Saturday, April 27, 2024

నేటి సంపాద‌కీయం – చిత్ర విచిత్ర మ‌లుపులు.!

మహిళా అధికారిణులు ఎంత సమర్ధులైనా, ప్రతిభావంతులైనా తమ జీవిత భాగస్వామి ప్రభావం నుంచి తప్పించుకోలేరు అనడానికి ఐసిఐసిఐ బ్యాంకు మాజీ సీఈఓ చందాకొచ్చర్‌ నిదర్శనం. ఆమె ఆ బ్యాంకు అభివృద్ది కోసం ఎంతోకృషి చేశారు. ఆమె హయాంలో ఐసిఐసిఐ బ్యాంకు శాఖలు గ్రామాల్లో సైతం విస్తరించాయి. అయితే, వీడియో కాన్‌ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌తో సాన్నిహిత్యం కారణంగా కొచ్చర్‌ భర్త దీపక్‌ కొచ్చర్‌ వీడియో కంపెనీలో పెట్టుబడులు పెట్టడం వల్ల చందాకొచ్చర్‌ పదవి ఊడింది.ఆమె ప్రతిభావంతమైన మహిళగా, ప్రభావశీలురైన మహిళల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్నారు. ఇదే మాదిరిగా నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజి (ఎన్‌ఎస్‌ఇ) మాజీసీఈఓ చిత్రారామకృష్ణ తమ సంస్థకు సంబంధించిన సమాచారాన్ని హిమాలయాల్లో ఉండే యోగికి అందజేశారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఆ ఆరోపణలను పురస్కరించుకుని శనివారం నాడు ఆమెను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఈరెండు కేసులలో చందా కొచ్చర్‌ భర్త సిఫార్సుల మేరకు వీడియో కాన్‌ సంస్థకు రుణాలు మంజూరు చేశారన్న ఆరోపణలున్నాయి. చిత్రారామకృష్ణ అరెస్టుకు దారి తీసిన కేసులో ఆమె భర్త ప్రమేయం లేకపోయినా, సన్నిహితుడైన ఆనంద్‌ సుబ్రహ్మణ్యం పాత్ర ఉంది. ఈ రెండు కేసుల్లో చందా, చిత్రలు ఇద్దరూ ఉన్నత విద్యావంతులే కాకుండా, స్వశక్తిపై తమ స్థానాలకు అంచలంచెలుగా ఎదిగిన వారే. కార్పొరేట్‌ సంస్థల్లో పని చేసే వారు ఎంతటి నిజాయితీపరులైనా, నిబద్దత కలవారైనా సిఫార్సులకు మెత్తబడాల్సిన పరిస్థితి రావడం, చివరికి చేతులు కాల్చుకోవడం అనేది వీరి విషయంలో రుజువైంది. ఇంకా వెలుగులోకి రాని కేసులు ఎన్నో ఉన్నాయి.

బ్యాంకుల సీఈఓలకు అధికారంలో ఉన్న మంత్రులు, రాజకీయ నాయకుల సిఫార్సులు తరచూ వస్తుంటాయి. ఆ పదవుల్లో ఉన్న వారి పరిస్థితి ప్రాణసంకటంగా తయారవుతుంది. యూపీఏ హయాంలోఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయి. ఈవిషయాన్ని ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ పార్ల మెంటులో బ్యాంకుల నిరర్థక ఆస్తులపై వివరణ ఇస్తూ తెలిపారు. నిరర్థక ఆస్తులు యూపీఏ హయాంలోనే పెరిగాయి. విద్యుత్‌ ప్లాంట్ల కోసం రుణాలు అప్పట్లో భూరిగా లభించేవి. ఆ విధంగా బ్యాంకు రుణాలు తీసుకుని బకాయి పడ్డవారు మన తెలుగురాష్ట్రాల్లోకూడా ఉన్నారు. వీరంతా రాజకీయంగా ఒత్తిడి తెచ్చి కేసుల నుంచి వీలైనంతవరకూ తప్పించుకుంటూ ఉంటారు. చిత్రా రామకృష్ణ కేసులో సుబ్రహ్మణ్యమే అజ్ఞాత యోగి అని వార్తలొచ్చాయి. కానీ, వాటిని అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు. ఆ యోగిని గుర్తు పట్టేందుకు చిత్ర నిరాకరిస్తున్నారు. ఆమె నుంచి యోగి గురించి సమాచారం రాబట్టేందుకు సీబీఐ అధికారుల ఎంత ప్రయత్నించినా ఫలించలేదు. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చంజి (ఎన్‌ఎస్‌ఇ) సమాచారాన్ని చిత్రా రామకృష్ణ వద్ద సేకరించాడంటే ఆ యోగి ఎంత గుండెలుతీసిన బంటో స్పష్టం అవుతోంది.

ఇలాంటి సందర్భాల్లో ఉన్నత పదవుల్లో ఉన్న వారి ప్రమేయం లేనిదే ఏదీ జరగదన్న సామాన్యుల నోటి మాట నిరాధారమైనది కాదు. బ్యాంకుల, కార్పొరేట్‌ కుంభకోణాల చరిత్రలను లోతుగా పరిశీలిస్తే ఇలాంటి పాత్ర ధారులు ఎంతో మంది కనిపిస్తారు. దేశఆర్థిక వ్యవస్థకుచేటు తలపెట్టే వారు ఎంతటి వారైనా అటువంటి వారి పట్ల మొహమాటం, కారుణ్యం లేకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముందు రోజున చిత్రా రామకృష్ణ అరెస్టు కావడం కాకతాళీయం.
బ్యాంకులు, కార్పొ రేట్‌ సంస్థలలో రాజకీయ నాయకులు, ఉన్నత స్థాయిలో ఉన్న ప్రముఖుల ప్రమేయం వల్లనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో చంద్ర స్వామి అనే యోగి ఉన్నత రాజకీయ నాయకులతో పరిచయాలు పెంచుకుని అవినీతి సామ్రా జ్యాల ఏర్పాటులో తనవంతు సాయాన్ని అందించారు. ఇలాంటి యోగుల వల్ల నిజమైన యోగులకూ, ఆధ్యాత్మిక రంగంలో మహనీయులపై మచ్చ పడుతోంది. స్టాక్‌ ఎక్స్ఛేంజిలో హిమాలయ యోగి ప్రమేయం గురించి లోతుగా పరిశోధన జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కోణంలోదర్యాప్తు సాగిస్తే ఇంకా తెరవెనుక ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. మహిళా అధికారిణులు ఎంత సమర్దులైనా, నిజాయితీ పరులైనా ఇలాంటి ప్రభావాల నుంచి తప్పించుకోలేక పోతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement