Friday, December 6, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం

81.కేదారాది సమస్త తీర్థములు కోర్కింజూడబోనేటికిన్
కాదా ముంగిలి వారణాసి? కడుపే కైలాస శైలంబు? నీ
పాదధ్యానము సంభవించు నపుడేభావింపగా, జ్ఞానల
క్ష్మీదారిద్ర్యులు గారె లోకులట! శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం:శ్రీకాళహస్తీశ్వరా!, కేదార- ఆది- కేదారము మొదలైన, సమస్త తీర్థములు- అన్ని పుణ్యక్షేత్రాలు, కోర్కిన్- కోరికతో, చూడన్- పోన్- ఏటికిన్- చూడటానికి వెళ్ళవలసిన అవసరం ఏమిటి?, భావింపగాన్- సరిగా భావన చేసినప్పుడు (ఆలోచిస్తే), నీ పాదధ్యానము- నీ పాదాలని ధ్యానించటం, సంభవించు-అపుడు-ఏ- కలిగినప్పుడే, ముంగిలి- పెరడు (ఇంటి ముందుభాగం), వారణాసి- వారణ, అసి అనే నదుల మధ్య భాగం అయిన కాశీపట్టణంగాను, కడుపు్శ ఏ- పొట్టయే, కైలాసశైలంబు- కైలాసపర్వతంగాను, కాదు- ఆ- కాదా? కాకపోదు కదా?(అవుతుంది అని భావం), అకటా!- అయ్యో!, లోకులు- లౌకికజీవనం గడిపేవారైన మానవులు,జ్ఞానలక్ష్మీదారిద్ర్యులు- జ్ఞానం అనే సంపద లేక పోవటం వల్ల భాగ్యహీనులు, కారు-ఎ- అవుతారు కదా!
తాత్పర్యం:శ్రీకాళహస్తీశ్వరా! నీ పాదములయందు భక్తి కుదురుగా నిలిచి నట్లైతేకేదారం మొదలైన పుణ్యతీర్థాలనన్నింటిని దర్శించటానికి వెళ్ళవలసిన పని ఏమిటి? భావింపగా ఇంటి ముందున్న పెరటి భాగమే కాశీక్షేత్రం కాదా? కడుపే కైలాసమై పోదా? లోకులు జ్ఞానమనే సంపద విషయంలో పేదలు కదా! పాపం!!
విశేషం: లలితాదేవిని గూర్చి “అంతర్ముఖసమారాధ్య”, “బహిర్ముఖసుదుర్లభ” అని చెప్పటం జరిగింది. సదాశివుడైనా అంతే! బాహ్యపూజలెన్నైనామానసికపూజకిసరితూగవు. మనసు కున్న శక్తి ఇంతటి దని చెప్పలేము. నిజమైన భక్తి కుదిరి నట్లయితేసర్వతీర్థాలు, క్షేత్రాలు మన సమీపానికే వస్తాయి. నిజానికి అవన్నీ మనలోనే ఉన్నాయి. గుర్తించటానికి భావన చేయాలి. ఒక భావాన్ని గ్రహించి అది వంటబట్టి ఆత్మగత మయ్యేట్టు చేయటం భావన. ఉదాహరణకి జీలకర్రని నిమ్మరసంలో నానపెట్టగా పెట్టగా నిమ్మరసం అంతా జీలకర్రకి పట్టి, నిమ్మరసం అయిపోతుంది. మిగిలిన జీలకర్రని “భావనజీలకర్ర” అంటారు. అదేవిధంగా ఏదైనా భావనలో ఆత్మ లేక జీవుడు ఊరి దాన్ని వంటపట్టించుకోటం భావన. ‘భావింపగా’ అంటే భక్తుడు శివుణ్ణిగూర్చిన భావనలో ఊరి ‘శివత్వాన్ని’ తనలో జీర్ణించుకొని, దానిని తనలో భాగంగా చేసుకోటం అన్నమాట.
లోకులు అంటే లౌకికజీవనం లోనే కుతూహలం కలవారుఅని అర్థం.
శ్రీకాళహస్తీశ్వరుడిదేవేరిజ్ఞానప్రసూనాంబ.

డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement