Friday, April 26, 2024

నేటి సంపాద‌కీయం.. ప్రాంతీయ పార్టీల కూట‌మి?

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన ఫలితాలు రాకపోవచ్చుననీ, ప్రాంతీయ పార్టీలదే హవా అని ప్రతిపక్షాలు అంచనా వేస్తున్నాయి. కాంగ్రెస్‌ని అవి లెక్కలోకి తీసుకోవడం లేదు. ప్రాంతీయ పార్టీలన్నింటినీ కలిపి కూటమిగా ఏర్పాటు చేసే యత్నాలను తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రారంభించారు. ఆమె తాజా రాజకీయ పరిస్థితిపై తెలంగాణ సీఎం కేసీఆర్‌, తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్‌లతో ఫోన్‌లో సంభాషణలు జరిపారు. బీజేపీ వ్యతిరేక కూటమిలో చేరేందుకు కేసీఆర్‌ ఆసక్తి చూపుతున్నట్టు ఇటీవల ఆయన చేస్తున్న ప్రసంగాలు ఊతమిస్తున్నాయి. ఆదివారంనాడు ఆయన నిర్వహించిన విలేఖరుల సమావేశంలో అందరూ కలిసి వస్తే జాతీయ పార్టీనే పెడతానని అన్నారు. ఇలాంటి ప్రకటన ఆయన నోటంట వెలువడటం ఇదే ప్రథమం. జాతీయ స్థాయిలో క్రియాశీలంగా వ్యవహ రిస్తానని ఆయన గతంలో ప్రకటించినప్పటికీ, జాతీయ పార్టీ ఏర్పాటు గురించి కేసీఆర్‌ మాట్లాడటం ఇదే మొదటి సారి. ఆయన ఈ మాట అన్న మరునాడే, మమతా బెనర్జీ కేసీఆర్‌కీ, స్టాలిన్‌కీ ఫోన్‌ చేసి ప్రాంతీయ పార్టీల కూటమి గురించి మాట్లాడారు. త్వరలోనే బీజేపీ, కాంగ్రేసేతర పార్టీల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నట్టు ఇద్దరి మాటల్లోనూ ప్రతిధ్వనించింది. కాంగ్రెస్‌ పట్ల ప్రాంతీయ పార్టీలు ఆసక్తిగా లేవనీ, తమదారితాము వెళ్తామని మమతా బెనర్జీ అన్నారు.

అంటే, ప్రాంతీయ పార్టీల కూటమిని ఏర్పాటు చేయ డమే తమ లక్ష్యమని ఆమె చెప్పకనే చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలు బలంగాఉన్న దృష్ట్యా వాటన్నింటితో కలిపి ఒక కూటమిని ఏర్పాటుకు గల అవకాశాలను ఈ నాయకులు పరిశీలిస్తున్నారు. అయితే, ఇది కొత్త ప్రయోగం కాదు. కేంద్రంలో తొలి సంకీర్ణ ప్రభుత్వ నిర్మాతగా వాజ్‌పేయి చేసింది అదే. ఆయన నేతృత్వంలోని నేషనల్‌ డెమోక్రాటిక్‌ అలయెన్స్‌ (ఎన్‌డిఏ) భాగస్వామ్య పార్టీలో అత్యధికం ప్రాంతీయ పార్టీలే. బీజేపీ నేతృత్వంలో పని చేసేందుకు అప్పట్లో అవి ముందుకు వచ్చాయి. ఇప్పుడు అదే బీజేపీని గద్దెదింపేందుకు ఈ ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపై నిలిచేందుకు సిద్ధమవుతున్నాయి. వాజ్‌పేయి తర్వాత పదేళ్ళ పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ కూటమి భాగస్వామ్య పక్షాల్లో కూడా ప్రాంతీయ పార్టీలదే హవా. కాకపోతే ఇప్పుడు జాతీయ పార్టీ ఛత్రం లేకుండా ప్రాంతీయ పార్టీలు కూటమిగా ఏర్పడాలనుకుంటున్నాయి. కూటమికి ఏ పార్టీ నేతృత్వం వహిస్తుంది? నాయకుడు ఎవరు? మొదలైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ప్రాంతీయ పార్టీలలో జాతీయ స్థాయిలో పేరొందిన వారూ, జాతీయ స్థాయి కూటమికి నేతృత్వం వహించగల సామర్ధ్యం గల వారూ లేకపోలేదు. దాదాపు అందరూ ప్రధానమంత్రి పదవి మీద ఆకాంక్ష గలవారే ఉన్నారు. ఒకరి నేతృత్వంలో మరొకరు పని చేయడానికి సిద్ధపడేదెవ్వరన్నదే ప్రశ్న. దీనికి సమాధానం దొరకడం కష్టం. అందుకే, ఇటువంటి ఆలోచన గతంలో కూడా వచ్చినా, ఈ ప్రయత్నాలు ముందుకు సాగలేదు. నిజానికి 2014 ఎన్నికలకు ముందే మమత ఈ ప్రయత్నాలు చేశారు. బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ని కూటమి నాయకునిగా పెట్టి ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటుకు ఆమె అప్పట్లో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మోడీకి పోటీగా నితీశ్‌ కుమార్‌ని బరిలోకి దించేందుకు ఆమె పలువురు ముఖ్యమంత్రులతోనూ, వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల నాయకులతోనూ ఆమె ఫోన్‌ సంప్రదింపులు జరిపారు. అప్పట్లో తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె నాయకురాలు జయలలిత కూడా మమత ప్రయత్నాలకు మద్దతు ఇచ్చారు. ఒడిషా ముఖ్యమంత్రి, బిజీ జనతాదళ్‌ (బీజేడీ) అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌ని ప్రత్యామ్నాయ నాయకునిగా చేయాలన్న ఆలోచనలూ, అందుకోసం ప్రయత్నాలూ జరిగాయి. ప్రస్తుత ప్రధాని మోడీకి వ్యతిరేకంగా అప్పట్లో ప్రయత్నాలు చేసిన వారే, ఇప్పుడు ఆయనను దింపేందుకు మళ్ళీ కలుస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి యత్నాలు తప్పేమీ కాదు కానీ, అవి ఎంతవరకూ ఫలిస్తాయన్నది ప్రశ్నార్ధకం.

అయితే, రాష్ట్రాల హక్కుల కోసం, ఫెడరల్‌ వ్యవస్థ పరిరక్షణ కోసం తామంతా కలుసుకోనున్నట్టు వీరు చెబుతున్నారు. అయితే, సహకార ఫెడరల్‌ విధానానికి కేంద్రం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తాజాగా సోమవారం ప్రకటించారు. రాష్ట్రాల్లో పని చేస్తున్న ఐఏఎస్‌ అధికారులను కేంద్ర సర్వీసుల్లోకి తమను సంప్రదించకుండా కేంద్రం తీసుకుంటోందని పలువురు బీజేపీయేతర సీఎంలు గుర్రుగా ఉన్నారు. అలాగే, బీహార్‌, మహారాష్ట్ర, తదితర రాష్ట్రాల గవర్నర్ల వ్యవహరణ తీరు పట్ల కూడా వారు తీవ్ర అసహనంతో ఉన్నారు. బహుశా ఈ అంశాల కోసమే బీజేపీయేతర ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు మమత ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement