Saturday, May 18, 2024

నేటి సంపాద‌కీయం – లంకలో ఆకలి కేకలు!

చైనాపై ఆధారపడే దేశం నష్టాల ఊబిలో కూరుకు పోవల్సిందేననడానికి శ్రీలంక ప్రస్తుత పరిస్థితి ఉదాహరణ. లంక రాజధాని కొలంబో సమీపంలోని హంబన్‌ టోటాలో రేవు నిర్మాణం కోసం రుణం ఇచ్చిన చైనా కంపెనీలు ఆ రేవు నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయంలో శాశ్వతంగా వాటాకోరాయి. శ్రీలంక అసలేచిన్న దేశం. ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి అలజడులు జరిగినా వాటి ప్రభావం శ్రీలంక ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. తాజాగా ఉక్రెయిన్‌ యుద్దం వల్ల శ్రీలంకకు వచ్చే పర్యాటకుల సంఖ్య బాగా తగ్గిపోయింది. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు లంక ప్రభుత్వం గత ఏడాది ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగంపై నిషేధాన్ని ప్రకటించింది. రైతులు సన్నద్ధం కాకపోవడంతో ఆహార ధాన్యాల ఉత్పత్తిబాగా తగ్గింది. శ్రీలంక ఆదాయంలో పది శాతం పర్యాటక రంగంద్వారానే లభిస్తోంది. దేశంలో పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఆహార ధాన్యాలు, చక్కెర, తదితర నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటాయి. ప్రభుత్వం నిర్వహించే సహాయక శిబిరాల్లో బియ్యం, ఇతర నిత్యావసరాల కోసం జనం మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. శ్రీలంక తమిళులు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. చిరకాలంగా తమ మధ్య సంబంధాలను ఉపయోగించుకుని వారంతా తమిళనాడులోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో తమిళనాడుపై భారం పెరుగుతోంది.

ముఖ్య మంత్రి ఎంకె స్టాలిన్‌ ఈ విషయాన్ని ఇటీవల కేంద్రం దృష్టికి తెచ్చారు. రాష్ట్రానికి అదనంగా ఆహార ధాన్యాలు, నిత్యావసరాలు కేటాయించాలని కోరారు. శ్రీలంకలో పెట్రోల్‌ ధర విపరీతంగా పెరిగిపోయింది. డాలర్‌తో లంక రూపాయి విలువ బాగా తగ్గింది. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.242 దాటింది. అంత ధర పెట్టినా పెట్రోల్‌ దొరకడం లేదు. గంటల తరబడి క్యూలలో నిలబడాల్సి వస్తోంది. పాలు సైతం లభ్యం కావడం లేదు. పాల పొడి కోసం ఘర్షణలు జరుగుతున్నాయి. తమ దేశానికి సాయం అందించాలని శ్రీలంక ఆర్థిక మంత్రి బసిల్‌ రాజపక్స ఢిల్లి వచ్చి మొరపెట్టుకోవడంతో మన దేశం వంద కోట్ల డాలర్ల సాయాన్ని ప్రకటించింది. గతంలో కూడా ఇదే మాదిరిగా ఆపద సమయంలో శ్రీలంకను మన దేశం పెక్కుసార్లు ఆదుకుంది. ఇప్పటికీ శ్రీలంక లోపలు ప్రాంతాల్లో భారత్‌ పెట్టుబడులు పెడుతోంది. ట్రింకోమలీలో చమురు స్టోరేజి కేంద్రాల ఆధునీకరణకు కూడా మన దేశం సాయం అందించేందుకు ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరింది. భారత్‌ నుంచి ఇన్నివిధాల సాయం పొందుతున్నా, తమిళ జాలర్లు పొరపాటున తమ దేశ సముద్ర జలాల్లో ప్రవేశిస్తే వారిని శ్రీలంక నౌకా దళం అరెస్టు చేసి వారి పడవలను స్వాధీనం చేసుకుంటోంది. వారిని విడిపించడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలను సాగించాల్సి వస్తోంది. శ్రీలంక మన దేశం నుంచి సాయాన్ని అందుకుంటున్నా, రుణాల ఊబిలో పడటం లేదు. అదే చైనా నుంచి సాయాన్ని చిన్న మొత్తంలో తీసుకున్నా, వడ్డీతో సహావసూలు చేస్తున్నాయి. తమకు రావల్సిన సొమ్మును రాబట్టడం కోసం చైనా కంపెనీలు ఈలంక రేవులు, చెక్‌పోస్టుల ద్వారా ఆదాయంలో వాటాను కోరుతున్నాయి.

ఒకసారి చైనా ఉచ్చులో పడితే ఏ దేశమైనా తిరిగి బయటికి రాలేదని ఆర్థిక రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. నేపాల్‌ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. చైనా ఆర్థికవిధానాల వల్ల తమ ఆర్థిక వ్యవస్థ నానాటికీ అధోగతి పాలవుతోందన్న విషయాన్ని లంక ప్రజలు గ్రహించారు. అదే సందర్భంలో భారత్‌ తమ దేశానికి అందిస్తున్న సాయాన్ని అత్యంత విలువైనదిగా పరిగణిస్తున్నారు. జాఫ్నా ప్రాంతంలో తమిళులు భారత్‌లోని తమిళనాడు నుంచి అనధికారి కంగా నిత్యావసరాల కోసంప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే, తీర రక్షణ దళం నిఘా పెరగడం వల్ల ఆ ప్రయత్నాలు ఎక్కువగా ఫలించడం లేదు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవస్తువులకు చెల్లింపులు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో విదేశీ సంస్థలు సరఫరాలను బంద్‌ చేశాయి. ఉక్రెయిన్‌ నుంచి గోధుమలు, తదితర ఆహార ధాన్యాలు గతంలో దిగుమతి అయ్యేవి. అక్కడ యుద్ధం కారణంగా అవి కూడా బంద్‌ అయ్యాయి. తరతరాలుగా సాంస్కృతీ సంబంధా కారణంగా భారత్‌ మాత్రమే తమకు నిస్వార్ధమైన సాయాన్ని అందిస్తోందని శ్రీలంకప్రజలు బహిరంగంగానే చెబుతున్నారు. యూరోపియన్‌ యూనియన్‌, రష్యా తదితర దేశాల నుంచి సాయం ఆగిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో తమను ఆదుకునే వారు లేక లంక ప్రజలు హాహాకారాలు చేస్తున్నారు. ఒక వైపు కరోనా, మరో వైపు యుద్ధం, ఇంకోవైపు చైనా దోపిడీతో శ్రీలంక గిలగిలలాడుతోంది. సాంస్కృతిక, చారిత్రక సంబంధాలున్నా భారత్‌ మాత్రం లంకకు ఎంతవరకూ సాయాన్ని అందించగలదు? ఇప్పటికే శక్తిమేరకు సాయాన్ని అందించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement