Friday, April 26, 2024

నేటి సంపాదకీయం–విపక్షాల అనైక్యతే కమలానికి బలం

ప్రతిపక్షాల అనైక్యతే బీజేపీకి బలం.ఇది అందరికీ తెలుసున్నదే అయినా తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురా లు, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నోటంట వచ్చింది. ఆమె రెండేళ్ళ తర్వాత జరగబోయే పార్లమెం టు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ విషయం చెప్పినా, గురువారం వెలువడనున్న ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాలకుకూడా ఇది వర్తిస్తుంది. ప్రతిపక్షాల ఓట్లు చీలిపోతే అది అధికార పార్టీకే లాభమన్నది సాధారణ విషయం. ఇందుకు ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు అవసరం లేదు. అతి పెద్దరాష్ట్రమైనఉత్తరప్రదేశ్‌ అసెంబ్లి ఎన్నికల సంగతే తీసుకుంటే 403 స్థానాలున్నఆ రాష్ట్ర అసెంబ్లిలో అన్ని స్థానాలకూ అభ్యర్దులను నిలబెట్టడం ఏపార్టీకైనా కష్టమే. అయితే, అధికార పార్టీకి ఉన్న వెసులుబాట్లు, ఆర్థిక వనరులు ఇతర పార్టీలకు ఉండవు. అలాంటప్పుడు సీట్ల సర్దుబాటు కుదుర్చుకోవడంఅనివార్యం. ఈసారి ఉత్తరప్రదేశ్‌లో బహుముఖ పోటీలు ఉన్నట్టు బరిలో ఉన్న అభ్యర్దులను బట్టి అనిపిస్తున్నా, బీజేపీ, సమాజ్‌ వాదీపార్టీల మధ్యే ముఖాముఖీ పోటీ జరిగింది. ఒకనాడు కేంద్రంలో ప్రధానమంత్రులనూ, కేబినెట్‌ మంత్రులను అందించిన కాంగ్రెస్‌ పార్టీ ఈసారి రాష్ట్రంలో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధి పేరును ప్రకటించడంలో విఫలమైంది.

అందుకు కారణం మెజారిటీ స్థానాలనుగెల్చుకోగలమన్న ధీమా లేకపోవ డమే. అభ్యర్ధులను ప్రకటించే దశలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకవాద్రే పేరు బయటికి వచ్చినప్పటికీ ఆమె వెనువెంటనే ఆ వార్తను ఖండించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంతో అనుభవం ఉన్న బీఎస్‌పీ అధ్యక్షురాలు మాయావతి అస్త్రసన్యాసం చేసినట్టు మొదటి నుంచిప్రకటనలు విడుదల చేశారు.ఆమెపై సీబీఐ కేసులు ఉన్నాయి. అలాగే, మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్‌ యాదవ్‌ వయసు రీత్యా ప్రచారం చేయలేని పరిస్థితిలో ఉండటాన్ని కారణంగా చూపినప్పటికీ ఆయన తన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ తరఫున ప్రకటనలుచేయకపోవడానికి కారణం కూడా సీబీఐ కేసుల భయమేనన్న వార్తలు వచ్చాయి.ఆయన మిత్రుడు, బీహార్‌ మాజీ సీఎం ఆర్‌జేడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ దాణా కేసులోసీబీఐ ప్రత్యేక కోర్టు విధించినశిక్షలతో ఎన్నికల రాజకీయాలకు దూరం గా ఉంటున్నారు.

దీంతో అఖిలేష్‌ యాదవ్‌ ఒక్కరే బీజేపీని ఎదుర్కోవల్సి వచ్చింది. కాంగ్రెస్‌ తరఫున ప్రియాంక, రాహుల్‌ నిర్విరామంగా ప్రచారం చేసినప్ప టికీ, ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ఎవరూ సరైన సహకారం అందించలేదన్న వార్తలు వచ్చాయి.అందువల్ల పోలింగ్‌ కి ముందే ఆ పార్టీ ఓటమిని అంగీకరించినట్టు అయింది. నిజానికి ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్‌ ఓటమి తప్పదని ఎన్నికల షెడ్యూలు ప్రకటనకు ముందు కథనాలు వెలువడ్డాయి.యోగీ బలహీనతలను గ్రహించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉత్తరప్రదేశ్‌ స్వరాష్ట్రం కాకపోయినా, తన నియోజకవర్గమైన వారణాసి లోక్‌సభ పరిధిలోని అసెంబ్లి నియోజక వర్గాలకే పరిమితం కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతా ల్లో సుడిగాలి పర్యటనలు జరిపారు.ఎన్నో ప్రారంభోత్స వాలు, శంకుస్థాపనలు చేశారు. అందువల్ల యోగీ బలహీనతలన్నీ తెరమరుగు అయినట్టే భావిస్తున్నారు. ఈసారి ఆయనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నట్టు ఎగ్టిట్‌ పోల్స్‌ ఫలితాలు తెలుపుతున్నాయి.

పంజాబ్‌లో కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి రావల్సి ఉండగా, మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ను ఎన్నికల ముందు తప్పించినందుకు ఆపార్టీ మూల్యాన్ని చెల్లించు కోనున్నదని చెబుతున్నారు. పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) రంగంలోలేకపోతే కాంగ్రెస్‌కే అవకాశాలు ఉండేవేమో. కానీ, ఆప్‌ సారథి, ఢిల్లి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రతిష్ఠగా తీసుకుని చేసిన ప్రచారం వల్ల ఆ పార్టీకి ప్రయోజనం ఉండవచ్చునంటున్నారు. అయితే, పంజాబ్‌ సీఎంగా దళితుడైన చరణ్‌జిత్‌ చన్నీని చేయడం వల్ల బలహీన వర్గాలంతా తమ పార్టీని గెలిపిస్తా రని కాంగ్రెస్‌ ఆశిస్తోంది.మిగిలిన రాష్ట్రాల్లో ఫలితాలపై స్థానిక సమస్యలప్రభావ ం ఉంటుంది.ఉత్తరప్రదేశ్‌ ఫలితాలు దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే అవకాశం ఉంది.అందుకే ఆ రాష్ట్రంపై బీజేపీ తరఫున ప్రధాని మోడీ, ప్రతిపక్షాల తరఫున మమత తదితర నాయకులు హోరాహోరీగా ప్రచారం చేశారు. ఈ ఎన్నికల ఫలితాల ను బట్టి కేంద్రంలో మార్పులు జరగవచ్చని ఊహాగానా లు ఇప్పటికే వెలువడ్డాయి. అందుకే ఈ ఎన్నికల ప్రచారా న్ని ప్రధాని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement