Sunday, May 5, 2024

ఆదివాసులకు అగ్ర తాంబూలం!

ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఆదివాసీల సమస్యలకు ఏడున్నర దశాబ్దాలుగా పరిష్కారం కనుగొనకపోవ డాన్ని తప్పుపట్టారు. దేశంలో ఆదివాసీల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుగు రాష్ట్రాల్లో పర్యటన సందర్భంగా మోడీ విపులంగా వివరించారు. ఆదివాసులను గిరిజనులని,అడవి పుత్రులని కూడా సంబోధిస్తారు. హరిజన, గిరిజనులకు నియామకాలు, విద్యారంగంలో సీట్లలో రిజర్వేషన్లను రాజ్యాంగంలో పొందుపర్చినప్పటికీ, అవి సక్రమంగా అమలు జరగడంలేదన్న ఫిర్యాదులు తరచూ వస్తున్నాయి. ముఖ్యంగా, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ గురించి ఎప్పటికప్పుడు డిమాండ్లు వస్తున్నాయి. సరైన అర్హత గలవారు లేరనో, వేరే ప్రాంతాలకు చెందిన వారనో కారణాలు చెప్పి ఎస్టీల పోస్టులను ఇతర వర్గాలకు కేటాయిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. గిరిజనుల సమస్యలపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తగిన శ్రద్ధ తీసుకో కపోవడం వల్లనే ఇతర ప్రాంతాల వారు వచ్చి అడవుల్లో సంపదను దోచుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. స్వాతంత్య్రానికి ముందు ఆంధ్రప్రాంతంలో అల్లూరి సీతారామరాజు, తెలంగాణలో కొమరం భీమ్‌, వంటి యోధులు స్వాతంత్య్రోద్యమంలో భాగంగానే ఆదివాసీల హక్కుల కోసం పోరాటం సాగించారు. ఆ విషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించడం తెలుగువారు గర్వించదగిన విషయం. ఐదు దశాబ్దాల క్రితం ఈ అంశాన్ని కారణంగా చూపి వామపక్ష తీవ్రవాదులు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ ఉద్యమం ఫలితంగా ప్రభుత్వాల్లో కొంత మేర కదలిక వచ్చింది.

సమగ్ర గిరి జనాభివృద్ధి సంస్థ (ఐటిడిఏ)ను ఏర్పాటు చేసి దాని ద్వారా అడవుల్లో లభించే కుంకుడు కాయలు, జిగురు, తేనె వంటి వస్తువులను విక్రయించే ఏర్పాటు చేశారు. అయితే, ఈ సంస్థలో కూడా అవినీతి కారణంగా గిరిజనులకు దక్కాల్సిన ఫలాలు దక్కడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. గిరిజనుల సమస్య పరిష్కారానికి ఇందిరాగాంధీ హయాంలో కొంత ప్రయత్నం జరిగింది. రాజకీయంగా గిరిజనులకు ఉన్నత స్థానాలు కల్పించేందుకు ఆమె ప్రయత్నించారు. ఆమె హయాంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మంత్రివర్గంలోనూ, నామి నేటెడ్‌ పోస్టుల్లోనూ ప్రాధాన్యత ఇచ్చారు. గిరిజన సంక్షే మానికీ, బీసీల సంక్షేమానికీ ప్రత్యేక శాఖలను ఏర్పాటు చేసింది ఆయనే. అలాగే, గిరిజనులకు సేవలందించిన ఐఏఎస్‌ అధికారులను ప్రోత్సహించారు. ఐఏఎస్‌ అధికారులు ఎక్కడికక్కడ నిర్ణయాలు తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది ఆయనే. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఎస్‌ఆర్‌ శంకరన్‌ గిరిజనులతో కలిసిమెలిసి వారి ఆత్మబంధువుగా మెలిగారు, మారేడుమిల్లి సమీపంలో గుర్తేడులో కొంతమంది అధికారులను నక్సలైట్లు అపహరించినప్పుడు వారిని విడిపించడం కోసం శంకరన్‌ను నక్సలైట్ల వద్దకు దౌత్యానికి ఆనాటి ఉమ్మడి ప్రభుత్వం పంపింది. ఆయన దౌత్యం ఫలించింది.

అయితే, గిరిజనులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపైనా, కార్యక్రమాల పైనా నమ్మకం ఉండటం లేదు. దీనికి కారణం ప్రజాప్రతి నిధులు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి తమకు రావల్సిన ప్రయోజనాలన్నింటినీ కాజేస్తున్నారన్న అపోహ వారిలో ఏర్పడింది. దానిని తొలగించే ప్రయత్నం జరగలేదు. గిరిజనులలో విద్యా వ్యాప్తి కోసం ప్రభుత్వంతో పాటు, స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి. అయితే, గిరిజన ప్రాంతాల్లో పోస్టింగ్‌ ఇస్తే, సమీపంలోని పట్టణాలు, నగరాల్లో ఉపాధ్యాయులు కాపురముంటూ విజిటింగ్‌ ప్రొఫెసర్లుగా పాఠశాలలకు వచ్చి వెడుతుంటారన్న జోకులు వినిపిస్తుంటాయి. అలాగే, గిరిజన ప్రాంతాల్లో వైద్యశాల ఏర్పాటు ఆరంభ శూరత్వమే అవుతున్నాయి. గిరిజన ప్రాంతాల్లో డాక్టర్లుగా పని చేసేందుకు యువ వైద్యులు ముందుకు రాకపోవడం ఒక కారణమైతే, వైద్య ఆరోగ్య శాఖలో మందుల కోసం కేటాయించిన నిధులు కైంకర్యం కావడం మరో కారణం. ఒడిషా, బీహార్‌, చత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ వంటి రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో చాలా నయం. ఆదివాసుల్లో చైతన్యం పెరిగింది. అక్కడ ఖనిజాన్ని తవ్వుకుని పోయేందుకు బహుళ జాతి సంస్థల కు కేంద్రం అనుమతి ఇవ్వడంతో గిరిజనులు తిరగ బడుతున్నారు. గిరిజనులు పట్టణ, నగర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు, పెట్టుబడిదారుల చేతుల్లో నలిగి పోతున్నారన్న వాస్తవాన్ని హక్కుల సంఘాల వారు కూడా పలు సందర్బాల్లో ప్రస్తావించడం, గిరిజనుల దోపిడీపై చలనచిత్రాలు రావడం వంటి కారణంగా కేంద్రం దృష్టికి వీరి సమస్య వెళ్ళింది. అందుకే, గిరిజనులకు ప్రాధాన్యత నిచ్చే అంశంపై ప్రధాని మోడీ దృష్టిని కేంద్రీకరించారు. గిరిజనుల కోసం కేటాయించే నిధులను గిరిజనేతరులైన ప్రజాప్రతినిధులు కాజేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నా వాటిపై ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోకపోవడం గిరిజనులపై వాటి ఉదాసీన వైఖరికి నిదర్శనం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement