Monday, May 6, 2024

నేటి సంపాద‌కీయం – ఇమ్రాన్‌ ప్రశంసా.? కవ్వింపా.?

సైనికాధికారుల జోక్యం వల్లనే పాకిస్తాన్‌లో అభివృద్ధికి ఆటంకం కలుగుతోందన్నది జగమెరిగిన సత్యం. అయితే, ఆ మాటను సాక్షాత్తూ ఆ దేశ ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అంగీకరించడం విశేషం. ఆర్మీ జనరల్స్‌ సాయంతో అధికారంలోకి వచ్చి వారి అదుపాజ్ఞలతో పాలన సాగించడం పాక్‌ పాలకులకు అలవాటు. ఒక వేళ ఆర్మీ జనరల్స్‌ మాట వినకపోతే అక్కడి ప్రధానమంత్రి పీఠానికి ఎసరు వస్తుంది. ఇమ్రాన్‌ ఖాన్‌ కూడా ఆర్మీ జనరల్‌ సాయంతోనే అధికారంలోకి వచ్చారు. కానీ, ఆయన ఆతర్వాత స్వతంత్రంగా వ్యవహరించడం మొదలు పెట్టారు. పాకిస్తాన్‌ చరిత్ర అంతా సైనికాధికారు ల పెత్తనంతోనే నిండి ఉంది. పాకిస్తాన్‌లోనే కాదు, దాని నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడిన బంగ్లాదేశ్‌లో కూడా ప్రజల ద్వారా ఎన్నికైన పాలకులను కుట్ర చేసి గద్దెదించేందుకు యత్నించడం, ఎదురుతిరిగితే హత్య చేయడం మన స్మృతి పథంలోనే ఉంది. బంగ్లా నిర్మాతగా, బంగబంధుగా అశేష జనం ప్రశంసలూ నీరాజనాలు అందుకున్న తొలి ప్రధాని షేక్‌ ముజిబుర్‌ రెహమాన్‌ను సైనికాధికారులే కుట్ర చేసి హత్య చేశారు. అలాగే, పాకిస్తాన్‌లో ఆయూబ్‌ ఖాన్‌, యాహ్యాఖాన్‌, జియావుల్‌ హక్‌, ముషార్రఫ్‌ తదితరులంతా ప్రజాస్వామ్యంగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలను కూలదోసి అధికా రాన్ని చేపట్టినవారే. మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ని గద్దెదించడానికి ఇమ్రాన్‌ ఖాన్‌ సైనికాధికారులతో దోస్తీ చేసినట్టు అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. పాక్‌లో ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాధినేతల కన్నా, సైనికాధికారుకే ఎక్కువ అధికారాలు ఉంటాయన్నది కూడా జగద్విదితం.

అంతేకాదు, సైనికాధికారులు, మతనాయకుల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయ న్నది కూడా వాస్తవమే. మత నాయకులు తెరవెనుక ఉండి ప్రభుత్వాన్ని నడిపిస్తుంటారు. ఇమ్రాన్‌ ఖాన్‌ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆర్మీతో సత్సంబంధాలు ఉండేవి. అయితే, సైనికాధికారులు పదేపదే ముడుపులు గుంజుతున్నట్టు వార్తలొచ్చాయి. అవి నిరాధారం కాదని ఇమ్రాన్‌ స్వయంగా అన్న మాటల్లో రుజువైంది. సైనికా ధికారులకు ముడుపులు ఇచ్చి పదవిని కాపాడుకోలేనని ఇమ్రాన్‌ బహిరంగంగానే అన్నారు. అదే సందర్భంలో ఆయన భారత సైన్యాన్ని ప్రశంసించారు. భారత సైన్యం పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోదనీ, ప్రకృతి వైపరీత్యాల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు ప్రాణాలకు తెగించి పని చేస్తుందని కూడా ప్రశంసించారు. ఇది ప్రశంస కాదు, వాస్తవమే. ఇదే విషయాన్ని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ సింఘ్రాలా అన్నారు. భారత్‌ అనుసరిస్తున్న విదేశాంగవిధానం కాలపరీక్షలకు నిలిచిందనీ, దశాబ్దాలుగా భారత్‌కి పట్టుగొమ్మగా ఉందని ఆయన ప్రశంసించారు. పాకిస్తాన్‌ సైనికాధికారుల జోక్యం వల్ల మాజీ ప్రధానులు జుల్ఫికర్‌ ఆలీ భుట్టో, ఆయన కుమార్తె బెనెజీర్‌ భుట్టో, నవాజ్‌ షరీఫ్‌ సహా అంతా ఇబ్బందులకు గురి అయిన వారే.పదవులను కోల్పోయిన వారే, అయితే, ఇమ్రాన్‌ మాదిరిగా ఇంత బహిరంగంగా సైనికాధికారులకు ముడుపులిచ్చి పదవి ని కాపాడుకోలేనని అన్నది ఇమ్రాన్‌ ఒక్కరే. అయితే, సైనికాధికారుల సాయం కోరినా ఫలితం లేకపోవడంతో ఆయన ఆ వ్యాఖ్య చేశారన్నది అంతకుముందు అక్కడ చోటు చేసుకున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

పాక్‌ పార్లమెంటులో ప్రతిపక్షాలు ఇమ్రాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. వచ్చే శుక్రవారం దానిపై ఓటింగ్‌ జరగనుంది. ఈలోగా ఇమ్రాన్‌ సొంత పార్టీలో అసమ్మతినేతలు ఆయనపై ఎంతోకాలంగా గూడుకట్టు కున్న అసంతృప్తిని వెళ్ళగక్కారు. ఇమ్రాన్‌ ఓటమి ఖాయమని తేలడంతో సైనికాధికారుల సాయంతో పదవి లో కొనసాగడానికి ఆయన విశ్వయత్నాలు చేశారు. ప్రధాన సైనికాధికారి బజ్వాతోనూ, ఐఎస్‌ఐ డైరక్టర్‌ జనరల్‌ నదీమ్‌ అంజుమ్‌తో ఇమ్రాన్‌ సుదీర్ఘ చర్చలు జరిపారు. ప్రభుత్వ విధానాల పట్ల ప్రజలు తీవ్ర అసం తృప్తితో ఉన్నారనీ, మార్పు కోరుతున్నారని వారిద్దరూ స్పష్టం చేసినట్టు సమాచారం. అంతేకాకుండా ప్రజా ఉద్యమకారులను అణచివేయడంపట్ల ఆగ్రహావేశాలు మిన్నంటుతన్నాయని కూడావారు తెలియజేశారు. ఈ సమావేశం తర్వాతే. పాక్‌ ఆర్మీపై ఇమ్రాన్‌ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన పనిలోపనిగా భారత్‌ ఆర్మీని ప్రశంసించడంలో ఉద్దేశ్యమేమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. భారత్‌పై పాక్‌ సైనికాధికారులను ఉసికొల్పడ మే ఆయన ఉద్దేశ్యమై ఉండవచ్చునని విశ్లేషకులు భావి స్తున్నారు. ఇమ్రాన్‌ భారత్‌ సైన్యాన్ని పొగడటమే కాకుండా విదేశాంగ విధానాన్ని మెచ్చుకున్నారు. ఉక్రెయిన్‌ యుద్ధంపై భారత్‌ తటస్థ వైఖరిని అనుసరిస్తున్నా అమెరికా, రష్యాలు రెండూ గౌరవిస్తున్నాయనీ, పాక్‌ మీద మాత్రం ఒత్తిళ్ళు తెస్తున్నాయంటూ ఆయన వాపోయారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement