Saturday, April 27, 2024

కోవిడ్ పాజిటివ్ విద్యార్థులు పరీక్షలు రాయక్కర్లేదు: మంత్రి సురేష్

ఏపీలో కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్థులు పరీక్షలు రాయాల్సిన అవసరం లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు‌. కోవిడ్‌తో బాధపడుతున్న విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. రెగ్యులర్‌ ఎగ్జామ్స్‌ తరహాలో మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామన్న మంత్రి.. రెగ్యులర్‌ విధానంలో పాసైనట్లుగానే ఆ విద్యార్థులకు ధ్రువపత్రాలు జారీ చేస్తామని వెల్లడించారు.

పరీక్షల నిర్వహణ చర్యలను కోర్టుకు వివరిస్తామని మంత్రి సురేష్ తెలిపారు. చాలా రాష్ట్రాలు షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తున్నాయని గుర్తుచేశారు. కేబినెట్ సమావేశం వాయిదా వేయడానికి చాలా కారణాలున్నాయని, పరీక్షలకు, కేబినెట్ భేటీకి ముడి పెట్టడం లోకేష్‌కు సరికాదని మంత్రి హితవు పలికారు. పరీక్షలను ప్రతిపక్షాలు రాజకీయంగా వాడుకుంటున్నాయని, పరీక్షలు రద్దు చేస్తే పిల్లల భవిష్యత్ గురించి మాట్లాడేవారని ఆరోపించారు. చంద్రబాబు రెండు నాల్కల ధోరణితో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

అటు టెన్త్, ఇంటర్ పరీక్షల కేంద్రాలను ప్రతిరోజూ శానిటైజ్ చేయాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి తెలిపారు. విద్యార్థుల భవిష్యత్, భద్రత ప్రభుత్వ బాధ్యత అని తేల్చి చెప్పారు‌. పరీక్షలను రద్దు చేయడం సులభమే కానీ విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుదని అన్నారు. మే 5 నుండి ఇంటర్‌ పరీక్షలు కొనసాగుతాయని మంత్రి సురేష్ మరోసారి స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement