వామిపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై హైకోర్టుకు వెళ్తానని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో టీటీడీలో అనేక అక్రమాలు జరిగాయని, గత ఐదేళ్లకు సంబంధించి టీటీడీ అకౌంట్లను కాగ్‌తో ఆడిట్ చేయించాలని డిమాండ్ చేశారు. ఇది చంద్రబాబుకు ఖచ్చితంగా బ్యాడ్ న్యూస్ అవుతుందని అభిప్రాయపడ్డారు. టీటీడీని భక్తులే నడిపించేలా తీర్చిదిద్దాలని సుబ్రమణ్యస్వామి సూచించారు. అటు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement