Sunday, April 28, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 31

  1. మదమాతంగములందలంబులుహరుల్మాణిక్యముల్పల్లకుల్
    ముదితల్చిత్రదుకూలముల్పరిమళంబుల్ మోక్ష మీజాలునే
    మదిలో వీనినపేక్ష చేసి నృపధామద్వారదేశంబు గా
    చి దినంబుల్వృథపుత్తురజ్ఞులకటా! శ్రీకాళహస్తీశ్వరా!

    ప్రతిపదార్థం : శ్రీకాళహస్తీశ్వరా! మద – మాతంగములు – మదించిన ఏనుగలు, అందలంబులు – మేనాలు, హరుల్ – గుఱ్ఱాలు, మాణిక్యముల్ – రత్నాలు, పల్లకుల్ – పల్లకీలు, ముదితల్ – స్త్రీలు, చిత్రదుకూలముల్ – రంగురంగుల వస్త్రాలు, పరిమళంబుల్ – సుగంధద్రవ్యాలు, మోక్షము – ముక్తిని, ఈన్ – చాలునే – ఇవ్వగలవా? (ఇవ్వలేవు అని భావం), అజ్ఞులు – జ్ఞానహీనులైనవారు, మదిలో – మనస్సులో, వీనిన్ – ఈ పైన చెప్పినవాటిని, అపేక్ష చేసి – కోరి, నృప – రాజుల యొక్క, ధామ – భవనముల, ద్వారదేశంబునన్ – గుమ్మముల వద్ద, కాచి – కనిపెట్టుకొనియుండి, దినంబుల్ – రోజులు, అనగా కాలాన్ని, వృథపుత్తురు- వ్యర్థంగా (నిరుపయోగంగా) గడిపేస్తారు. అకటా! – అయ్యో! (విచారింపదగిన విషయము కదా అని భావం)
    తాత్పర్యం:
    శ్రీకాళహస్తీశ్వరా! వైభవ, భోగచిహ్నాలైనమదపుటేనుగలు, గుఱ్ఱాలు, రత్నాలు, పల్లకులు, స్త్రీలు, రంగురంగులవస్త్రాలు, సుగంధద్రవ్యాలు మోక్షాన్నియ్యగలవా? (ఇవ్వలేవు). మనసులో వీటిని కోరుకొని అజ్ఞానులైన జనులు రాజద్వారాల వద్ద కాచుకొని ఉండి, కాలాన్ని వృథ చేస్తారు.

    విశేషం:
    ఇది కూడ మానవుల అజ్ఞానానికి జాలిపడుతూ వేదన చెందుతూ చెప్పిన చెప్పిన పద్యం. లౌకికభోగాలు మోక్ష మీయ లేవని తెలిసి కూడా మానవులు అజ్ఞానంతో వాటినే కోరుకుని రాజులని సేవించబోతారు. వాళ్ళు అట్లా చేయటానికి అజ్ఞానమే కారణమని ధూర్జటి వేదన.
    దానితో పాటు రాజనిరాసనం కూడ ఉంది ఈ పద్యంలో…
శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 3
డాక్టర్ నందివాడ అనంతలక్ష్మి

ఇదికూడా చ‌ద‌వండి : శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 30

Advertisement

తాజా వార్తలు

Advertisement