Friday, December 6, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం

104. ఘడియల్ రెంటికొ, మూటికో, ఘడియకో, కాదేని నేడెల్లియో
కడ నేడాదికొ యెన్నడో యెరుగ మీకాయంబు లీ భూమిపై
బడగా నున్నవి, ధర్మమార్గ మొకటిం బాటింపరీ మానవుల్
చెడుగుల్ నీ పదభక్తియుం దెలియరో శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వరా!, ఈ కాయంబులు- ఈ శరీరాలు, ఘడియకో- ఒక్క ఘడియకు గాని, ఘడియల్ రెంటికొ- రెండు ఘడియల కాలానికి గాని, మూటికో- మూడు ఘడియలకి గాని, కాదు- ఏని- కాక పోతే, నేడు- ఈ రోజో, ఎల్లి- ఓ-రే పో కడన్- చివరకు, ఏడాదికి- ఓ- ఒక సంవత్సరానికో, భూమిపై- ఈ నేల మీద, పడన్- కాన్-పడిపోవటానికి సిద్ధంగా, ఉన్నవి- ఉన్నాయి, ఎన్నడో- ఎప్పుడో మాత్రం, ఎఱుగము- తెలియము, ఈ మానవుల్- ఈ మనుషులు, చెడుగుల్- దుష్టులు, ధర్మమార్గము- ధర్మమైన దారిని, ఒకటిన్- ఒక్కదానిని కూడ, పాటింపరు- అనుసరించరు, నీ పదభక్తియున్- నీ పాదముల యందలి భక్తిని కూడ, తెలియరు- ఓ- తెలుసుకోరు కదా!
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! ఈ శరీరాలు ఒక ఘడియకో, రెండుఘడియలకో, మూడుఘడియల కో, కాకుంటే ఈ రోజో, రేపో, అదీ కాకుంటే ఒక ఏడాదికో నేలబడక తప్పదు. (మరణం తథ్యం) కాని, ఎప్పుడో మాత్రం తెలియదు. ఈ సంగతి తెలిసి కూడా దుష్టవర్తనులైన మానవులు ధర్మమార్గంలో నడవరు, నీ పదభక్తి నైనా కలిగి ఉండరు. కారణం తెలియదు.
విశేషం: అస్థిరమైన శరీరాలని నమ్మి, వాటి పోషణకై చెడుమార్గాలలో నడిచే మానవులు శాశ్వతమైన శివపాదభక్తిని మాత్రం తెలియకపోవటం ఎంతో విచారకరమైన సంగతి అని ధూర్జటి వేదన.

డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement