Friday, April 26, 2024

అగ్నికణం అయితే అన్ని కోట్లా!

టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ కుంభకోణం అనగానే ఇండి యన్‌ నేషనల్‌ లోకదళ్‌ (ఐఎన్‌ఎల్‌డి) అధ్యక్షుడు ఓం ప్రకాష్‌ చౌతాలా పేరు గుర్తుకు వస్తుంది. ఉత్తరాదిలో రైతుల ఉద్యమానికి నాయకునిగా పేరొందిన జనతాదళ్‌ నాయకుడు దేవీలాల్‌ కుమారుడే చౌతాలా. ఆయన మాదిరిగా టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ కుంభకోణంలో పశ్చిమ బెంగాల్‌ మంత్రి పార్ధా చటర్జీ అరెస్టు కావడం దేశ రాజకీయాల్లో తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. ఆయన బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీకి సన్నిహితుడు. ప్రభుత్వంలోనే కాకుండా పార్టీ వ్యవహారాల్లో ఆమెకు అండగా ఉంటున్నారు. మమతా బెనర్జీని ఫైర్‌బ్రాండ్‌ అని మీడియా అభివర్ణిస్తూ ఉంటుంది. అంటే నిప్పు కణం అని చెప్పుకోవచ్చు. ఈ కుంభకోణం వెలుగులోకి రాగానే నిప్పుకి చెద పట్టడమేమిటని చాలా మంది ముక్కున వేలేసుకున్నారు. అయితే, ఇదంతా తమ నాయకురాలిని అప్రదిష్టపా లు చేయడానికి కేంద్రప్రభుత్వం ముఖ్యంగా కమలనాథులు పన్ని కుట్ర అంటూ చటర్జీతోపాటు పలువురు తృణ మూల్‌ నాయకులు ఎదురు దాడి చేశారు. కేంద్రంపై ఆమె రోజూ దాడి చేస్తున్నందున ఆమెను ఇరుకున పెట్టేందుకే ఈ కుంభకోణాన్ని కమలనాథులు వెలికి తీశారని జనం అనుమానించారు. అయితే, కేవలం ఆరోపణలకే పరిమితం కాకుండా,కోట్లాది రూపాయిల నగదును ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ (ఈడీ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత మరి రెండు రోజులకు చటర్జీ సన్నిహితురాలైన అపర్ణ ముఖర్జీ ఇంట్లో 27 కోట్లు పైగా స్వాధీనం చేసుకున్నారు.

ఇదంతా చటర్జీదని అంటే ఎవరూ నమ్మడం లేదు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆయన ఎన్నికల్లో ఫండ్‌ రైజర్‌ (నిధుల సేకరణకర్త)గా వ్యవహరిస్తూ ఉంటారు కనుక, ఆమెదే ఆ డబ్బంతా అని కమలనాథులు ధ్వజ మెత్తడం ప్రారంభించారు. అసలు ఒక రాష్ట్ర మంత్రిని ఈడీ అధికారులు అరెస్టు చేయడమే ఆ ప్రభుత్వానికి అప్రదిష్ట. వెంటనే ఆయనను మమత తన ప్రభుత్వం నుంచి, పార్టీ నుంచి బహిష్కరించి ఉండాల్సింది. ఆమె అలా చేయకపోగా ఆయనను సమర్ధిస్తూ వచ్చింది. దాంతో ఆమె పరువు పోయింది. నలుగురు ఉద్యోగార్ధుల ఫిర్యాదుల మేరకు ఈ కేసు దర్యాప్తును సీబీఐకి హైకోర్టు అప్పగించింది. ఈ కుంభకోణం పాతదే అయినా విచారణ ఇప్పటికీ సాగుతోంది. ఇది బయటపడగానే పార్థా చటర్జీని విద్యా శాఖ నుంచి మరో శాఖకు మమత బదలీ చేశారు. అయినప్పటికీ కోర్టు కేసు నడుస్తూనే ఉంది. దీనిని మమత పట్టించుకోలేదు. హైకోర్టు నియమించిన విచారణ కమిటీ దర్యాప్తులోఎన్నో వాస్తవాలు బయట పడినప్పటికీ ఎవరూ ఏం చేయలేరన్న ధీమాతో వ్యవహ రించారు. పైగా కేంద్రం రాజకీయ కక్షతో ఈ కేసునడిపి స్తోందని ఎదురు దాడి చేసేవారు. నిజానికి దీని వెనుక రాజకీయనాయకులెవరూ లేరు. ఉద్యోగార్ధులే ఉన్నారు. పార్ధా చటర్జీ తమ పార్టీలో అత్యంత ప్రముఖుడు కావడం వల్ల ఆయనను ఆమె వెనకేసుకుని వచ్చారు. కోర్టు పరిధి లోని ఈ కేసును కేంద్రం తవ్వితీసిందనడం న్యాయం కాదు. అయితే, ఉన్న అవకాశాన్ని కేంద్రం ఉపయోగించుకుని ఉండవచ్చు. కేంద్రంపైనా, బీజేపీ నాయకులపైనా ఆమె అనేక ఆరోపణలు చేస్తున్నారు.

ఆమె అవినీతికి అతీతురాలు కాదని నిరూపించడం కోసం కమలనాథులు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌లో లుకలుకలు కూడా ఇందుకు దోహదం చేసి ఉండవచ్చు. పార్టీలో ఎందరినో కాదని పార్ధాకు అతిగా ప్రాధాన్యం ఇచ్చారనీ, అన్నా అని సంబోధిస్తూ ఆయన చర్యలను కాపాడుకుంటూ వచ్చారని తృణమూల్‌ వర్గాలు వెల్లడించాయి. చటర్జీ సన్నిహితురాలు అపర్ణ ముఖర్జీ ఇంట్లోనే కాకుండా ఆమెవిగా చెప్పబడుతున్న నాలుగు ఖరీదైన కార్లనిండా నోట్ల కట్టలను కనుగొన్నారనీ, అయితే, ఆ కార్లు కనిపించడం లేదని వారు చెబుతున్నారు. పార్థా చటర్జీ బాధితులు తగిన ఆధారాలు చూపినందునే సీబీఐ, ఈడీ అధికారులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసి ఆయనను అరెస్టు చేశారు. అందుకే, చటర్జీ అరెస్టుపై మమతా బెనర్జీ నోరు మెదపడం లేదని రాజకీయ వ్యాఖ్యాతలు పేర్కొంటున్నారు. మమతా బెనర్జీపై గతంలో కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి.శారదా చిట్‌ఫండ్‌ పేరిట సుదీప్తో సేన్‌ అనే వ్యాపారి ఒక చిట్‌ ఫండ్‌ కంపెనీని స్థాపించి ఏజెంట్ల ద్వారా బెంగాల్‌లోనూ, తర్వాత త్రిపుర, ఒడిషాల్లో కోట్లాది రూపాయిల డిపాజిట్లు సేకరించాడు.ఆయన మమతాబెనర్జీ అభిమాని కావడం వల్ల ఈ కుంభకోణాన్ని ఆమె చూసీ చూడనట్టు ఊరుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ చిట్‌ఫండ్‌ కంపెనీ వ్యవహారాలపై అప్పట్లో పార్లమెంటులో పెద్ద వివాదం చెలరేగింది. ఈ కంపెనీలో ప్రధాన అధికారులు, పాత్రధారులంతా మమతాబెనర్జీ పార్టీకి చెందిన వారే. టిఎంసీ నాయకులకు కాంగ్రెస్‌, బీజేపీ నాయకులతో సంబంధాలున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement