Tuesday, April 30, 2024

Editorial – మాల్దీవులు … త‌ట‌స్థ వైఖ‌రి…

మాల్ది వుల కొత్త అధ్యక్షునిగా ఎన్నికైన మహమ్మద్‌ మయిజ్జు తమ దేశం చైనా, భారత్‌లతో సమాన దూ రాన్ని పాటించాలని అనుకుంటున్నదని స్పష్టం చేశారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత తమ దేశంలో భారత సైనికులను వెనక్కి పంపివేస్తానని కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. దీంతో ఆయన చైనాకి దగ్గర కావడం కోసమే ఈ ప్రకటన చేసి ఉంటారన్న విశ్లేషణలు వచ్చాయి. ఆసియాలో అతి పెద్ద దేశాలైన చైనా, భారత్‌ల మధ్య వివాదాలను దృష్టిలో పెట్టుకుని ఆయన తమది చిన్న దేశమనీ, పొరుగువారితో శత్రుత్వాన్ని పెట్టుకోలేమని ఇప్పుడు స్పష్టం చేశారు. దౌత్యరంగంలో తలపండిన వ్యక్తిగా ఆయన ఈ మాట అన్నారేమోననిపిస్తోంది. ప్రపంచంలో ఏప్రాంతంలో చూసినా పెద్ద దేశాల మధ్య ఘర్షణలో చిన్నదేశాలు నలిగి పోతున్నాయి. ఆయుధాలు, చమురు సరఫరాల పేరిట చిన్న దేశాలను లొంగ దీసుకోవాలని పెద్దదేశాలు ప్రయ త్నిస్తున్నాయి. భారత్‌ అలాంటిది కాదని తెలుసున్నా, తమ దేశం తటస్థ వైఖరిని అనుసరిస్తుందని చాటడానికి భారత సైనికులను పంపివేస్తామన్న ప్రకటన చేశారు. ఆ ప్రకటనతో మాల్దిdవులు చైనా పంచన చేరబోతోందన్న కథనాలు వెలువడ్డాయి. పైగా, ఆసియాలో చిన్న దేశాలను ఏదో ప్రయోజనాలను ఆశపెట్టి తన వైపు తిప్పుకోవడానికి చైనా ప్రయత్నిస్తోంది. ఇందుకు ఉదాహరణలుగా శ్రీలంక, నేపాల్‌, భూటాన్‌లకు గాలం వేయడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలను గురించి చెప్పవచ్చు. తమ దేశం నుంచి భారత్‌ దళాలను పంపి వేసి చైనీస్‌ దళాలను ఆయన అనుమతిస్తారన్న కథనాలు కూడా వచ్చాయి.

ఈ నేపధ్యంలో భారత్‌తో శత్రుత్వం ఏర్పడుతుందేమోన్న బెదురు ఆయనలో కలిగి ఉండవచ్చు. అది సహజం కూడా. భారత్‌ నుంచి మాల్దిdవులు అనేక ప్రయోజనాలను పొందుతోంది. మధ్య ఆసియా నుంచి తూర్పు ఆసియాకు వెళ్ళే కీలక మైన సముద్ర మార్గం మాల్దిdవులకు సమీపంలోనే ఉంది. భారత్‌ సహకారంతో ఏర్పాటు చేసిన రాడార్‌ స్టేషన్లు, నిఘా విమాన వ్యవస్థలు మాల్దిdవులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, మాల్దిdవులకు చైనా నుంచి కన్నా భారత్‌ నుంచే ఎక్కువ సాయం అందుతోంది. ఇందులో సాంకేతికమైన సా యం చాలా విలువైనది. ఆ విషయం మహ్మద్‌ మయిజ్జు కి తెలుసు. అందుకే, భారత్‌ తమను దూరంగా పెడుతుందేమోనన్న వెరపుతో ఈ తాజా ప్రకటన చేసి ఉంటారు.అంతేకాక, చైనా మిత్ర దేశంగా ముద్ర వేయించుకోవడానికి ఇష్టపడదు. ప్రస్తుతపరిస్థితుల్లో చైనాకు దూరంగా ఉండటమే మంచిదన్న అభిప్రాయం ఆసియా దేశాల్లో స్థిరపడుతోంది. మాల్దిdవుల్లో భారత సిబ్బంది ప్రస్తుతం 75 మంది వరకూ విధులను నిర్వహిస్తున్నారు. మాల్దిdవులకు మాత్రమే కాకుండా, చిన్న దేశాలన్నింటికీ భారత్‌ మౌలిక సదుపాయాల కల్పనలో తోడ్పడుతోంది. ఆధునిక కాలంలో మౌలిక సదుపాయాల ప్రాధాన్యం బాగా పెరిగింది. ముఖ్యంగా, రేవులు, రహదారుల నిర్మాణాలలో భారత్‌ సహాయ, సహకారాలను చిన్నదేశాలు ఆశిస్తున్నాయి. చిన్నదేశాల అవసరాలు, ఆకాంక్షలను కనిపెట్టి వాటికి గోరంత సాయం అందించి కొండంత ప్రతిఫలాన్ని పొందాలని చైనా చూస్తోంది.

ఈ విషయం తెలియకనే శ్రీలంక చైనా ఉచ్చులో పడింది. దాని నుంచి బయట పడటానికి ఇప్పుడు నానా తంటాలు పడుతోంది. శ్రీలంక మాజీ అధ్యక్షుడు రాజ పక్స నిర్వాకం వల్ల చైనా వలలో పడింది. దాని నుంచి బయటపడేందుకు ప్రస్తుత అధ్యక్షుడు రణిల్‌ విక్రమ సింఫే ు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అలాగే, నేపాల్‌లో పూర్వపు ప్రధాని కేపీ శర్మ ఓలి ప్రదర్శించిన అత్యుత్సాహంవల్ల చైనాకి బాగా దగ్గరయ్యింది. ప్రస్తుత ప్రధాని పుష్పకమల్‌ అలియాస్‌ ప్రచండ తమ దేశం తటస్థ దేశమనిపించుకోవడానికి నానా తంటాలు పడు తున్నారు. ఇటీవల భూటాన్‌ని కూడా వలలో వేసుకోవ డానికి చైనా ప్రయత్నాలను ప్రారంభించింది. భారత్‌తో సన్నిహితంగా ఉన్న ఈ దేశాలన్నింటినీ తన వలలో వేసుకోవడానికి చైనా తీవ్ర యత్నాలు సాగిస్తోంది.

ఈ నేపథ్యంలో మాల్దివుల కొత్త అధ్యక్షుడు మహ్మద్‌ మయిజ్జుని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ విషయాన్ని గ్రహించడం వల్లనే ఆయన తమ దేశానికి భారత్‌, చైనాలు సమానమేనన్న ప్రకటన చేయాల్సి వచ్చింది. ఆగ్నేయాసియా దేశాలతోనూ, జపాన్‌తోనూ ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా భారత్‌ పలుకుబడి పెరిగింది. చనాకి వ్యతిరేకంగా ఏర్పడిన క్వాడ్‌ కూటమి వల్ల కూడా భారత్‌పై ఆధారపడే దేశాల సంఖ్య పెరిగింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే మహ్మద్‌ మయిజ్జు భారత్‌కి ఆగ్రహం కలిగించరాదని తాజా ఇంటర్వ్యూలో ఈ ప్రకటన చేసి ఉంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement